శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:38 PM
ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొద్ది రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది.
కొత్తపల్లి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొద్ది రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతుండటంతో నదీజలాల్లో నిక్షిప్తమైన సంగమేశ్వరాలయం శిఖరాగ్రానికి చేరువలో ఉంది. వరద ఇలాగే కొనసాగితే మరో రెండు రోజుల్లో సంగమేశ్వరాలయం జలాధివాసం కానుంది. వరద జలాలు శిఖరాగ్రానికి చేరుకోవడంతో ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ సంగమేశ్వరాలయానికి చేరుకుని శిఖరాగ్రానికి ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకు హారతులు ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 855.20 అడుగులుగా నమోదైంది. రిజర్వాయరు పూర్తిస్థాయి నీటి నిల్వలు 215 టీఎంసీలు కాగా, 92.4867 టీఎంసీలుగా రికార్డయింది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం రిజర్వాయరుకు 37,160 క్యూసెక్కులు, సిల్ప్‌వేద్వారా 12,203 క్యూసెక్కులు వరద శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. దీంతో మొత్తం 49,363 క్యూసెక్కుల వరద వచ్చి శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. ప్రస్తుతం ఆలయం నీటిలో ఉండటంతో ఎగువ ఉమామహేశ్వరస్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.
Updated Date - Jun 22 , 2025 | 11:38 PM