ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నల్లమలలో కళ్లుగప్పి కోట్లు కొట్టేశాడు..!

ABN, Publish Date - Jun 26 , 2025 | 11:50 PM

నల్లమల.. ఓ అందాల అటవీ ప్రాంతం. చెంచులు, జింకలు, అరుదైన పక్షి జాతులు... లెక్కలేనన్ని చిరుతలు, పెద్దపులులకు ఆవాసం నల్లమల అభయారణ్యం. ఇంతటి సువిశాలమైన అటవీ సంపద ఉన్న నల్లమలలో అవినీతి, అక్రమాలకూ కొదువలేదు.

అటవీశాఖలో ఓ ఉద్యోగి చేతివాటం

విచారణలో విస్తుపోయే నిజాలు

ఇప్పటికే రూ.4.35కోట్ల కాజేసినట్లు గుర్తింపు..?

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ స్వాహా

కొరవడిన ఐఎఫ్‌ఎస్‌ల పర్యవేక్షణ

ఆరుగురితో అటవీశాఖ ప్రత్యేక విచారణ

పరారీలో నిందితులు

నల్లమల.. ఓ అందాల అటవీ ప్రాంతం. చెంచులు, జింకలు, అరుదైన పక్షి జాతులు... లెక్కలేనన్ని చిరుతలు, పెద్దపులులకు ఆవాసం నల్లమల అభయారణ్యం. ఇంతటి సువిశాలమైన అటవీ సంపద ఉన్న నల్లమలలో అవినీతి, అక్రమాలకూ కొదువలేదు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ పరిధిలో ఓ ఇంటి దొంగ వ్యవహారం కలకలం రేపుతోంది. ఐఎఫ్‌ఎస్‌ స్థాయి అధికారులను సైతం కళ్లుగప్పి దర్జాగా కొట్లు కొట్టేశాడు. ఇందులో ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఈ తతంగం కేవలం శాఖాధిపతులకే తప్ప ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు లేదు. దీని వల్ల విచారణ సైతం మందకొడిగా సాగుతోంది.

ఆత్మకూరు, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు టైగర్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా అకౌంట్స్‌ అడ్మినిస్ర్టేటివ్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న చాంద్‌బాషా 2024 జూలైలో ఉద్యోగ విరమణ పొందాడు. అయితే ఆయన పని చేసినంత కాలం అంతులేని అక్రమాలకు పాల్పడ్డాడు. వచ్చే జీతం సరిపోలేదో.. ఏమోకానీ కంచె చేను మేసినట్లుగా అటవీశాఖకు వచ్చే ఆదాయంపై కన్నేసి కోట్ల రూపాయలు కొట్టేశాడు. ప్రత్యేకించి ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని బైర్లూటి, శిఖరం, లింగాలగట్టు ఫారెస్ట్‌ చెక్‌పోస్టుల నుంచి ప్రతినెల రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూళ్లవుతోంది. ఈ మొత్తాన్ని రోజువారీగా ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్‌ పేరిట బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. నెల రోజులు పూర్తయిన తర్వాత ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ ఫండ్‌ (ఏపీటీసీఎఫ్‌)కు బదలాయింపు చేయాల్సి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఆర్టీజీఎస్‌ ద్వారా నగదు బదిలీ చేసే వ్యవహారంలో చాంద్‌బాషా చేతివాటం ప్రదర్శించేవాడు. ఒక నెలలో వచ్చిన మొత్తాన్ని ఒకే చెక్కు ద్వారా కాకుండా మూడు, నాలుగు చెక్కులుగా వేరుచేసి అందులో కొన్ని చెక్కులను తన అవసరాల కోసం దారి మళ్లించుకున్నాడు. ఇందులో భాగంగానే 2024 మార్చి, ఏప్రిల్‌ నెలలో రూ.1,85,793, రూ.17,40,200 విలువ గల రెండు చెక్కులను తమ బంధువులకు సమీప సంబంధించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలకు మళ్లించి స్వాహా చేశాడు. ఈ విషయాలను సాక్ష్యాత్తు ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్‌ సాయిబాబా వెల్లడించారు. కాగా డివిజన్‌లో అటవీ చెక్‌పోస్టులు 2016 నుంచి ప్రారంభం కాగా అప్పటి నుంచే చాంద్‌బాషా ఈ తరహాలో నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.

బాగోతం బయటపడిందిలా...

