నైరాశ్యంలో కార్యదర్శులు
ABN, Publish Date - May 10 , 2025 | 11:55 PM
ఐదేళ్లుగా పదోన్న తులు లేక పంచాయతీ కార్యదర్శులు నైరాశ్యంలో కూరుకుపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నినెలలకే తీపి కబురు అందించింది
జాబితా సిద్ధంచేసి ఏడు మాసాలు
నేటికీ అందని పదోన్నతులు
సీనియార్టీలో వెనుకబడుతామని ఆవేదన
కొన్ని జిల్లాలో పూర్తయిన ప్రక్రియ
కర్నూలు కలెక్టరేట్, మే 10 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లుగా పదోన్న తులు లేక పంచాయతీ కార్యదర్శులు నైరాశ్యంలో కూరుకుపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నినెలలకే తీపి కబురు అందించింది. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూనే అందులో పనిచేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని నిర్ణయం తీసు కుంది. ఈ శాఖలో ఉన్న ఖాళీలను గుర్తించి గతేడాది నవంబరు 30న పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. కిందిస్థాయిలో సీనియారిటీ జాబితాల రూపకల్పనలో ఎడతెగని జాప్యం కారణంగా ఏడు మాసాలు గడిచిపోయాయి. గ్రేడ్-1, గ్రేడ్-2 పదోన్నతులను పంచాయతీరాజ్ శాఖ కమిషనరేట్ స్థాయిలో నిర్ధారిస్తారు. గ్రేడ్-3, 4, 5, 6 వరకు పదోన్నతులను జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వారి కార్యాలయం నిర్దారణ చేయాల్సి ఉంది.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రేడ్-1 ఖాళీలు-3, గ్రేడ్-2 ఖాళీలు 18 ఉన్నాయి. అదే విధంగా గ్రేడ్-3 ఖాళీలు 16, గ్రేడ్-4 ఖాళీలు 118, గ్రేడ్-5 ఖాళీలు 29 ఉన్నాయి. ఇవి కాకుండా పైనుంచి మరికొన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల తాము నిరీక్షిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈవిషయమై గత నెలలో పంచా యతీ రాజ్ శాఖ కమిషనర్ ఒక స్పష్టతను ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పదోన్నతులు భర్తీచేయాలని ఆదేశాలిచ్చారు. ఇందుకోసం తక్షణమే దస్త్రం రూపొందించి పదోన్నతులు ఇవ్వాలన్నారు. పైనుంచి తర్వాత వచ్చే ఖాళీలను మరో దస్త్రం ద్వారా రూపకల్పన చేసి పదోన్నతులు ఇవ్వవ చ్చని ఆదేశాలు జారీచేశారు. ఈప్రక్రియ అంతా ఏప్రిల్ 30 లోగా పూర్తికావాలని ఆయన నిర్దేశిత గడువును కూడా విధించారు.
ఈవోపీఆర్‌డీ పేరును డిప్యూటీ ఎంపీడీవోగా..
గతంలో విస్తరణాధికారిగా (ఈవోపీఆర్‌డీ) ఉన్న పేరును జీవో.నెం.35 ప్రకారం డిప్యూటీ ఎంపీడీవోగా మార్చారు. గత నెలాఖరులో డిప్యూటీ ఎంపీడీవోలుగా ఉన్న వారికి ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పించారు. ఇక గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న వారికి డిప్యూటీ ఎంపీడీవోలుగా పదోన్నతి కల్పించే దస్త్రం కమిషనరేట్ పరిధిలో తుది దశలో ఉంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో ఉమ్మడి జిల్లాలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇప్పటికే తూర్పు గోదావరి, కృష్ణ, చిత్తూరు, శ్రీకాకుళం వంటి జిల్లాలో పదోన్నతులిచ్చి రెండు నెలలు పూర్తయ్యాయి. భవిష్యత్తులో ఉమ్మడి కర్నూలు జిల్లా పంచాయతీ కార్యదర్శులు జోనల్ విధానంలో సీనియారిటీ జాబితాలో వెనుకబడిపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో పూర్తి చేస్తాం
గ్రేడ్-1, గ్రేడ్-2 పదోన్నతులు ప్రక్రియ త్వరలో పూర్తి కానున్నాయి. జిల్లాలో గ్రేడ్-2 పదోన్నతులు 65 మందికి లభించాయి. గ్రేడ్-3 నుంచి గ్రేడ్-6 వరకు పదోన్నతులు 15 రోజుల్లో పూర్తిచేస్తాం. - భాస్కర్, డీపీవో, కర్నూలు
Updated Date - May 10 , 2025 | 11:55 PM