అధికారుల్లో కలవరం..!
ABN, Publish Date - Jun 27 , 2025 | 11:53 PM
నంద్యాల జిల్లాలోనే సంచలనంగా మారిన ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని ఓ ఉద్యోగి చేతివాటం ప్రస్తుతం ఆ శాఖ అధికారులను కలవరానికి గురిచేస్తోంది.
ఆంధ్రజ్యోతి కథనంతో మొదలైన అలజడి
చాంద్‌బాషా వ్యవహారంపై అటవీ, పోలీసు శాఖలు సీరియస్
రూ.కోట్లు కొట్టేసిన కేసుపై ఆరా తీస్తున్న నంద్యాల ఎస్పీ
యూనియన్ బ్యాంకు సిబ్బంది అప్రమత్తం
ఆత్మకూరు, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలోనే సంచలనంగా మారిన ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని ఓ ఉద్యోగి చేతివాటం ప్రస్తుతం ఆ శాఖ అధికారులను కలవరానికి గురిచేస్తోంది. అంతేకాదు ఈయనతో చేతులు కలిపి అక్రమాలకు వంతుపాడిన ముఖ్య అధికారుల్లో అలజడి మొదలైంది. వాస్తవానికి ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ పరిధిలో ఏళ్ల తరబడి అడ్మినిస్ర్టేషన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించి 2024 జూలైలో రిటైర్డు అయిన చాంద్‌బాషా.. తన పని చేసిన సమయంలో ఫారెస్టు చెక్‌పోస్టుల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ టైగర్ కన్జర్వేషన్ ఫండ్ (ఏపీటీసీఎఫ్)కు, ఇతర సంస్థలకు ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేసే ప్రక్రియలో చేతివాటం ప్రదర్శించి కోట్ల రూపాయలు స్వాహా చేశాడు. ఈ వ్యవహారంపై ఇప్పటికే అటవీశాఖ ఉన్నతాధికారులు చాంద్‌బాషాపై పోలీసు కేసు నమోదు చేయించడంతో పాటు అక్రమాలను వెలికితీసేందుకు ఆరుగురితో కూడిన ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించారు. అయితే అప్పటికే పరారీలో ఉన్న చాంద్‌బాషాను పట్టుకోవడంతో పాటు ఆయన చేసిన అక్రమాలను పూర్తిస్థాయిలో వెలికితీయడంలో ఆయా విభాగాల అధికారుల విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘నల్లమలలో కళ్లుగప్పి.. రూ.కోట్లు కొట్టేశాడు’ కథనానికి పోలీసు, అటవీ, యూనియన్ బ్యాంకు అధికారులు అప్రమత్తమైనట్లు తెలిసింది. నిజానికి 2024 సంవత్సరంలోని ఏప్రిల్, మే నెలల్లో చాంద్‌బాషా సుమారు రూ.19లక్షలు అక్రమాలకు పాల్పడినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే 2025 ఏప్రిల్ 20వ తేదిన ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా చాంద్‌బాషా చేసిన అక్రమాల గురించి ఆధారాలతో సహా వెల్లడించారు. ఆతర్వాత ఏప్రిల్ 21వ తేదిన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మకూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ అటవీ అధికారులు పూర్తిస్థాయిలో విచారించకుండా రూ.19లక్షల వరకు చాంద్‌బాషా నుంచి రికవరీ చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ఓ వైపు పోలీసు స్టేషన్ కేసు నమోదైనప్పటికీ పోలీసుల ప్రమేయం లేకుండా అటవీ అధికారులు రికవరీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు సుమారు రూ.4.35 కోట్ల అక్రమాలు జరిగితే పూర్తి విచారణ చేపట్టకుండా హడావిడిగా రూ.19లక్షల రికవరీ చేయడం విమర్శలకు దారితీసింది. ఆతర్వాతే ఈ వ్యవహారంలో భాగస్వాములైన నిందితులు పరారైనట్లు తెలిసింది.
