మిరప మట్టిపాలు
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:06 PM
గిట్టుబాటు ధర లేక కొందరు రైతులు మిరప పంటపై మట్టి కప్పి ఎరువుగా మారుస్తున్నారు. చిప్పగిరి మండలంలో మిరప రైతు దుస్థితికి ఈ సంఘటన అద్దం పడుతుంది.
పంటను ఎరువుగా మార్చేస్తున్న రైతులు
ధరలు లేకపోవడమే కారణం
చిప్పగిరి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : గిట్టుబాటు ధర లేక కొందరు రైతులు మిరప పంటపై మట్టి కప్పి ఎరువుగా మారుస్తున్నారు. చిప్పగిరి మండలంలో మిరప రైతు దుస్థితికి ఈ సంఘటన అద్దం పడుతుంది. ఈ ఏడాది మిరప సాగుచేసిన రైతులు రూ. లక్షల్లో నష్టపోయారు. అకాల వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, తెగుళ్లు రైతులను కృంగదీశాయి. చిప్పగిరి మండలంలో మూడేళ్లుగా బ్యాడిగ రకం మిరపను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఏడాది 6వేలు ఎకరాలలో మిరప సాగు చేశారు. ఎకరానికి 1,50,000 నుంచి 2లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. 2023-2024 సంవత్సరంలో క్వింటం మిరప రూ.50,000 నుంచి70,000 దాకా ధర పలికింది. దీంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. వీరిని చూసిన రైతులు రెట్టింపు ఉత్సాహంతో 2024-2025 ఏడాది పంట సాగు మూడింతలకు పెరిగింది. ఊహించని రీతిలో ధర రూ. పది వేల నుంచి 15,000 లోపు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మార్కెట్లో రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో కొందరు రైతులు మిరపను పొలాల్లోనే వదిలేస్తున్నారు. చిప్పగిరికి చెందిన మధుసూదన్ అనే రైతు రూ. పది లక్షలు విలువచేసే మిరపను పొలంలోనే వదిలేసి మట్టి కప్పి ఎరువుగా మార్చాడు. మిరప రైతులకు ఎకరానికి రూ. ఇరవై వేల నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే విరుపాక్షి కోరారు.
Updated Date - Jun 24 , 2025 | 11:06 PM