బెల్ట్ ఫుల్
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:52 AM
దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామ జనాభా దాదాపు పది వేలు. ఇక్కడ 30కి పైగా మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి. కొందరు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.
విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు
రాజకీయ అండతో రెచ్చిపోతున్న మద్యం మాఫియా
ప్రతి నెల రూ.కోట్లకు పైగా మద్యం అమ్మకాలు
కళ్లకు గంతలు కట్టుకున్న ఎక్సైజ్ నిఘా
సీఎం హెచ్చరికతోనైనా బెల్ట్ షాపులకు కళ్లెం పడేనా?
కర్నూలు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామ జనాభా దాదాపు పది వేలు. ఇక్కడ 30కి పైగా మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి. కొందరు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రపురం, తుంగభద్ర నది ఒడ్డున రెండు బెల్ట్ దుకాణాల్లో మద్యం విక్రయిస్తున్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ జిల్లా యంత్రాంగం ఉండే కర్నూలు నగర శివారుల్లోని వీకర్ సెక్షన్ కాలనీల్లో గల్లీకో బెల్ట్ షాపు పెట్టి అందిన కాడికి దండుకుంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. పల్లెపల్లెన మద్యం ఏరులై పారుతోంది. టీడీపీ కూటమి ముఖ్య ప్రజాప్రతినిధుల అండదండలతో, ఎక్సైజ్ నిఘా కళ్లకు గంతలు కట్టుకోవడతో ఊరూరా.. వీధివీధినా మద్యం బెల్ట్ షాపులు బార్లా తెరుచుకున్నాయి. మద్యం బెల్ట్‌షాపులపై క్షేత్రస్థాయి వాస్తవాలతో ఆంధ్రజ్యోతి కథనం.
జిల్లాలో 99 మద్యం దుకాణాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేస్తే.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 2019కి ముందు తరహాలో ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగిస్తూ.. రెండేళ్ల లీజుకు దరఖాస్తులు స్వీకరిస్తే 3,046 మంది దరఖాస్తులు చేశారు. రుసుం రూపంలో రూ.60 కోట్లకుపైగా ఖజానాకు ఆదాయం వచ్చింది. లాటరీ ద్వారా మద్యం షాపులు లీజుదారులకు అప్పగించారు. నవంబరు ఒకటో తారీఖు నుంచి లీజుదారులు మద్యం షాపులలో అమ్మకాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు పోయి.. ప్రైవేటు వైన్స్ వచ్చాయి. కావాల్సిన బ్రాండ్లు కొనుకోవచ్చు.. తాగొచ్చు. అయితే.. ఎక్కడో ఉన్న లైసెన్సుడ్ మద్యం షాపులకు వెళ్లి కొనుక్కునేందుకు ఇబ్బంది పడకుండా.. మద్యం ప్రియులకు అందుబాటులోకే మద్యం అన్నట్లు పల్లెపల్లెన.. వీధివీధిన అనఽధికారిక బెల్ట్ షాపులు బార్లా తెరుచుకున్నాయి. మూడు క్వార్టర్లు.. ఆరు బీరు సీసాల్లో విస్తరిస్తున్నారు. టీడీపీ కూటమి ముఖ్య ప్రజాప్రతినిధులు, వారికి సన్నిహితంగా ఉండే కీలకమైన నాయకుల అండతో ఈ వ్యవహారం సాగుతున్నట్లు తెలుస్తున్నది. మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల నిర్వహణలో ఈ స్థాయిలో రాజకీయ జోక్యం మునుపెన్నడు చూడలేదని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారంటే ఏ స్థాయిలో విస్తరించారో ఇట్టే తెలుస్తుంది.