ఏళ్ల తరబడి ఇక్కడే తిష్టవేసి ఎవరూ.. ఇక్కడికి బదిలీపై రాకుండా జాగ్రత్తపడిన చాంద్‌బాషా ఎట్టకేలకు 2024 జూలైలో రిటైర్‌ అయ్యారు. ఆ తర్వాత కూడా కొంతకాలం గౌరవవేతనంతో ఇక్కడే పనిచేయాలని ప్రయత్నించినప్పటికీ అది కుదరలేదు. ఈయన స్థానంలో విశాఖపట్నం నుంచి చంద్రశేఖరరాజు ఇక్కడికి వచ్చారు. అయితే చాంద్‌బాషా అతితక్కువ రికార్డులు అందించడంతో అతనికి అనుమానం వచ్చింది. తొలుత 2024 మే, ఏప్రిల్‌ నెలలవి పరిశీలించగా అందులో ఏకంగా రూ.20లక్షల వరకు అవకతవకలు చోటుచేసుకున్నాయి. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి లోతుగా దర్యాప్తు చేయగా ఇప్పటి వరకు రూ.4.35కోట్ల అవినీతి వెలుగు చూసింది.

చెక్కులో పేరు ఒకటి.. అకౌంట్‌ నంబర్‌ మరొకటి

అకౌంట్స్‌ అడ్మినిస్ర్టేటివ్‌ అధికారిగా ఉన్న చాంద్‌బాషా చాలా తెలివిగా తన అక్రమాలను కొనసాగించాడు. ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్‌ బ్యాంకు ఖాతాకు జమచేసిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ ఫండ్‌ (ఏపీటీసీఎఫ్‌), ఫారెస్టు డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎఫ్‌డీఏ) తదితర సంస్థలకు ఆర్టీజీఎస్‌ ద్వారా బదిలీ చేసేవారు. ఈక్రమంలో చెక్కుపై ఫలానా సంస్థ పేరును బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ స్థానంలో తనవాళ్లకు చెందిన ఇతర బ్యాంకు అకౌంట్‌ నంబర్లను రాసేవాడు. ఇది గమనించని డ్రాయింగ్‌ ఆఫీసర్లు చెక్కుపై సంతకాలు చేయగా ఆ తర్వాత ఆర్టీజీఎస్‌ ఫారమ్‌పై కూడా పేరు ఒకటి.. అకౌంట్‌ నంబర్‌ మరొకటి రాసి ఆఫారమ్‌పై ఆయనే సంతకం చేసి దర్జాగా తన బినామీ వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు అటవీశాఖ సొమ్మును మళ్లించాడు. అయితే నగదు బదిలీకి సంబంధించిన నెఫ్ట్‌ ఫారమ్‌లో కూడా అధీకృత అధికారి(డిప్యూటీ డైరెక్టర్‌) సంతకం ఉండాలని తెలిసింది. కానీ ఆ స్థానంలో చాంద్‌బాషా సంతకం చేసినప్పటికీ అవేమి పరిగణలోకి తీసుకోకుండా యూనియన్‌ బ్యాంకు అధికారులు నగదు బదిలీ చేయడం గమనార్హం. ఇదిలావుంటే యూనియన్‌ బ్యాంకు నుంచి అదే బ్యాంకుకు నగదు బదిలీ చేస్తున్న సందర్భంలో మాత్రమే అకౌంట్‌ వివరాలు కనిపిస్తాయి. యూనియన్‌ బ్యాంకు నుంచి ఇతర బ్యాంకులకు బదిలీ చేసినట్లయితే యూనియన్‌ బ్యాంకు సైట్‌లో ఖాతా వివరాలు కనిపించవు. ఇదేఅదునుగా చాంద్‌బాషా యూనియన్‌ బ్యాంకు నుంచి ఇతర బ్యాంకులను సొమ్మును బదిలీ చేస్తూ వచ్చాడు.

