పశుగ్రాసానికి నిధులు
ABN, Publish Date - Apr 26 , 2025 | 01:01 AM
ప్రస్తుత వేసవిలో రైతులు పాడి పశువుల పోషణ భారం భరించలేకపోతున్నారు. పశువులను పస్తులు పెట్టలేక సంతకు తీసుకెళ్లి కబేళాలకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితులను గుర్తించిన కూటమి ప్రభుత్వం పాడి పశువులకు సమృద్ధిగా గ్రాసం (గడ్డి) అందించేందు కోసం ఉపాధి నిధులను పెద్ద ఎత్తున వినియోగించేందుకు చర్యలు తీసుకుంది.
ఉమ్మడి జిల్లాలో 20వేల ఎకరాల్లో గ్రాసం పెంపు
ఉపాధి నిధులతో పశువులకు పుష్కలంగా మేత
కర్నూలు అగ్రికల్చర్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వేసవిలో రైతులు పాడి పశువుల పోషణ భారం భరించలేకపోతున్నారు. పశువులను పస్తులు పెట్టలేక సంతకు తీసుకెళ్లి కబేళాలకు విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితులను గుర్తించిన కూటమి ప్రభుత్వం పాడి పశువులకు సమృద్ధిగా గ్రాసం (గడ్డి) అందించేందు కోసం ఉపాధి నిధులను పెద్ద ఎత్తున వినియోగించేందుకు చర్యలు తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం జిల్లా వేయి ఎకరాల్లో మాత్రమే గ్రాసాన్ని పెంచేందుకు ఉపాధి నిధులను నామమాత్రంగా వినియోగించింది. దీంతో గ్రాసం తగినంత అందుబాటులో లేక వ్యాపారుల నుంచి కొనుగోలు చేయలేక అప్పట్లో రైతులు పాడి పశువులను సంతలకు తీసుకెళ్లి అమ్మేసేవారు. కూటమి ప్రభుత్వం రావడంతో పెద్ద ఎత్తున గ్రాసం పెంపకానికి ఉపాధి నిధులు వెచ్చించడం ద్వారా ప్రస్తుత వేసవిలో పాడిగేదెలకు పూర్తి స్థాయిలో గ్రాసాన్ని అందుబాటులో తెచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. 10 సెంట్ల నుంచి 50 సెంట్ల విస్తీర్ణంలో గ్రాసాన్ని పెంచుకునే రైతులకు రూ.33వేలు ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా అందించేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్కో మండలానికి 300 ఎకరాల చొప్పున పశుగ్రాసాన్ని పెంచేందుకు లక్ష్యాన్ని పశుసంవర్థక శాఖకు నిర్దేశించింది. కర్నూలు, నంద్యాల జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న మండలాల్లో పశుగ్రాసాన్ని పెంచేందుకు మొదటి ప్రాధాన్యత కింద ఆయా మండలాల్లో ఉపాధి నిధులను వెచ్చించేందుకు అధికారులు ప్రస్తుతం చర్యలు చేపట్టారు. వచ్చే ఏప్రిల్ నాటికి ఉమ్మడి జిల్లాలో 20వేల ఎకరాల్లో పశుగ్రాసాన్ని పెంచే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కర్నూలు, నంద్యాల జిల్లాల పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. రెండు జిల్లాలో 5 లక్షల దాకా పాడి పశువులు ఉన్నట్లు వారు తెలిపారు.
రైతులకు సువర్ణావకాశం
ఉపాధి నిధుల ద్వారా రైతులు, పాడిగేదెల పెంపకందారులు పశుగ్రాసాన్ని పెంచేందుకు నిధులను పెద్ద ఎత్తున ప్రభుత్వం కేటాయించనుంది. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. - శ్రీనివాస్, జేడీ, కర్నూలు
Updated Date - Apr 26 , 2025 | 01:01 AM