పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:27 PM
పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెనుభూతంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని క్రమక్రమంగా నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ పి. రంజిత్‌బాషా అన్నారు.
భవిష్యత్ తరాలకు భరోసా ఇవ్వాలి
కలెక్టర్ పి. రంజిత్‌బాషా
కర్నూలు రాజ్‌విహార్ సర్కిల్ జూన్ 5(ఆంధ్రజ్యోతి): పర్యావరణానికి, ప్రజారోగ్యానికి పెనుభూతంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని క్రమక్రమంగా నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ పి. రంజిత్‌బాషా అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సునయన అడిటోరియంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రంజిత్‌బాషా మాట్లాడుతూ ప్రతి విషయంలో ప్లాస్టిక్‌పై ఆధారపడటం సర్వసాధారణంగా మారిందని, దీని వల్ల ప్లాస్టిక్ కాలుష్యం అధికమై జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా తయారైందన్నారు. భవిష్యత్తు తరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వివరించారు. అంతకు ముందు జిల్లాపరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. దీనిని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ లీలా వెంకట శేషాద్రి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి. నవ్య, ఆర్డీవో సందీప్ కుమార్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులతో నాటికలు, నృత్యాలు, చైతన్య గీతాలను అలపించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
Updated Date - Jun 05 , 2025 | 11:27 PM