అడ్డగోలుగా అటవీ సొమ్ము మళ్లింపు

అటవీశాఖకు సమకూరిన ఆదాయాన్ని బాధ్యతగా నిర్ధేశించిన బ్యాంకు ఖాతాలకు జమచేయాల్సిన చాంద్‌బాషా అడ్డగోలుగా దారిమళ్లించినట్లు స్పష్టమవుతోంది. చెక్‌పోస్టుల నుంచి వచ్చిన ఆదాయంలో చేతివాటం ప్రదర్శించడమే కాకుండా ఇతర చెల్లింపులు, కొనుగోలు వ్యవహారంలో కూడా ఇదే పంథాను కొనసాగించాడు. అందులో ప్రధానంగా డీజల్‌ బిల్లులకు సంబంధించి తనవారికి చెందిన మూతబడిన రాకిన్‌ ఫ్యూయల్స్‌ ఖాతాకు రూ.17.40లక్షలను ఆర్టీజీఎస్‌ చేయించాడు. అదేవిధంగా తన కుటుంబీకులైన హమీదా, మగ్బూల్‌బాషాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున చెక్కుల ద్వారా నగదు బదిలీ చేశాడు. అంతేకాదు అడవుల్లో ఏర్పాటు చేసే ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల కొనుగోలుకు సంబంధించి రూ.30లక్షల వరకు హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్‌ టెలికమ్యూని కేషన్స్‌కు పంపించినట్లు తెలిసింది. నిజానికి ఆ సంస్థ నుంచి ఎన్ని కెమెరాలు కొనుగోలు చేశారు? వాటిని ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, కొనుగోలుకు ముందు కొటేషన్‌ వ్యవహారం ఇలాంటిదేమి లేదు. అందులో కూడా భారీగా నొక్కేసినట్లు సమాచారం.

ఉద్యోగుల ఈపీఎ్‌ఫ్‌, ఈఎస్‌ఐ కూడా స్వాహా

అటవీశాఖలో దేన్నీ వదలని చాంద్‌బాషా తన అవినీతిని కొనసాగించాడు. చివరికి చిన్నపాటి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐని వదల్లేదు. వాస్తవానికి ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌ పరిధిలో పనిచేస్తున్న సుమారు 330 మంది ప్రొటెక్షన్‌వాచర్లు, డ్రైవర్లుగా, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా తదితర ఔట్‌సోర్సింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరికొచ్చి కొద్దిపాటి వేతనం నుంచి ప్రతినెల ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ కొంత తీసేసి ఆయా సంస్థలకు జమ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ సొమ్మును కూడా జమ చేయకుండా తన అవసరాలకు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ఈఎస్‌ఐ ఖచ్చితంగా ఆన్‌లైన్‌ లేదా చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. ఆ సొమ్ముకు కూడా చెక్కు రాసి డ్రా చేయడంలో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అంతా చాంద్‌బాషా కనుసన్నల్లోనే

చాంద్‌బాషా పనిచేసినంత కాలం ఇక్కడ అంతా ఆయన కనుసన్నల్లోనే సాగినట్లు తెలుస్తోంది. తన కోటరీతో వచ్చిన డిప్యూటీ డైరెక్టర్లను మచ్చిక చేసుకుని తను చెప్పిందే వేదంగా పనులు జరిగించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఐఎఫ్‌ఎస్‌ అధికారులు సైతం చాంద్‌బాషా చెప్పిన చోట సంతకాలు చేస్తూ వచ్చారని ప్రచారం ఉంది. అంతేకాదు రేంజర్లను కూడా చాంద్‌బాషా తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు తెలిసింది. అడవుల్లో జరిగే వివిధ సివిల్‌ వర్క్‌, ఇతర సీడ్‌ ప్లాంటేషన్‌ తదితర పనులకు సంబంధించి బిల్లులన్ని చాంద్‌బాషే చక్కదిద్దేవాడు. అక్కడ పనులు జరిగినా, జరగకున్నా.. కావాల్సినంతా బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రేంజర్లకు కూడా భారీగా వాటాలు ముట్టినట్లు విమర్శలు లేకపోలేదు. వాస్తవానికి రేంజ్‌ పరిధిలో జరిగే పనులన్ని చెక్కుల ద్వారానే లావాదేవీలు జరగాల్సి ఉంది. కానీ ఓ రేంజర్‌ అటువంటి చెక్కులను తన సతీమణి పేరుతో డ్రా చేసుకున్న సందర్భాలను ప్రస్తుతం అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. అదే రేంజర్‌ చాంద్‌బాషా రిటైర్‌ అయినప్పటికీ ఆయన్ను కొనసాగించేలా ప్రయత్నాలు చేశాడు.

ఆరుగురితో విచారణ బృందం

ఆత్మకూరు అటవీశాఖను కుదుపేసిన చాంద్‌బాషా వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్‌ సాయిబాబా పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు చాంద్‌బాషా పరారీలో ఉన్నా రు. అదేక్రమంలో అటవీశాఖ కూడా ఈ ఘటనపై పీసీసీఎఫ్‌ ఏకే నాయక్‌ మే 19వ తేదిన ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని నియమిం చారు. ఇందులో ఎస్‌ఎన్‌టీఆర్‌ ఎఫ్‌డీపీటీ బీ.ఏ.కృష్ణమూర్తి, విజిలెన్స్‌ డీఎఫ్‌ఓ ఎన్‌.శివకుమార్‌, నంద్యాల సర్కిల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పద్మావ తి, ఆత్మకూరు, నంద్యాల డివిజన్లకు చెందిన అడ్మినిస్ర్టేటీవ్‌ ఆఫీసర్లు చంద్రశేఖరరాజు, జీఎస్‌. రవికుమార్‌, రమేష్‌లను నియమిందింది. కానీ.. ఇప్పటివరకు వీరిలో ముగ్గురు మాత్రమే ఒక విచారణ చేశారే తప్ప మిగతా దర్యాప్తును పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించి ప్రత్యేక విజిలెన్స్‌ కమిటీ లేక సిట్‌ వేస్తే తప్ప త్వరగా కొలిక్కి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

