విహారం.. విషాదం
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:08 AM
అప్పటివరకు ఆ కుటుంబం ఆనందంతో గడిపింది.. ఎంతో ఉత్సాహంగా భాగ్యనగరానికి విహారయాత్రకు వెళ్లారు. అంతా సవ్యంగా ముగిసింది. ఇక తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. స్కార్పియో వాహనంలో స్వగ్రామమైన కడప జిల్లా మైదుకూరుకు బయలుదేరారు. దాదాపుగా సగానికి పైగా ప్రయాణం ముగిసింది. ఇక కొన్ని గంటల్లో గమ్యస్థానాలకు చేరుతారు అనుకున్నారు.. ఇంతలోనే విధి వక్రీకరించింది. ఉన్న ఫళంగా వారు ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వెళ్లి ఢీకొట్టింది. వాహనం నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న వారు చెల్లాచెదురుగా పడిపోయారు. అందులో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ అనంత లోకాలకు చేరారు. ఇందులో మూడు నెలల చిన్నారి కూడా మృత్యువాత పడటం ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టించింది.
ట్రాక్టర్‌ను ఢీకొన్న స్కార్పియో
నలుగురి దుర్మరణం ఫ ఆరుగురికి తీవ్రగాయాలు
ప్రమాదంలో మూడు నెలల చిన్నారి మృతి
క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలింపు
ఓర్వకల్లు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు సంబరంగా విహార యాత్రకు వెళ్లి సరదాగా ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా మృత్యు వెంటాడింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై సోమయాజులపల్లె-కాల్వబుగ్గ గ్రామాల మధ్యలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఓర్వకల్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్ తెలిపారు. వివరాలు.. కడప జిల్లా మైదుకూరుకు చెందిన పది మంది కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు విహారయాత్ర వెళ్లారు. యాత్ర ముగించుకొని స్కార్పియో వాహనంలో బయలు దేరారు. కాల్వబుగ్గ సమీపంలో రాగానే నంద్యాల వైపు వెళ్తున్న బండల లోడు ట్రాక్టర్‌ను స్కార్పి యో వాహనం వెనుక వైపు నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ పఠాన్ మున్ని (35), షేక్ కమాల్ బాషా(50) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మైదుకూరు చెందిన మాబుచాన్(50) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాలైన మూడు నెలల చిన్నారి షేక్ నదియా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు షేక్ ఖాదర్‌బీ, షేక్ షరీఫ్ శోకసంద్రంలో మునిగిపోయారు. తమ కళ్లముందే తమ కూతురు మృతిచెందడంతో రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదంలో షేక్ షరీఫ్, స్కార్పియో డ్రైవర్ శ్రీహరికి తల వెనుక, నుదుటిపై గాయాలయ్యాయి. షేక్ మున్నాకు ఎడమ కన్ను, ముక్కుకు, షేక్ ఖాదర్‌కు ఎడమ చెవిపైన గాయాలయ్యాయి. షేక్ అబ్దుల్ ఖాదర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. షేక్ జానీకి ఎడమ వైపు, నుదుటిపైన గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్‌ను వేగంగా ఢీకొట్టడంతో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన స్థలాన్ని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ చంద్రబాబునాయుడు, ఎస్‌ఐ సునీల్ కుమార్ పరిశీలించారు. ఓర్వకల్లు పోలీసులు అక్కడికి చేరుకొని వెళ్లి వాహనాలకు అంతరాయం లేకుండా క్లియర్ చేసి క్షతగాత్రులను 108, టోల్‌ప్లాజా అంబు లెన్సులో కర్నూలు ప్రభుత్వా సుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు.
Updated Date - Jul 11 , 2025 | 12:08 AM