ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంజనీర్లు కావలెను..!

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:00 AM

గ్రామసీమల జలరాశులు చెరువులు. వర్షపు నీటిని ఒడిసిపట్టి తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తున్న చెరువుల నిర్వహణను గాలికి వదిలేశారు.

ఆదోని సబ్‌ డివిజన్‌ మైనర్‌ ఇరిగేషన్‌ (ఎంఐ) కార్యాలయం ఇది. ఎప్పుడో బ్రిటీష్‌ కాలం నాటి శిథిలమైన భవనంలో కొనసాగుతోంది

ఇంజనీర్‌ లేకుండానే ఆదోని ఎంఐ సబ్‌ డివిజన్‌

డీఈఈ, ఏఈఈల పోస్టులన్నీ ఖాళీ

33 చెరువులు.. 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు

చెరువుల నిర్వహణను గాలికొదిలేశారు

గ్రామసీమల జలరాశులు చెరువులు. వర్షపు నీటిని ఒడిసిపట్టి తాగు, సాగునీటి అవసరాలు తీరుస్తున్న చెరువుల నిర్వహణను గాలికి వదిలేశారు. చిన్ననీటి పారుదల శాఖ ఆదోని సబ్‌ డివిజన్‌ దుస్థితి ఇందుకు అద్దం పడుతోంది. ఒక్క ఇంజనీరు కూడా లేకపోవడంతో ఫైళ్లు ముందుకు కదలడం లేదు. డీఈఈ, ఏఈఈ పోస్టులు అన్ని ఖాళీగానే ఉన్నాయి. నెలలు గడిచినా కార్యాలయ తలుపులు తీసేవారు లేరు. ఎప్పుడో వందేళ్ల క్రితం బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన శిథిలమైన పెంకుల భవనంలోనే ఎంఐ సబ్‌ డవిజన్‌ కార్యాలయం కొనసాగుతోంది. ఇంజనీర్లు లేక 33 చెరువులు, 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు పరిస్థితి దయనీయంగా మారింది. ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. దిక్కుమొక్కు లేని ఆదోని మైనర్‌ ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ దుస్థితిపై ఆంధ్రజ్యోతి కథనం.

కర్నూలు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చిన్నతరహా నీటిపారుదల శాఖ పరిధిలో కర్నూలు, డోన్‌, పత్తికొండ, ఆదోని సబ్‌ డివిజన్లు ఉన్నాయి. మైనర్‌ ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ చెరువులు 310 ఉన్నాయి. వాటి పరిధిలో 33,113 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆదోని సబ్‌ డివిజన్‌ పరిధిలో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, నియోజకవర్గాల్లో మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు 13, పంచాయతీ రాజ్‌ చెరువులు 30 వరకు ఉన్నాయి. వీటి కింద దాదాపుగా 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఆలూరు నియోజకవర్గంలో 7, ఆదోనిలో 4 పెద్ద చెరువులు ఉన్నాయి. నిత్యం కరువుతో తల్లడిల్లే పశ్చిమ ప్రాంతంలో గ్రామీణులకు సాగునీరు, పశువులకు తాగునీరు అందించడంతో కీలకమైనవి చెరువులే. పల్లెసీమల జలరాశులు ప్రస్తుతం దిక్కుమొక్కులేని పరిస్థితి ఏర్పడింది. మరమ్మతులు, పూడిక తీత పనులు చేపట్టకపోవడంతో చెరువులు పిచ్చిమొక్కలు, ముళ్ల కంపులతో నిండిపోతున్నాయి. తూములు, పంట కాలువలు, ఆలుగులు పాడైపోతున్నాయి. చెరువు నిర్వహణలో రైతులతో పాటు ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. వర్షాకాలంలో చెరువులకు గండ్లు పడితే తక్షణమే స్పందించే ఇంజనీరు ఒక్కరు కూడా లేకపోవడం కొసమెరుపు.

పోస్టులన్నీ ఖాళీ...

