వారంలో అన్నదాత సుఖీభవ..
ABN, Publish Date - Jul 02 , 2025 | 12:32 AM
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని సత్వరమే అమలు చేసేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టింది.
ఉమ్మడి జిల్లాలో 4,63,021 మంది రైతులకు లబ్ధి
కర్నూలు అగ్రికల్చర్, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని సత్వరమే అమలు చేసేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టింది. అర్హులైన రైతులను గుర్తించి వెంటనే ఈకైవైసీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో గత పది రోజుల నుంచి రైతు సేవా కేంద్రాలు, మీసేవా కేంద్రాల్లో ఈకేవైసీ చేయించేందుకు రైతులు ఆ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. కర్నూలు జిల్లాలో 2,77,224 మంది అన్నదాతా సుఖీభవ పథకానికి అర్హులు అని తేల్చారు. ఇప్పటి దాకా 2,22,284 మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసినట్లు వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. ఇంకా 3,735 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. 1,205 మంది రైతులను అనర్హులుగా ప్రకటించారు. అదే విధంగా నంద్యాల జిల్లాలో 1,85,297 మందిని అర్హులుగా తేల్చారు. అందులో 1,80,787 మంది రైతులు ఈకేవైసీ చేయించుకున్నారు. ఈ జిల్లాలో 4,510 మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. రెండు జిల్లాలో కలిపి 4,940 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది.
నిధుల విడుదలలో కేంద్రం జాప్యం
అన్నదాతా సుఖీభవ పథకం కింద.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రస్తుత ఖరీఫ్‌లో మొదటి విడతగా అందించాల్సిన రూ.2వేలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.5వేలను కలిపి మొత్తం మొదటి విడతలో రూ.7వేలను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు ఎదురు చూస్తున్నారు. గత నెలలోనే అన్నదాతా సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకేసారి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం ద్వారా విడుదలయ్యే రూ.2వేలతో కలిపి మొత్తం రూ.7వేలను అందించేందుకు సిద్ధ్దమైంది. అయితే కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాల వల్ల నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పథకం అమలుకు కాస్త జాప్యం జరిగే పరిస్థితి నెలకొంది. మరో వారం రోజుల్లో కేంద్రం మొదటి విడత రూ.2వేలను అందించే అవకాశం ఉంది.
Updated Date - Jul 02 , 2025 | 12:32 AM