నేను మోనార్క్‌ను..!
ABN, Publish Date - Jun 20 , 2025 | 11:58 PM
నేను మోనార్క్‌ను..!
నన్ను ఎవరు ఏమీ చేయలేరు
మహానంది ఆలయంలో చక్రం తిప్పుతున్న చిన్నసారు...
ఎప్పుడు డ్యూటీలో ఉంటారో తెలియని వైనం
కిందిస్థాయి సిబ్బందిపై సైతం పెత్తనం
ఇతర ఉద్యోగులపై పైస్థాయి అధికారులకు ఫిర్యాదులు
మహానంది, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): మహానంది ఆలయంలో పనిచేసే ఓ చిన్నసారూ వ్యవహారం మోనార్క్‌ను తలపిస్తోంది. ఎప్పుడు విధులకు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. చిన్నసారు విధులకు వచ్చినా రాకున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన విధులకు వచ్చిన సమయమే డ్యూటీ అనుకోవాలి అనే వ్యవహార శైలిలో నడుచుకోవడంతో శుక్రవారం మహానంది క్షేత్రంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఉదయం విధులకు హాజరైతే మధ్యాహ్నం తర్వాత డ్యూటీలో ఉంటారో లేదో తెలియదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉదయం కాసేపు విధులకు హాజరై హడావిడి చేసి అనంతరం విందు వినోదాలతో కాల క్షేపం చేస్తారు. మధ్యాహ్నం తర్వాత విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సారూ వ్యవహారంపై ఎవరైన ఉద్యోగులు ప్రశ్నిస్తే నేనేప్పుడు డ్యూటీలోనే ఉన్నాను. ‘ఎవరు నన్ను ప్రశ్నించేది, ఇక్కడ నేనే మోనార్క్, ముందు నువ్వు డ్యూటీ సక్రమంగా చేసుకో’ అని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. సాయంత్రం తర్వాత ఆన్‌లైన్‌లోకి ఏకాంతంగా వచ్చి కిందిస్థాయిలో పనిచేసే సిబ్బందితో మీకు అప్పగించిన విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదు. పని అంటే ఇదేనా అంటూ పెత్తనం చలాయిస్తున్నట్లు తెలిసింది. దీనికి తోడు తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు పైస్థాయి అధికారులకు కిందిస్థాయి సిబ్బందిపై ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఆసారూకు ఉన్నతస్ధాయి అధికారి అండ ఉండటంతోనే ఇలా వ్యవహారిస్తున్నాడా లేక నన్ను ఎవరూ ఏమి చెయ్యలేరు అనే వ్యవహార ధోరణితో నడుస్తున్నాడో ఆ పరమశివునికే తెలియాల్సి ఉంది.
ఒక ఉద్యోగిపై ఆరోపణలు రాగా..
మహానంది ఆలయంలో విధులు నిర్వహించే ఒక ఉద్యోగిపై సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో విచారిస్తున్నాం. ఇంతకీ ఆ ఉద్యోగి ఎవరు? ఎంతటిస్థాయిలో వ్యవహారం నడుపుతున్నడు అనే అంశంపై క్రింది స్ధాయి సిబ్బందిని విచారించి, చర్యలు తీసుకుంటాం.
ఎర్రమల్ల మధు, ఏఈవో, మహానంది క్షేత్రం
Updated Date - Jun 20 , 2025 | 11:58 PM