ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాంగ్రెస్‌ నాయకుడిదారుణ హత్య

ABN, Publish Date - Apr 28 , 2025 | 12:30 AM

ఆలూరు నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌ పడగవిప్పింది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ముఠాకక్షలు మళ్లీ బయటపడ్డాయి.

లక్ష్మీనారాయణ (ఫైల్‌)

టిప్పర్‌తో ఢీకొట్టి.. కొడవళ్లతో నరికి

ఆలూరు నియోజకవర్గంలో పడగవిప్పిన ఫ్యాక్షన్‌

గుంతకల్లు నుంచి చిప్పగిరికి వస్తుండగా

రైల్వే బ్రిడ్జి వద్ద ఘటన

అప్రమత్తమైన పోలీసులు

చిప్పగిరిలో భారీ బందోబస్తు

చిప్పగిరి/ఆలూరు/కర్నూలు, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఆలూరు నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌ పడగవిప్పింది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ముఠాకక్షలు మళ్లీ బయటపడ్డాయి. ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మార్పీఎస్‌ రాయలసీమ అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ(52) ఆదివారం దారుణహత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు పక్కా ప్రణాళిక ప్రకారం ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును టిప్పర్‌తో ఢీకొట్టి.. ఆపై కొడవళ్లతో నరికి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగింది. ఆయన ప్రమాణిస్తున్న వాహనంలో లక్ష్మీనారాయణ కుమారుడు వినోద్‌కుమార్‌, అనుచరుడు గోవిందు ఉన్నారు. ఈ దాడిలో లక్ష్మీనారాయణ తలపై, వీపుపై విచక్షణారహితంగా నరికారు. ఆయన కుమారుడు వినోద్‌కుమార్‌, గోవిందు కూడా గాయపడ్డారని గుంతకల్లు పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురిని గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీనారాయణ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈవిషయం తెలియగానే హతుడి భార్య, కుటుంబ సభ్యులు, చిప్పగిరి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. తాము గుంతకల్లు నుంచి చిప్పగిరి వెళ్తున్నామని, రైల్వే బిడ్జి వద్ద కారును టిప్పరుతో ఢీకొట్టి.. ఎనిమిది మంది వేట కొడవళ్లతో లక్ష్మీనారాయణను విచక్షణారహితంగా నరికి పారిపోయారని అదే దాడిలో గాయపడిన వినోద్‌ కుమార్‌, గోవిందు వివరించారు. ఎన్నో ఏళ్ల తరువాత కాంగ్రెస్‌ నేత హత్యకు గురికావడంతో ఆలూరు నియోజకవర్గం ముఖ్యంగా చిప్పగిరి ఉలికిపాటుకు గురైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో..? అంటూ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఘటనా స్థలాన్ని గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐలు మనోహర్‌, ఏపీ మస్తాన్‌ హత్య జరిగిన తీరును, ఢీకొట్టిన టిప్పరు, ఇన్నోవా వాహనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హత్యకు గురైన లక్ష్మీనారాయణ భార్య నరసమ్మ, కుమారులు వినోద్‌కుమార్‌, శివ, ఒక కుమార్తె రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది. హత్యను ఖండిస్తూ ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు గుంతకల్లులో ధర్నా చేశారు. గుంతకల్లు ఒకటవ పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్యాక్షన్‌ హత్యేనా.. మరో కారణమా..?

కర్నూలు జిల్లా కీలక టీడీపీ నేత, కేడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ వైకుంఠం శ్రీరాములు, ఆయన సతీమణి శకుంతలమ్మ దంపతులను 2007 నవంబరు 18న ఇంట్లోనే అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ జంట హత్యల కేసులో చిప్పగిరి లక్ష్మీనారాయణ ఏ-7 నిందితుడు. ఆ తర్వాత న్యాయస్థానం ఆ కేసులు కొట్టివేసింది. ఆ సమయంలో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న మూలింటి మారెప్ప సహచరుడిగా చిప్పగిరి లక్ష్మీనారాయణ ఉన్నారు. అదే సమయంలో ఆలూరు మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తరువాత కేంద్ర మాజీమంత్రి, ప్రస్తుత డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అనుచరుడిగా కాంగ్రెస్‌ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. కోట్ల దంపతులు 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరినా ఆయన మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం ఆపార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఎమ్మార్పీఎస్‌ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. వ్యక్తిగత పనులపై గుంతకల్లు వెళ్లి వస్తుండగా లక్ష్మినారాయణ హత్యకు గురయ్యారు. మూఠకక్షల్లో భాగంగానే ఈ హత్య జరిగిందా..? మరే ఇతర కారణాలు ఉన్నాయా..? అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. కుమారుడు వినోద్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు గుంతకల్లు పోలీసులు తెలిపారు. కాగా.. పది రోజుల క్రితం లక్ష్మీనారాయణ కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ను కలసి తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని విన్నవించినట్లు తెలిసింది.

చిప్పగిరిలో భారీ బందోబస్తు

లక్ష్మీనారాయణ దారుణ హత్య నేపథ్యంలో చిప్పగిరిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి చిప్పగిరికి వెళ్లి బందోబస్తును పర్యవేక్షించారు. ఎస్‌ఐ సతీశ్‌ ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీ, హతుడు ఇంటి వద్ద, బస్టాండ్‌ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్ష్మీనారాయణ మృతిపై మాజీ మంత్రి మూలింటి మారెప్ప. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, మాజీ ఎమ్మెల్యే మసాలా పద్మజ, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌, ఎంఆర్‌పీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్‌, తాలూకా అధ్యక్షుడు కత్తి రామాంజినేయులు, డివిజన్‌ అధ్యక్షులు ఎల్లప్ప, మసాలా జగన్‌ తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

Updated Date - Apr 28 , 2025 | 12:30 AM