రాష్ట్రం కోసం శ్రమిస్తున్న చంద్రబాబు
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:50 PM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వజ్రోత్సవ సాంస్కృతిక వారోత్సవాల్లో శుక్రవారం ‘శాస్త్రీయ, జానపద, సినీ నృత్య లహరి’ ప్రదర్శనలు, ‘కళాకారులకు సత్కారాలు’ నిర్వహించారు. ముందుగా చంద్రబాబు నిలువెత్తు ఫ్లెక్సీ చిత్రపటానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య క్షీరాభిషేకం చేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓర్వకల్లులో ఇప్పటికే అనేక పరిశ్రమలు వచ్చాయని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలు జిల్లాల్లో ప్రారంభమవుతాయన్నారు. అందుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నారని అన్నారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు, కళారత్న పురస్కార గ్రహీత పత్తి ఓబులయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవ సాంస్కృతిక వారోత్సవాలు వారం రోజుల పాటూ కన్నుల పండువగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని రంగాల వారికి ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నృత్య గురువులు నారాయణస్వామి, ఎస్.కరీముల్లా, రోహిత్, నాగసాయి ప్రదీప్‌లను, భానుస్వామిలను ఎమ్మెల్యే సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాక్షేత్రం సభ్యులు మహమ్మద్ మియా, సీవీ రెడ్డి, శివయ్య, ఎస్‌ఎండీ ఇనాయతుల్లా, ఎర్రమ పాండురంగయ్య, రాజారత్నం, యాగంటీశ్వరయ్య, సంగా ఆంజనేయులు, వాల్మీకి రాముడు, గాండ్ల లక్ష్మన్న, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన నృత్య విభావరి : చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వజ్రోత్సవ సాంస్కృతిక వారోత్సవాల్లో నిర్వహించిన జానపద, శాస్త్రీయ, సినీ నృత్య విభావరి ప్రేక్షకులను అసాంతం అకట్టుకుంది. కూచిపూడి, భరతనాట్యం నృత్య గురువులు నారాయణస్వామి, ఎస్.కరీముల్లా, రోహిత్, నాగసాయి ప్రదీప్‌ల ఆధ్వర్యంలో నృత్య కళాకారులు వివిధ రూపకాలపై ఆకట్టుకునేలా ప్రదర్శనలు చేశారు.
నేడు శ్రీవేంకటేశ్వర మహాత్యం నాటకం : టీజీవీ కళాక్షేత్రంలో శనివారం ఏడోరోజు వజ్రోత్సవ వారోత్సవాల చివరి రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు ‘శ్రీ వెంకటేశ్వర మహాత్యం’ భక్తిరస పద్య నాటకం ప్రదర్శిస్తున్నారు. టీజీవీ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఈ నాటకానికి అకాడమీ అధ్యక్షుడు, ప్రముఖ నాటక దర్శకుడు, సీనియర్ రంగస్థల నటుడు వీవీ రమణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. శారదా ప్రసన్న ఈ నాటకం రాశారని పత్తి ఓబులయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ హాజరవుతారని ఆయన తెలిపారు.
Updated Date - Apr 25 , 2025 | 11:50 PM