ఇక సన్నబియ్యంతో భోజనం
ABN, Publish Date - Jun 12 , 2025 | 12:35 AM
గతంలో మధ్యాహ్న భోజన పథకానికి రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని పంపిణీ చేసేవారు. గత వైసీపీ హయాంలో నాణ్యత లేని భోజనం తినలేక విద్యార్థులు ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకునేవారు.
ఇప్పటికే బియ్యాన్ని పాఠశాలలకు పంపిన ప్రభుత్వం
విద్యార్థులకు పౌష్టికాహారం
హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
ఆదోని అగ్రికల్చర్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): గతంలో మధ్యాహ్న భోజన పథకానికి రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని పంపిణీ చేసేవారు. గత వైసీపీ హయాంలో నాణ్యత లేని భోజనం తినలేక విద్యార్థులు ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకునేవారు. అయితే టీడీపీ ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యాన్ని సరఫరా చేసింది. బియ్యం ప్యాకెట్లు ఇప్పటికే పాఠశా లలకు చేరుకున్నాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి బడి తెరిచిన రోజు నుంచే సన్న బియ్యంతో పాటు రుచి, శుభ్రతతో కూడిన పౌష్టికాహారాన్ని ఇవ్వనుంది. ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 130 ఉన్నాయి. వీటిలో 30,140 మంది విద్యార్థులు చదువుతున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వీరికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద సన్నబియ్యంతో చేసిన ఆహా రాన్ని వడ్డించేందుకు గతేడాది అక్టోబర్‌లోనే తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రాంతాలవారీగా వారు ఇష్టపడే ఆహారాన్ని బట్టి మెనూలో మార్పులు చేశారు. రోజూ మెనూ ప్రకారం గుడ్డు, చిక్కి, రాగిజావాతో పాటు వివిధ రకా ల రుచులతో విద్యార్థులకు భోజనం తయారు చేసి వడ్డిస్తారు.
బడులకు చేరుకున్న బియ్యం బస్తాలు
నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ బడులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు హాస్టళ్లకు 25 కేజీల బస్తాల్లో సన్న బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది. గతంలో 50 కేజీల బియ్యాన్ని గోనెసంచులల్లో ఉంచడంతో పురుగులు మట్టి పెల్లలు ఉండేవి. దీతో ప్రభుత్వం 25 కేజీల బియ్యాన్ని ప్రత్యేకమైన సంచుల్లో పంపడంతో పురుగు పట్టే అవకాశం లేదు. అలాగే బియ్యం పక్కదారి పట్టకుండా అక్రమాలకు తావు లేకుండా క్యూ ఆర్‌కోడ్‌తో కూడిన ట్యాగ్‌ను కూడా అమర్చారు.
మద్దికెర: మండలంలో 26 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 4వేలకు పైగా చదువు కుంటున్నారు. వారికి నేటినుంచే సన్న బియ్యంతో భోజనం వడ్డించడానికి ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపింది. సన్నబియ్యంతో అన్నం వండేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆలూరు: మండలానికి సన్నబియ్యం 25 కేజీల బస్తాలు చేరుకున్నాయి. బియ్యం పక్కదారి పట్టకుండా ట్యాగింగ్ చేశారు. బియ్యం నాణ్యతపై హెచ్‌ఎంల నుంచి స్టార్ రేటింగ్ రూపంలో అభిప్రాయం స్వీకరిస్తారు. ఆలూరు సివిల్ సప్లై గోదాం నుంచి 140 స్కూళ్లు, 3 కాలేజీలు, 14 సంక్షేమ హాస్టళ్లకు 66 టన్నుల బియ్యంను సరఫరా చేసినట్లు గోదాం ఇన్‌చార్జి శివన్న తెలిపారు.
విద్యార్థులకు పౌష్టికాహారం
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో సమూల మైన మార్పులు తీసుకొ చ్చింది. సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలని సూచించింది. మొదటి రోజు నుంచే సన్నబియ్యంతో చేసిన ఆహారాన్ని వడ్డిస్తాం. - శ్రీనివాసులు, ఎంఈవో-2, ఆదోని
నాణ్యమైన భోజనం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం ఇవ్వనున్నాం. విద్యార్థులు సంతృప్తిగా భోజనం చేసే అవకాశం ఉంది. - రంగస్వామి, ఎంఈవో, మద్దికెర
Updated Date - Jun 12 , 2025 | 12:35 AM