ఆంధ్రజ్యోతి కథనంతో అప్రమత్తం
ఆత్మకూరు అటవీ శాఖను కుదిపేసిన చాంద్‌బాషా వ్యవహారంపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనంతో పోలీసు, అటవీ, బ్యాంకు అధికారులు మరింత అప్రమత్తమైనట్లు తెలిసింది. ప్రత్యేకించి ఈ కేసుపై తొలి నుంచి నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. నిందితులను పట్టుకోవాలని ఎప్పటికప్పుడు కేసు పురోగతిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసు అధికారులు కూడా పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుంటే రూ.కోటి దాటే కేసులను సీఐడీకి అప్పగించే అవకాశం ఉంటుంది. కానీ పోలీసుశాఖ ఉన్నతాధికారులు ఈ కేసును స్థానిక పోలీసులకే అప్పగించడం వల్ల దర్యాప్తు కొంత మందకొడిగా సాగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీంతో ఈ కేసును సీఐడీకి అప్పగించే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా చాంద్‌బాషా అక్రమాల గుట్టును పూర్తిస్థాయిలో వెలికితీసేందుకు పీసీసీఎఫ్ ఏకేనాయక్ ఆరుగురుతో కూడిన బృందాన్ని నియమించారు. అయితే ఆ బృందం ఇప్పటివరకు ఒక్కరోజు కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేదని తెలిసింది. దీంతో వారు కూడా అక్రమాలపై విచారణ చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. అదేవిధంగా చాంద్‌బాషా వ్యవహారంలో కీలకంగా మారిన యూనియన్ బ్యాంకులో ఆర్టీజీఎస్ నెఫ్ట్ ఫారంలో కూడా చెక్కు హోల్డర్ సంతకం లేకుండా చాంద్‌బాషా, ఇతరుల సంతకాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఆంధ్రజ్యోతి కథనంలో అప్రమత్తమైన యూనియన్ బ్యాంకు రీజనల్ అధికారులు శుక్రవారం సాయంత్రం స్థానిక బ్రాంచ్ సిబ్బందితో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు తెలిసింది.
అటవీశాఖకు తలవంపులు..!
ఇంతకాలం గుట్టుగా సాగుతున్న అటవీశాఖలో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో ఆశాఖకు తలవంపులు వచ్చినట్లయింది. దీంతో అందులో నిజాయితీగా పనిచేసే అధికారులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రజల నుంచి అనేక రూపాల్లో వసూళ్లు చేసిన కోట్ల రూపాయల ప్రజాధనం దారిమళ్లడంపై వారు సైతం మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఈ తప్పిదాలు చోటుచేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ప్రతిఏటా జరిగే ఆడిట్‌ను కూడా సక్రమంగా చేసిఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని అభిప్రాయపడుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిట్ లేదా విజిలెన్స్ వంటి దర్యాప్తు సంస్థలతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కుబేరా సినిమా తరహాలో..
చాంద్‌బాషా చేసిన అక్రమాల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. చెక్కులను దారిమళ్లించే క్రమంలో కుబేరా సినిమా తరహాలో చాంద్‌బాషా తనదైన శైలిలో అవకతవకలకు పాల్పడ్డాడు. చాంద్‌బాషాకు పరిచయస్తుడైన మహేశ్వర ప్రింటర్స్ నిర్వాహకులు వెంకట శివయ్యతో పాటు అతని భార్య, తల్లి బ్యాంకు ఖాతాలకు భారీగా ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేసి అతని నుంచి పలు దుకాణాలకు యజమానులకు మళ్లించి వారి వద్ద డబ్బు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. అదేక్రమంలో వెంకటశివయ్య వద్ద పనిచేసే శ్రీను అనే ఓ దివ్యాంగుడి ఖాతాలో కూడా సుమారు రూ.20లక్షల వరకు నగదు మళ్లించి డ్రా చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం గురించి సదరు దివ్యాంగుడైన శ్రీనుకు ఏమీ తెలియకపోవడం గమనార్హం.
Updated Date - Jun 27 , 2025 | 11:53 PM