విజన్ ఉంటేనే అభివృద్ధి
ABN, Publish Date - May 05 , 2025 | 11:47 PM
అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెట్టాలంటే విజన్ తప్పనిసరిగా ఉండాలని పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
ఓర్వకల్లు- గుట్టపాడు ఎంఎస్‌ఎంఈ ప్రారంభం
ఓర్వకల్లు, మే 5 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెట్టాలంటే విజన్ తప్పనిసరిగా ఉండాలని పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఆ విజన్ సీఎం చంద్రబాబు నాయుడుకు ఉందని, ఆయన సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తోందన్నారు. సోమవారం ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామం వద్ద రూ.38.47 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎస్‌ఎంఈ పార్కును ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకప్పుడు 60 శాతం మార్కులు వస్తేనే ఎక్కువ అనుకునేవాళ్లు అని ఇప్పుడు 99 శాతం మార్కులు వస్తున్నాయన్నారు. అదేవిధంగా సరైన శిక్షణ, చదువు ఉంటేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలోని యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ఓర్వకల్లులో పైలట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దూపాడు-బేతంచెర్ల రైల్వే స్లైడింగ్‌కు అనుమతులు వస్తున్నాయన్నారు. అనంతపురం- కర్నూలు ఇండస్ట్రియల్ జోన్‌కు కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన టీసీఎస్, ఆర్సిలర్ మిట్టల్ కంపెనీలు, 14 వేల కోట్ల విలువైన సెమి కండక్టర్ ప్రాజెక్టులు తమ హయాంలో వస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులు రావడంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చొరవ కీలకమన్నారు. ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ 2014లో ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఓర్వకల్లు మండలాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దారనీ, ఎయిర్‌పోర్టు, డీఆర్‌డీవో, జయరాజ్ ఇస్పాత్, సోలార్ పార్కు వంటి పరిశ్రమలు తీసుకువచ్చారని అన్నారు. ప్రస్తుతం 300 ఎకరాల్లో డ్రోన్ హబ్‌ను కేటాయిం చారన్నారు. కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఏడు నియోజకవర్గాల్లో భూములను కూడా గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్డీవో సందీప్ కుమార్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం అరుణ కుమారి, పొదుపు లక్ష్మి మండల ఐక్యసంఘం గౌరవ సలహాదారు విజయభారతి, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో శ్రీనివాసులు, సర్పంచ్ నర్ల మోహన్ రెడ్డి, నాయకులు గోవిందరెడ్డి, సుధాకర్ రెడ్డి, పుసులూరు ప్రభాకర్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, సుధాకర్‌రావు, రాంభూపాల్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, దేవేంద్ర, పుల్లారెడ్డి, తిరుపాలు, రాజన్న పాల్గొన్నారు.
Updated Date - May 05 , 2025 | 11:47 PM