బెలుం గుహలకు ప్రాచుర్యం..
ABN, Publish Date - Jun 14 , 2025 | 01:33 AM
కొన్ని వేల సంవత్సరాల క్రితం నదీ ప్రవాహంతో సహజ సిద్ధంగా ఏర్పడిన బెలుం గుహలకు మరింత అరుదైన గుర్తింపు దక్కింది.
భౌగోళిక వారసత్వ గుర్తింపునిచ్చిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
దేశ పర్యాటక పటంలో దక్కనున్న ప్రత్యేక స్థానం
అంతర్జాతీయంగా ప్రచారం దక్కే అవకాశం
కొలిమిగుండ్ల, జూన్ 13(ఆంధ్రజ్యోతి): కొన్ని వేల సంవత్సరాల క్రితం నదీ ప్రవాహంతో సహజ సిద్ధంగా ఏర్పడిన బెలుం గుహలకు మరింత అరుదైన గుర్తింపు దక్కింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బెలుం గుహలను భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ప్రపంచంలోనే హిమయాత్ గుహల తర్వాత రెండో అతి పెద్ద గుహలుగా, దేశంలో అతి పొడవైన గుహలుగా బెలుం గుహలు ప్రసిద్ధి కెక్కాయి. నిత్యం దేశ విదేశీ పర్యాటకులతో కళకళలాడుతున్న బెలుం గుహలు ప్రవేశ రుసుం ద్వారా రూ.1కోటి నుండి రూ.1.50కోట్ల వరకు పర్యాటక శాఖకు ఆదాయాన్ని గడిస్తున్నాయి. ఈ గుహలను మొట్ట మొదటగా 1884లో ఐరోపాకు చెందిన రాబర్ట్ బ్రూస్‌ఫూటే వెలుగులోకి తెచ్చారు. ఆ తర్వాత 1982-84 మధ్య కాలంలో హెచ్‌డి గేబర్ అనే పశ్మిమ జర్మనీకి చెందిన గుహల పరిశోధకుడు తన బృందంతో గుహల్లో పరిశోధన జరిపారు. టార్చ్ లైట్ల సహాయంతో 3.225 కిలోమీటర్లు లోపలికి వెళ్లి, పరిశోధించి, గుహల మ్యాప్‌ను రూపొందించారు. అనంతరం 1989లో ఏపీ ఆర్కియాలజీ డిపార్టుమెంట్ వారు గుహలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1997లో ఆల్ ఇండియా రేడియో బృందం స్థానికుల సహాయంతో గుహలను సందర్శించి, మొట్టమొదటగా ప్రత్యేక కథనాన్ని ఆకాశవాణి ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. 2000 సంవత్సరంలో ఏపీ టూరిజం శాఖ వీటిని అభివృద్ధి చేసింది. రూ.1 కోటికి పైగా నిధులతో గుహల్లో లైటింగ్, సీసీ రోడ్డు, ఆక్సిజన్ కోసం బ్లోయర్స్, వాటర్ ఫౌంటెన్లు, వంతెనలు తదితర ఏర్పాట్లు చేశారు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గుహలను జాతికి అంకితం చేశారు.
బెలుం గుహల చరిత్ర
ఆసియా ఖండానికే తలమానికంగా ఉన్న బెలుం గుహల పొడవు సుమారు 2,114 మీటర్లు. ప్రపంచంలో ప్రథమ స్థానంలో అమెరికాలోని హిమయాత్ గుహలుండగా, రెండో స్థానంలో బెలుం గుహలు ఉండడం గర్విం చదగ్గ విషయం. బెలుం గ్రామానికి దగ్గరగా, బెలుంలో ఉండే మరో గుహ(బావి)తో ఇవి అనుబంఽ దంగా ఉండటంతో బెలుం గుహ లుగా ప్రాచుర్యం లభించింది. బెలుం గుహలకు మూడు ముఖ ద్వారాలు ఉన్నాయి. ఒకటి గుహల్లోకి వెళ్లే ద్వారం అయితే రెండోది బెలుం గుహలకు 2 కిలోమీటర్ల దూరంలో బెలుం గ్రామంలో ఉంది. ఇది ఎప్పూడూ నీటితో నిండి ఉంటుంది. దీన్ని గ్రామస్థులు దిగుడు బావిగా ఉపయో గిస్తున్నారు. ఇక మూడోది గుహల్లోకి ప్రవేశించే ద్వారం పక్కనే కనిపిస్తుంది. గుహల్లోకి ప్రవేశించగానే లోపల 100 మీటర్ల విశాలంతో రహదారి కనిపిస్తుంది. ఎత్తు 20 మీటర్లకు పైబడి కనిపిస్తుంది. అలా కొంత దూరం లోపలికి వెళితే 50 మీటర్లు వెడల్పుమరింత లోపలికి వెళితే ఒక్క మనిషి మాత్రమే లోపలికి వెళ్లగలిగే ఇరుకుగా ఉన్నాయి. ఇంత చిన్న చిన్న పాయలుగా విడిపోయిన గుహలను పర్యాటక శాఖ ఇప్పటికీ అభివృద్ధి చేయకపోయింది. మరోవైపు ఈ బెలుం గుహలకు అనంతపురం జిల్లా గుత్తి గుహలతో అనుసంధానం ఉందనే ప్రచారం ఉంది. తాజా గుర్తింపుతో బెలుం గుహలకు మరింత ప్రత్యేకత ఏర్పడింది.
Updated Date - Jun 14 , 2025 | 01:33 AM