కమ్మేసిన మేఘాలు.. కుమ్మేసిన వానలు
ABN, Publish Date - May 26 , 2025 | 12:00 AM
కర్నూలు నగరంపై ఆదివారం మధ్యాహ్నం మేఘాలు కమ్మేశాయి. నీలాకాశంలో కారుమబ్బులు కనువిందు చేశాయి.
పులకరించిన నగరం
రహదారులు జలమయం
స్తంభించిన జనజీవనం
జీవాలకు అందుతున్న జలం
పల్లెసీమల్లో ముందస్తు సాగుకు సిద్ధం
అన్నదాతల హర్షం
కర్నూలు, మే 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంపై ఆదివారం మధ్యాహ్నం మేఘాలు కమ్మేశాయి. నీలాకాశంలో కారుమబ్బులు కనువిందు చేశాయి. ప్రజలు ఆసక్తిగా చూశారు. బళ్లారి చౌరస్తా, రాజ్‌విహార్ సర్కిల్ దగ్గర హంద్రీ నదిపై దట్టమైన మేఘాలు కుండపోత వర్షం కురిసేందుకు సిద్ధం అన్నట్లుగా కదులుతున్నాయి. వర్షానికి సంకేతంగా మేఘాల నుంచి చిరుజల్లులు నేలను తాకుతున్నాయి. రోడ్లపై జనం, వాహనదారులు సురక్షిత ప్రాంతాలకు చేరుకుందామని వేగంగా సాగిపోతున్నారు. అంతలోనే చిరు జల్లులు జడివానై కుమ్మేసింది. భారీ వానలతో నగరం తడిసిముద్దయ్యింది. రహదారులు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించిఇంది. రుతపవనాలు ముందుగానే తీరం దాటడంతో జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రోళ్లు పగిలే ఎండలతో వాతావరణ వేడెక్కుంతుందని జనం భయపడిపోయారు. ముందస్తు వానలతో నగరం పులకరించింది. వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా అంతటా వాతావారణ చల్లబడింది. జిల్లాలో మే నెల సాధారణ వర్షపాతం 29.7 మిల్లీమీటర్ల కాగా.. ఇప్పటికే 82.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 172 శాతం అధిక వర్షాపాతం నమోదయ్యింది. 2009 తరువాత దాదాపు 15 ఏళ్లకు మే నెలలో హంద్రీ, వేదావతి, తుంగభద్ర నదులకు వరద చేరాయని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. వాగులు, వంకలు పొగిపోర్లాయి. తీవ్ర ఎండలతో నెర్రలిచ్చే పలు చెరువులు మందస్తు వర్షాలకు వర్షపు నీటితో నిండుతున్నాయి. పశువులకు తాగునీటి సమస్య తీరుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సగటున 9.1 మిల్లీ మీటర్లు వర్షం పడి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎమ్మిగనూరు, ఆదోని, కోడుమూరు, పత్తికొండ ప్రాంతాల్లో ఎర్రమట్టి నేలల్లో దుక్కులు జోరు పెంచారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షాలకు దశాబ్దాలుగా నీడనిచ్చిన మహా వృక్షాలు నేలకూలుతున్నాయి. అదే క్రమంలో ముందస్తు వ్యవసాయ ప్రణాళిక తయారీలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
Updated Date - May 26 , 2025 | 12:00 AM