అడవి బిడ్డలకు అన్నీ కష్టాలే..
ABN, Publish Date - Jul 28 , 2025 | 12:06 AM
అడవి బిడ్డలను అన్ని విధాలుగా అభివృద్ధి పధంలోకి తీసు కొస్తామని చెబుతున్న ప్రజాప్రతినిధుల మాటలు నీటిమూటలవుతున్నాయి. అనాధిగా అడవినే నమ్ముకొని అడవికి రక్షణతో పాటు వారి జీవనం కొనసాగేందుకు చెట్లక్రిందే ఆవాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న అడవి బిడ్డలకు అడుగడుగున కష్టాలే ఎదురవుతున్నాయి
నల్లమలలో నలుగుతున్న గిరిజన కుటుంబాలు
తీరని మంచినీటి కష్టాలు
చీకటి పడితే ఇంటికే పరిమితం
పట్టించుకోని అధికార యంత్రాంగం
మహానంది, జూలై 27 (ఆంధ్రజ్యోతి): అడవి బిడ్డలను అన్ని విధాలుగా అభివృద్ధి పధంలోకి తీసు కొస్తామని చెబుతున్న ప్రజాప్రతినిధుల మాటలు నీటిమూటలవుతున్నాయి. అనాధిగా అడవినే నమ్ముకొని అడవికి రక్షణతో పాటు వారి జీవనం కొనసాగేందుకు చెట్లక్రిందే ఆవాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న అడవి బిడ్డలకు అడుగడుగున కష్టాలే ఎదురవుతున్నాయి. అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఐటీడీఏ సంస్థను ఏర్పాటు చేసినా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమో, పాలకుల అలస త్వమో కానీ వారి బతుకులు మాత్రం మారడం లేదు. పేరుకే అడవి బిడ్డలుగా పిలువబడే వారికి అటవీశాఖ అధికారుల నుంచి అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయి.
అడవి బిడ్డలకు అన్ని కష్టాలే..
ఐదుజిల్లాల పరిధిలో నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ ఔషధ గుణాలకు చెందిన మెక్కలు, వేర్లు లభిస్తుంటాయి. ఆదివా సులు ఆలయాలను, అడవిలో ఉండే విలువైన కర్రను కాపాడుకొంటూ జీవన విధానాన్ని అడవి తల్లి కోసం అంకితం చేశారు. కాలక్రమేణ వారిని జనజీవనంలోకి మార్పుకావాలని అడవినుంచి జనారణ్యంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాలకు సమీపంలో ప్రత్యేకంగా ఇళ్లను నిర్మించి అడవి నుంచి బయటకు రప్పిం చారు. అయితే నేటికి కొన్ని చెంచుగూడెంలు అడవిని నమ్ముకొని అక్కడే ఉండిపో యారు. అందులో మహానంది సమీపం లోని చెంచులక్ష్మి చెంచుగూడెం ఒకటి. దాదాపు 70 కుటుంబాలు గుడిసెల్లో నివాసం చేస్తున్నారు. ఈ ఆధునీక కాలంలో కూడా మంచినీటికి, విద్యుత్త్ కాంతులకు నోచుకోవడం లేదు. కనీసం స్వచ్ఛమైన తాగునీరు దొరకడం లేదు. తెలుగుగంగ ప్రధాన కాల్వ నుంచి ప్రవహిం చే నీటిని వినియోగిస్తున్నారు. దీంతో రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. గూడెంకు విద్యుత్ సౌకర్యం లేదు. చీకటి పడితే ఇళ్లకే పరిమితమ వుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదు
ఇళ్లపట్టాలు ఇవ్వాలి
ఎన్నో ఏళ్లుగా గూడెం ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నాం. తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. మంచి నీటితో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించాలి. మౌలిక వసతులు కల్పించి సమాజంలో తమకు ఓ గుర్తింపు ఇవ్వాలి. - చలంచలం శ్రీనివాసులు, చెంచులక్ష్మి గూడెం నాయకుడు
సౌకర్యాలు కల్పించాలి
అడవిని నమ్ముకొని గూడెంలో నివసిస్తున్నాం. ఏ అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. కనీస వసతులు కల్పించాలి. - మేకల అంకమ్మ(గూడెం మహిళ)
పట్టాలు ఇవ్వడానికి కుదరదు
మహానంది సమీపంలోని చెంచులక్ష్మి గూడెంకు చెందిన గిరిజనులకు ఇంటి పట్టాలు ఇవ్వడానికి కుదరదు. గిరిజనులకు కేవలం సాగు చేసుకొని జీవించేందుకే అటవీ భూములు కేటాయించాం. - రమాదేవి, తహసీల్దార్
అటవీ స్ధలంలో నివసించడానికి అంగీకరించం
అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ స్థలంలో నివసించడానికి ఎలాంటి పరిస్ధితుల్లో అంగీకరించం. గిరిజనులకు కేవలం జీవనాపాధికు సాగు కోసం అటవీ భూములను కేటాయించారు. అదే స్థలం గిరిజనులు ఇళ్ల వేసుకొని జీవించడానికి కుదరదు. దీనివల్ల వన్యప్రాణులకు ఇబ్బంది కలుగుతుంది.
- అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ జడ్‌ఈన్ ఝా
Updated Date - Jul 28 , 2025 | 12:06 AM