ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

ABN, Publish Date - May 03 , 2025 | 12:38 AM

తమ పిల్లలు పదో తరగతిలో పాసయ్యారన్న సంతోషంతో వారందరూ బంధుమిత్రులతో కలిసి శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లారు.

ప్రమాదానికి కారణమైన వాహనం

14 మందికి తీవ్ర గాయాలు

శ్రీశైలానికి వెళ్లి వస్తుండగా ఘోర దుర్ఘటన

కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై ట్రాలీ వాహనం బోల్తా

మృతులందరూ ఆదోని ప్రాంత వాసులే

ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

ఆత్మకూరు/ ఆదోని/కర్నూలు, మే 2(ఆంధ్రజ్యోతి): తమ పిల్లలు పదో తరగతిలో పాసయ్యారన్న సంతోషంతో వారందరూ బంధుమిత్రులతో కలిసి శ్రీశైల మల్లన్న దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారిని మృత్యువు కబళించి విషాదాన్ని నింపింది. వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ఏకంగా నలుగురి ప్రాణాలు కోల్పోయారు. 14 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆత్మకూరు మండలంలోని సిద్ధ్దాపురం చెరువు కట్ట సమీపంలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగింది. ఆదోని పట్టణంలోని రాయచోటి సుబ్బయ్యనగర్‌, ఇందిరానగర్‌, రాజీవ్‌గాంధీనగర్‌తో పాటు గోనెగండ్ల మండలంలోని ఎర్రపాడు గ్రామానికి చెందిన సుమారు 28 మంది బంధుమిత్రులు గురువారం శ్రీశైలానికి ప్రైవేట్‌ వాహనంలో బయలుదేరి వెళ్లారు. స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం శుక్రవారం మధ్యా హ్నం శ్రీశైలం నుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే సిద్ధాపురం చెరువు కట్ట ఎదురుగా మరో వాహనం వస్తుండగా ఒక్కసారిగా డ్రైవర్‌ బ్రేక్‌ వేశాడు. వర్షం కురవడం వల్ల రహదారి చిత్తడిగా మారి వాహనం అదుపుతప్పి కుడిపక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాలీలో చెక్కలను ఏర్పాటు చేసుకుని పైభాగంలో కూర్చున్నవారు కింద పడగా వారిపై వాహనం బోల్తాపడి తిరిగి యథాస్థితిలో నిలిచింది. ఈ ఘోర దుర్ఘటనలో ఆదోనిలోని ఇందిరానగర్‌కు చెందిన గిడ్డయ్య (42), శశకళ (40), లక్ష్మి (28) అక్కడికక్కడే మృతిచెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌తో పాటు పలు ప్రైవేట్‌ వాహనాల్లో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చంద్రమ్మ (31) మృతిచెందింది. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు రెఫర్‌ చేశారు.

14 మందికి తీవ్ర గాయాలు

ఈ ప్రమాదంలో ఆదోనిలోని ఇందినగర్‌కు చెందిన సరస్వతి, వీణ, రాయచోటిసుబ్బయ్య కాలనీకి చెందిన మంగలి రంగస్వామి, రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మంగలి గిరిధర్‌, మంగలి రాములమ్మ, 12 ఏళ్ల ప్రవీణ్‌ తేజ, గోనెగండ్ల మండలంలోని ఎర్రపాడుకు చెందిన కురువ కుమార్‌, మంగలి శిల్పా, మంగలి వీరేష్‌, మంగలి గోపిచంద్‌, 7ఏళ్ల హర్షణి, డ్రైవర్‌ సునీల్‌కుమార్‌తో పాటు మరొకరు గాయపడ్డారు. వీరిలో రంగస్వామికి మోకాళ్లు, మోచేతికి తీవ్ర గాయాలయ్యాయి. వీరేష్‌, గిరిధర్‌లకు గడ్డం భాగంలో బలమైన రక్తగాయాలయ్యాయి. శిల్పాకు తలపై తీవ్ర గాయమైంది. ప్రవీణ్‌తేజ అనే బాలుడికి కుడికాలు విరిగింది. స్వల్ప గాయాలైన వారిని ఆత్మకూరులోనే చికిత్సలు అందించగా తీవ్ర గాయాలైన వారిని 108 ఆంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. ఆత్మకూరు అర్బన్‌ సీఐ రాము, ఎస్సై నారాయణరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చొరవ తీసుకున్నారు.

దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మంత్రులు లోకేశ్‌, భరత్‌, ఎమ్మెల్యే బుడ్డా

కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మృతిచెందడంతో పాటు 14 మంది తీవ్ర గాయాలపాలైన ఘటనపై మంత్రులు నారా లోకేశ్‌, టీజీ భరత్‌, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా అధికారులను ఆదేశించారు.

డిగ్రీ పరీక్షలు ఉన్నాయని ఆగిపోయా

డిగ్రీ పరీక్షలు ఉన్న కారణంగా మా అమ్మ శశికళ ఇంటి దగ్గరే ఉండమన్నది. సెలవులు ఉన్నందున కర్ణాటక నుంచి అక్క లక్ష్మి కూడా ఇంటికి రావడంతో, ఇంటి దగ్గరే ఉండిపోయాను. లేదంటే అమ్మతో పాటు నేను కూడా దైవదర్శనానికి వెళ్లి ఉండేవాడిని.

-అశోక్‌

మా అమ్మ బాగుందని చెప్పండి అంకుల్‌

మా అమ్మ శశికళకు ఏమి కాలేదని, బాగుందని చెప్పండి అంకుల్‌.. అంటూ.. మృతురాలు శశికళ కూతురు లక్ష్మి, కుమారుడు అశోక్‌ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. దైవదర్శనానికి వెళ్లిన వారందరూ కూడా ఒకే కుటుంబసభ్యులేనని, తమ తల్లిదండ్రులకు ఎలా ఉందంటూ ఆరాతీశారు.

గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణం వద్దంటున్నా..

ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాలకు చెందిన గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణం ప్రమాదమని తెలిపినా వాటినే ఆశ్రయిస్తున్నారు. శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా ఇదే తరహాలో బొలోరో, ఆటో ట్రాలీలపై చెక్క పలకలు వేసుకుని అధిక సంఖ్యలో వెళ్తుంటారు. ఆ సమయంలో పోలీసు, రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణాలపై నిషేధం విధించినా చాలా వరకు గూడ్స్‌ వాహనాల్లోనే ప్రయాణం కొనసాగించేవారు. సురక్షితమైన ప్రయాణం చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మృతుల్లో ఇద్దరు తోడికోడళ్లు.. మరొకరు ఆడపడుచు

రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారిలో ఇద్దరు తోడికోడళ్లు, వారి ఆడపడుచు ఉన్నారు. సెలూన్‌ షాప్‌ నిర్వహిస్తూ బతుకుబండి సాగిస్తున్న అన్నదమ్ములు, బావమర్దుల కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. ఆదోని పట్టణం రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన ఎం.రాజు, గిరి అన్నదమ్ములు. వీరికి గిడ్డయ్య, రంగ స్వామి, రామాంజీ బావమరుదులు. వీరంతా రాజీవ్‌గాందీ నగర్‌, ఇందిరానగర్‌లో ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో ఈ ఐదు కుటుంబాలతో పాటు గోనెగండ్ల మండలం ఎర్రబాడుకు చెందిన బంధువులు దాదాపు 28 మంది ట్రాలీ ట్రాలీ వాహనంలో శ్రీశైలం వెళ్లారు. రామాంజీ కుమారుడు అరవింద్‌, గిడ్డయ్య కుమారుడు అభి, రాజు కుమార్తె అర్చన్‌ పదో తరగతి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కు తీర్చుకోవాలని శ్రీశైలం వెళ్లారు. ఈ ప్రమాదంలో రాజు భార్య లక్ష్మి, గిరి భార్య చంద్రమ్మ మృతి చెందారు. రాజు అక్క శశికళ, బావమరిది గిడ్డయ్య మృత్యువాత పడ్డారు. మృతురాలు లక్ష్మికి భర్త, ఇద్దరు కూతుళ్లు, కొడుకు, చంద్రమ్మకు కొడుకు, కూతురు, శశికళకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గిడ్డయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు.

Updated Date - May 03 , 2025 | 12:38 AM