కబళించిన రోడ్డు ప్రమాదం
ABN, Publish Date - May 03 , 2025 | 11:15 PM
కంటెన్నగారి కేశన్న జీవనాధారం వ్యవసాయం. ఎమ్మిగనూరు పశువుల సంతకు వారం వారం వెళ్తుంటాడు.
ఐదు నిమిషాల్లో గమ్యస్థానం..
ఇంతలో మృత్యు ఒడిలోకి
ఎర్రకోటలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన గూడ్స్ వాహనం
ఇద్దరు యువకుల దుర్మరణం
ఎమ్మిగనూరు రూరల్/ఎమ్మిగనూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): కంటెన్నగారి కేశన్న జీవనాధారం వ్యవసాయం. ఎమ్మిగనూరు పశువుల సంతకు వారం వారం వెళ్తుంటాడు. అదే సంతలో ఎద్దుల కొమ్ములు చెక్కేడం (నునుపు చేయడం) కోసం బుక్కరాయసముద్రానికి చెందిన రజాక్ వస్తుంటాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆదివారం సంత కోసం శనివారమే రజాక్ ఎమ్మిగనూరుకు వచ్చాడు. కేశన్నను కలవడంతో మా ఊరు కడిమెట్లకు వెళ్లివద్దాం రా..! అంటూ ఇద్దరు మోటర్‌బైక్‌పై కడిమెట్లకు బయలుదేరి ఎర్రకోట సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మరో ఐదారు నిమిషాలు ఉంటే గమ్యస్థానికి చేరుకొని ఉండేవారు. ఇంతలో ఘోరం జరిగి పోయింది. కర్నూలు వైపు నుంచి ఎమ్మిగనూరుకు వస్తున్న సరుకులు రవాణా చేసే ఆశోక్ లైలాండ్ మినీ వాహనం వారు వెళ్తున్న మోటర్ బైక్‌ను ఢీకొట్టడడంతో ఇద్దరు మిత్రులు దుర్మరణం పాలయ్యారు. బోయ కేశన్న(32), రజాక్(35) విగతజీవులుగా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. రాజక్ తల తెగిపోయి దూరంగా పడిపోయింది.
ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామానికి చెందిన కుంటెన్నగారి కేశన్న వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పది ఎకరాల పొలం ఉంది. కేశన్నకు భార్య శారద, కూతుళ్లు అమృత (9ఏళ్లు), అంకిత (7ఏళ్లు), కుమారుడు హరికృష్ణ (6ఏళ్లు) సంతానం. కేశన్నకు జత కాడెద్దులు ఉన్నాయి. ఎద్దుల ద్వారా పొలంలో సేద్యం పనులు చూస్తూనే.. ఖాళీ సమయంలో ఇతర రైతుల పొలాలకు దుక్కుల కోసం బాడుగకు వెళ్తుతూ జీవనం సాగిస్తున్నారు. శనివారం కేశన్న ఎమ్మిగనూరుకు వెళ్లాడు. అదే సమయంలో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన రజాక్ ఆదివారం పుశుల సంతలో ఎద్దుల కొమ్మలు చెక్కేందుకు వచ్చారు. ఆ పనే ఆయనకు జీవనాధారం. వారం వారం వస్తుండడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రజాక్‌ను తన మోటర్‌బైక్‌పై ఎక్కించుకొని కడిమెట్లకు బయలుదేరారు. ఎర్రకోట గ్రామ శివారులో విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కడిమెట్లకు మూడు నాలుగు కిలోమీటర్లు కూడా లేదు. నాలుగైదు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకునే వారు. ఇంతలో కర్నూలు నుంచి ఎమ్మిగనూరు పట్టణానికి మద్యం లోడ్‌తో వస్తున్న సరుకుల రవాణా చేసే ఏపీ39 యూ 4952 నంబరు గల అశోక్ లైలాండ్ మినీ వాహనం కేశన్న, రజాక్ వెళ్తున్న ఏపీ04 ఏవీ 1388 నంబరు గల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. కనురెప్పపాటులో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వాహనాలు బలంగా ఢీకొట్టడంతో బైక్‌పై ఎనుక కూర్చున్న రజాక్ తల తెగిపడి మొండానికి దూరంగా పడిపోయింది. కేశన్న రక్తపు మడుగులో అక్కడే కుప్పకూలి మృతి చెందారు. విషయం తెలియగానే కేశన్న భార్య పిల్లలు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహం చూసి కన్నీరుమున్నీరై విలపించారు. తండ్రిని ఆస్థితిలో చూసిన చిన్నారులు రోధిస్తుంటే అయ్యో.. పాపం..! దేవుడా... ఎంత అన్యాయం చేశావయ్యా... అంటూ అక్కడివారు కంటితడి పెట్టారు. ఎమ్మిగనూరు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
Updated Date - May 03 , 2025 | 11:15 PM