ఆదోని ఎంఐ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఆదోని, ఆలూరు, ఎమ్మిగ నూరు నియోజకవర్గాల్లో చెరువుల నిర్వహణ కోసం డీఈఈ, నలుగురు ఏఈఈలు పని చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో చెరువుల నిర్వహణ దిక్కులేకుండా పోయింది. నాబార్డు నిధులతో చెక్‌డ్యాంలు నిర్మాణానికి అన్ని మండలాల్లో ప్రతిపాదనలు పంపితే.. ఆదోని, ఎమ్మిగనూరు, నందవరం మండలాల నుంచి ఒక్క ప్రతిపాదన కూడా పంపలేదు. ఇటీవల జిల్లా ఇన్‌చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన డీడీఆర్‌సీ సమావేశంలో ఆదోని అంటే ఎందుకు వివక్షత అంటూ ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి జిల్లా అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇంజనీర్లే లేకపోతే ప్రతిపాదనలు తయారు చేసేది ఎలా..? ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఏఈఈలను ఎందుకు నియమించుకోలేకపోతున్నారు..? అంటూ ఇరిగేషన్‌ శాఖ అధికారుల వాదన. జూన్‌ నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం అవుతుంది. వర్షాలు వస్తే చెరువులు నిండుతాయి. చెరువులకు చేరే వరద నిర్వహణ సక్రంగా లేకపోతే గట్లు తెగిపోయే ప్రమాదం ఉంది. ఆదోని, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు డాక్టర్‌ పార్థసారథి, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మైనర్‌ ఇరిగేషన్‌ ఆదోని సబ్‌ డివిజన్‌కు డీఈఈ, ఏఈఈలను నియమించాలని రైతులు కోరుతున్నారు. కాగా పదోన్నతుల్లో భాగంగా చిత్తూరు జిల్లా సత్యవేడులో ఎన్టీఆర్‌ టీజీపీ సబ్‌ డివిజన్‌-1లో పని చేస్తున్న ఏఈఈ ఎన్‌.రాజగోపాల్‌కు డీఈఈగా పదోన్నతి ఇచ్చి ఆదోని ఎంఐ సబ్‌ డివిజన్‌కు బదిలీ చేశారు. అయితే వచ్చే నెల మే 31న ఆయన పదవీవిరమణ అవుతున్న నేపథ్యంలో నియమించినా ప్రయోజనం లేకుండా పోతోంది.

శిథిలమైన భవనం

ఆదోని పట్టణం రైల్వే స్టేషన్‌ రోడ్డులో మైనర్‌ ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయం ఉంది. వందేళ్ల క్రితం బ్రిటీష్‌ పాలన కాలంలో నిర్మించిన పెంకుల భవనంలో కొనసాగుతోంది. ఆలనాపాలన లేక శిథిలావస్థకు చేరుకుంది. పెంకులు ఊడిపోయి పైకప్పు చిల్లులు పడ్డాయి. వర్షం వస్తే తడిసిముద్దవుతుంది. 15 ఏళ్ల క్రితం కొత్త భవనం నిర్మించినా.. నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో ఆ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. ఈ ప్రాంతం వ్యాపార కేంద్రంగా దినాదినాభివృద్ధి చెందుతుండడంతో ఐఎం సబ్‌ డివిజన్‌ కార్యాలయం భవనం స్థలం రూ.కోట్లు పలుకుతోంది. అన్యాక్రాంతం కాకుండా నూతన భవనం నిర్మించాలి. ఖాళీగా ఉన్న డీఈఈ, ఏఈఈల పోస్టులు భర్తి చేసి చెరువుల సరంక్షణకు పాటుపడాలని రైతులు కోరుతున్నారు.

ఖాళీల వివరాలు ప్రభుత్వానికి పంపుతాం

ఆదోని మైనర్‌ ఇరిగేషన్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో డీఈఈ పోస్టు సహా ఏఈఈ పోస్టులు 4 ఖాళీగా ఉన్న మాట వాస్తవమే. రెండు రోజుల క్రితం పదోన్నతిలో భాగంగా చిత్తూరు జిల్లా నుంచి డీఈఈని నియమించినా ఆయన కూడా మే 31న పదవి విరమణ చేస్తున్నారు. ఆదోని సబ్‌ డివిజన్‌తో పాటు జిల్లాలో ఇంజనీర్లు పోస్టుల ఖాళీల వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం.

- ద్వారకనాథ్‌రెడ్డి, ఎస్‌ఈ, ఇరిగేషన్‌ సర్కిల్‌, కర్నూలు

పశ్చిమ ప్రాంతంపై నిర్లక్ష్యం

జిల్లాలో పశ్చిమ ప్రాంత కరువు పల్లెసీమల్లో తాగు, సాగునీటి వనరులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నో ఏళ్లుగా చెరువులపై ఆధార పడుతున్నాం. వాటి నిర్వహణ చూసే ఇంజనీర్ల పోస్టులు ఏడేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. మా కూటమి ప్రభుత్వం కూడా డీఈఈ, ఏఈఈలను నియమించలేదు. పశ్చిమ ప్రాంతంపై నిర్లక్ష్యం తగదు. ఇప్పటికే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లాను. మరోసారి జిల్లా ఇన్‌చార్జి మంత్రిని కలసి ఆదోని ఎంఐ సబ్‌ డివిజన్‌లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్‌ పోస్టులను వంద శాతం భర్తీ చేయాలని విన్నవిస్తాను. రాబోయే వర్షాకాలంలో చెరువులకు గండ్లు పడితే ఎవరిది బాధ్యత?

- డాక్టర్‌ పీవీ పార్థసారథి, ఎమ్మెల్యే, ఆదోని

Updated Date - Apr 26 , 2025 | 12:00 AM