‘నాలెడ్జ్’ సెంటర్ ఏర్పాటుపై వివాదం
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:10 AM
కేఎంసీ(కర్నూలు మెడికల్ కాలేజీ)లో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు వివాదానికి దారి తీసింది. కాలేజీ మైదానంలో కేఎంసీ పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో నాలెడ్జ్ సెంటర్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
పూర్వ విద్యార్థులు వర్సెస్ వైద్యులు, విద్యార్థులు
భవనం నిర్మిస్తే అడ్డుకుంటాం
ప్రభుత్వ వైద్యులసంఘం అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మాజీ
అభ్యంతరాలు ఉంటే సరిదిద్దుకుంటాం
పూర్వవిద్యార్థుల సంఘం నాయకుడు డాక్టర్ గోవిందరెడ్డి
కర్నూలు హాస్పిటల్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కేఎంసీ(కర్నూలు మెడికల్ కాలేజీ)లో నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు వివాదానికి దారి తీసింది. కాలేజీ మైదానంలో కేఎంసీ పూర్వ విద్యార్థులు ఆధ్వర్యంలో నాలెడ్జ్ సెంటర్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు సోమ వారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డా.పి.చంద్రశేఖర్ పూర్వ విద్యార్థులతో సమావేశం నిర్వహించి నాలెడ్జ్ సెంటర్‌కు తనవంతు సహకారం అందిస్తానని ప్రకటించారు. మంగళవారం పూర్వవిద్యార్థుల సంఘం నాయకులు ఉదయం తమకు వైస్‌చాన్స్‌లర్ అనుమతి ఇచ్చారని, భవన నిర్మాణానికి కొలతలు తీసుకోవడానికి ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్లతో కలిసి మైదానానికి వచ్చారు. నాలెడ్జ్ సెంటర్‌ను 60 సెంట్లతో ఏర్పాటుచేయడానికి మైదానంలో ఎడమవైపు నుంచి కుడి వైపునకు స్థలాన్ని మార్చి కొలతలు తీసుకు న్నారు. ఇంతలో విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డా.బ్రహ్మాజీ మాస్టర్‌తో పాటు ప్రొఫెసర్లు, వైద్యులు కొందరు జూనియర్ డాక్టర్లు కలిసి పూర్వవిద్యార్థుల ప్రతినిధులతో గొడవకు దిగారు. నాలెడ్జ్ సెంటర్‌ను ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండులో అనుమతించేది లేదని డా.బ్రహ్మాజీ మాస్టర్, కొంత మంది ప్రొఫెసర్లు కరాఖండిగా తేల్చి చెప్పారు. ప్రిన్సిపాల్ లేనప్పుడు కాలేజీకి ఎలా వస్తారనీ, ఇది సరైంది కాదన్నారు. ఇప్పటికే కాలేజీ గ్రౌండు ఏడు ఎకరాల నుంచి ఐదు ఎకరాలకు కుచించుకుపోయిందని, నాలెడ్జ్ సెంటర్ పేరుతో 60 సెంట్లు స్థలంలో భవనం నిర్మిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఎవరూ అడ్డుకోలేదు
వీసీ ఆదేశాల మేరకు నాలెడ్జ్ సెంటర్ నిర్మాణానికి సంబంధించి కొలతలు తీసుకోవడానికి మంగళవారం ఉదయం వచ్చామని కేఎంసీ పూర్వ విద్యార్థుల సంఘాల నాయకుడు డాక్టర్ గోవిందరెడ్డి తెలిపారు. తమను ఎవరూ అడ్డుకోలేదని ఈ సెంటర్‌ను కుడి వైపునకు జరిపి కొలతలు తీసుకున్నట్లు తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు. 2021లో నాలెడ్జ్ సెంటర్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:10 AM