అమాయకులను బలిచేసి

ఆత్మకూరు అటవీశాఖ పరిధిలో అవసరమైన వివిధ బిల్లుల పుస్తకాలు, ఇతర స్టేషనరీకి సంబంధించిన ప్రతులను ఆత్మకూరులోని మహేశ్వర ప్రింటర్స్‌ వద్ద తయారు చేయిస్తుంటారు. ఈ క్రమంలో ఆ ప్రింటర్స్‌ యజమాని శివయ్యతో చాంద్‌బాషా పరిచయం చేసుకుని దారిమళ్లించే చెక్కులను శివయ్య అకౌంట్‌కు పంపి తద్వారా నగదు పొందేవాడు. ఈ లెక్కన శివయ్య, ఆయన భార్య, తల్లి బ్యాంకు ఖాతాల నుంచే రూ.2.5కోట్లకు పైగా డ్రా చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో శివయ్యను నిందితుడిగా చేర్చినట్లు తెలిసింది. అయితే తాను అమాయకుడినని, తనకేమి తెలియదని శివయ్య అటవీ, పోలీసు అధికారుల వద్ద ప్రాధేయపడినట్లు తెలిసింది. అయినప్పటికీ శివయ్యతో పాటు అతని భార్య, తల్లి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. దీంతో శివయ్య కుటుంబీకులు లబోదిబోమంటున్నారు.

అయోమయంగా ఆడిట్‌

చాంద్‌బాషా పనిచేసినంత కాలంగా ప్రతిఏటా ఇక్కడ ఆడిట్‌ అయోమయంగా జరిగినట్లు విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి ఇతర ప్రభుత్వశాఖ ఆడిట్‌ బృందాలు ప్రత్యేకంగా వచ్చి అన్ని కోణాలు దర్యాప్తు చేస్తాయి. అయితే అటవీశాఖలో మాత్రం సర్కిల్‌ ఆఫీసుకు చెందిన వారు వచ్చి ఆడిట్‌ చేస్తారు. వారు ఎంతవరకు జమ, ఖర్చుల వివరాలను పరిశీలించారే తప్ప ఆ సొమ్ము ఎక్కడికి బదిలీ అయింది, ఆ ఓచర్లు, ఇతర బిల్లుల పరిస్థితి ఏంటన్న వివరాలను పట్టించుకోలేదు. చివరికి సర్కిల్‌ ఆఫీసులో పని చేసే వారు సైతం చాంద్‌బాషా సరిగ్గానే డబ్బు బదిలీ చేస్తున్నాడా..? అన్నది ఏనాడూ చూసుకోలేదు. అంతేకాదు డ్రాయింగ్‌ ఆఫీసర్లు కూడా డబ్బు జమచేసి రిసిప్ట్‌లను పరిశీలించిన దాఖలాలు లేవు. ఇలా వ్యవస్థలో పర్యవేక్షణ లోపించడంతో చాంద్‌బాషా అక్రమాలు దర్జాగా సాగాయి.

సమగ్ర దర్యాప్తుకు సహకరిస్తున్నాం

తమ కార్యాలయంలో అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్డు అయిన చాంద్‌బాషాపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాము. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్లు వేయడంతో పోలీసులు కూడా కౌంటర్‌ ఫైల్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన చేసిన అక్రమాలపై సమగ్రంగా విచారిస్తున్నాము. పోలీసుల విచారణకు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాము. ఎవరైతే బినామీలుగా వ్యవహరించారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే పీసీసీఎఫ్‌ ఏకే నాయక్‌ ఆదేశాల వరకు ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటైంది. వారు కూడా దర్యాప్తు చేయనున్నారు.

- వి.సాయిబాబా, ఆత్మకూరు ప్రాజెక్ట్‌ టైగర్‌, డిప్యూటీ డైరెక్టర్‌

Updated Date - Jun 26 , 2025 | 11:50 PM