చేనేతల కల సాకారం
ABN, Publish Date - May 07 , 2025 | 12:10 AM
ఎన్నో ఏళ్లుగా చేనేతలు ఎదురు చూస్తున్న మెగా టెక్స్‌టైల్ పార్కు కల ఎట్టకేలకు సాకారమైంది.
అట్టహాసంగా మెగా టెక్స్‌టైల్ పార్కు శంకుస్థాపన
చేనేతలకు ఉపాధి కల్పించడమే లక్ష్యం : మంత్రి సవిత
ఎమ్మిగనూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్లుగా చేనేతలు ఎదురు చూస్తున్న మెగా టెక్స్‌టైల్ పార్కు కల ఎట్టకేలకు సాకారమైంది. ఎమ్మిగనూరు మండలం బనవాసిలో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్‌టైల్ పార్కుకు మంగళవారం రాష్ట్ర మంత్రులు సవిత, టీజీ భరత్, ఎన్‌ఎండీ ఫరూక్, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రావడంతో చేనేతలకు స్వర్ణయుగం వచ్చిందన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి 365 రోజులు పని కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫ్రేమ్‌లూంను 90శాతం సబ్సిడీపై అందజేయడంతో పాటు యారన్‌తో పాటు మిగతా ముడి సరుకులను సొసైటీల ద్వారా సబ్సిడీ ధరలకు అందజేస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పవర్‌లూమ్స్‌కు 500యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు. త్వరలో చేనేతలకు హెల్త్ పాలసీని అమలు చేస్తామన్నారు.
తండ్రి కలను సాకారం చేసిన తనయుడు
-ఎన్‌ఎండీ ఫరూక్ , మైనార్టీ శాఖ మంత్రి
ఎమ్మిగనూరు అంటే దివంగత నేత మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డికి ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఎమ్మిగనూరు గురించే ఆలోచించేవారు. బీవీ మోహన్‌రెడ్డి అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. బీవీ మోహన్‌రెడ్డి ఈ ప్రాంతంలో ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేశారు. అయితే వారే ఆయనకు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రప్రభుత్వం చేనేతలను ఆర్థికంగా బలపరచాలన్న ఉద్ధేశంతో ఇలాంటి పార్కులను ఏర్పాటు చేస్తోంది. చేనేత పార్కు ఏర్పాటు చేయాలని బీవీ మోహన్‌రెడ్డి కలలు కన్నారు.. ఆ కలను ఆయన తనయుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి సాకారం చేశారు.
చేనేత జౌళిశాఖ కమిషనర్ రేఖారాణి మాట్లాడుతూ టెక్స్‌టైల్ పార్కును మొదటి ఫేస్‌లో అభివృద్ధి చేయడానికి ఏపీఐఐసీ నుంచి రోడ్లు, నీటి సదుపాయం కల్పించేందుకు రూ.6.9కోట్ల నిధులు కేటాయింపు చేశామని వెల్లడించారు. చేనేతలకు త్వరలో ఐడెంటీ కార్డులు ఇప్పిస్తామన్నారు. కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 8 నియోజకవర్గాల్లో స్థలాలను ఇప్పటికే గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, ఆలూరు, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జిలు వీరభద్రగౌడు, రాఘవేంద్రరెడ్డి, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, పరిశీలకులు శ్రీరాములు, జనసేన నాయకురాలు రేఖాగౌడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్, ఏడీహెచ్ నాగరాజరావు, ఏఎస్పీ హుసేన్‌పీరా, డీఎస్పీ ఉపేంద్రబాబు, ఏపీఐసీసీ చీఫ్ ఇంజనీర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి
సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి కృషి వల్లే టెక్స్‌టైల్ పార్కు సాధ్యమైంది. ఎంఎస్‌ఎంఈ పార్కులో మొదటి దశలో 22 ఎకరాల్లో మూడు నెలల్లో రూ.7కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మిగిలిన 55 ఎకరాల్లో టెక్స్‌టైల్ అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఎమ్మిగనూరు పేరిట శాలువలు తయారు చేస్తే టీటీడీతో పాటు ఇతర ప్రాంతాల్లో మార్కెటింగ్ చేసేందుకు సహకరిస్తా.
- పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
యువగళంలో హామీని నెరవేర్చిన నారా లోకేశ్
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకే 11 నెలల్లోనే ఎమ్మిగనూరులో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేశాం. 2004లో నా తండ్రి బీవీ మోహన్‌రెడ్డి అపెరల్ పార్కు తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆ సంస్థను పులివెందులకు తరలించుకుపోయారు. 2014లో ఇక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు హోదాలో టెక్స్‌టైల్ పార్కుకు స్థలం కేటాయించారు. ఆ కక్షతోనే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ చేనేతలపై ఇబ్బందులకు గురి చేసేలా ఉపాధికి ఉపయోగపడే పార్కు స్థంలో ఇళ్ల పట్టాలు ఇచ్చి తన నైజాన్ని చాటుకున్నాడు.
- జయనాగేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మిగనూరు
రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు
రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోంది. కొందరు అభివృద్ధిపై కారు కూతలు కూస్తున్నారు.. వారి నోరు మూయించేలా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో భాగమే ఎమ్మిగనూరులోని టెక్స్‌టైల్ పార్కు. వైసీపీ హయాంలో చేనేతలను నాశనం చేసేందుకే టెక్స్‌టైల్ పార్కుకు కేటాయించిన స్థలంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు.
- పార్థసారథి, ఎమ్మెల్యే, ఆదోని
Updated Date - May 07 , 2025 | 12:10 AM