క్వార్టర్ సీసాపై రూ.25 అదనం
ప్రభుత్వ లైసెన్డ్ మద్యం షాపులో విక్రయించే ఎమ్మార్పీ ధరలు కంటే ఎక్కువ ధరలకు బెల్ట్ షాపులు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం సామాన్యులకు నాణ్యమైన మద్యం తక్కువ ధరకు ఇవ్వాలనే లక్ష్యంగా రూ.99లకే క్వార్టరు లిక్కరు తీసుకొచ్చారు. ఇదే సీసా గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో రూ.125 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. ఇతర బ్రాండ్ల మద్యం క్వార్టర్ సీసా, బీరు సీసాపై ఎమ్మార్పీ కంటే రూ.15 నుంచి రూ.25 వరకు అదనంగా వసులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అదనుగా మంత్రాలయం, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో కర్ణాటక, తెలంగాణ సరిహద్దు మండలాల్లోని గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో కర్ణాటక తయారీ అక్రమ మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్-ఎన్‌డీపీఎల్) విక్రయాలు చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 2 వేలకు పైగా మద్యం బెల్ట్ దుకాణాలు ఉన్నాయని అనధికారిక సమాచారం. నవంబరు నెలలో అధికారికంగా రూ.75 కోట్లు విలువైన మద్యం 96,330 కేసులు లిక్కరు, 37,676 కేసులు బీరు విక్రయాలు జరిగాయి. అందులో బెల్ షాపుల్లో ఒక్కటే రూ.25 కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని అంచనా వేస్తున్నారు.
ఒక్కో బెల్ట్ షాపునకు ఒక్కో రేటు
కర్నూలు సిటీ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 31, కోడుమూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 14, ఎమ్మిగనూరులో 15, కోసిగిలో 4, పత్తికొండలో 14, ఆదోనిలో 12, ఆలూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 9 లైసెన్సుడ్ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఒక్కో మండలంలో ఒకటి రెండు మద్యం షాపులు ఉంటే.. ఏ పల్లెకు వెళ్లినా ఏమున్నది గర్వకారణం.. వీధివీధిన... సందుసందున మద్యం బెల్ట్ షాపులే అన్నట్లుగా మార్చేశారు. ప్రతి పల్లెలో 3 నుంచి 5 బెల్ట్ షాపులు ఉంటే, పెద్ద గ్రామాల్లో 10-15కిపైగా ఉన్నాయని తెలుస్తుంది. ఒక్కో బెల్ట్ షాపులకు ఒక్కో రేట్ చొప్పున మద్యం షాపుల యజమానులు రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు డిపాజిట్ రూపంలో వసులు చేసినట్లు తెలుస్తున్నది. డిమాండ్ ఉన్న పల్లెల్లో రూ.లక్ష వరకు తీసుకున్నారనే ఆరోపణులు ఉన్నాయి. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రతి షాపు నుంచి నెల మామూళ్లు నిర్ణయించడం, ముఖ్య ప్రజాప్రతినిధులు జోక్యంతో ఎక్సైజ్, పోలీసు యంత్రాంగం చూసీచూడనట్లు వెళ్తున్నారనే ఆరోపణులు ఉన్నాయి. బెల్ట్ షాపుల నిర్వహణలో అధికార టీడీపీ కూటమి నేతలతో పాటు ప్రతిపక్ష వైసీపీ నాయకులు ఉండడం కొసమెరుపు.
బెల్ట్‌కు కళ్లెం పడేనా..?
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు ప్రజావేదిక సభలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ .. మద్యం మాఫియాను అరికట్టి తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచాం.. మద్యం వ్యాపారంలో ఇతరుల జోక్యాన్ని సహించను. బెల్టు షాపులు పెడితే నేను కూడా బెల్టు తీయాల్సి వస్తుంది.... అని హెచ్చరించారు. అయినా టీడీపీ కూటమి నాయకుల్లో మార్పు వస్తుందా..? ఎక్సైజ్ అధికారుల్లో కదలిక వస్తుందా..? ఊరూవాడా విచ్చలవిడిగా వెలసిన మద్యం బెల్టు షాపులకు తాళం పడుతుందా..? అన్నది ప్రశ్నార్థకమే. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కీలక ప్రజాప్రతినిధులే జోక్యం చేసుకోవడంతో నిఘా అధికారులు కళ్లకు గంతులు కట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిఘా ఉంచాం
గ్రామాల్లో బెల్డ్ షాపులపై నిఘా పెట్టాం. ఎక్సైజ్ స్థానిక, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. నవంబరు నెలలో 66 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 350 లీటర్లు ఐఎంఎల్ మద్యం సీజ్ చేసి 64 మందిని అరెస్ట్ చేశాం. మరో 70 కేసులు నమోదు చేసి కర్ణాకట తయారీ అక్రమ ఎన్‌డీపీఎస్ మద్యం 934 లీటర్లు సీజ్ చేశాం. 23 నాటు సారా కేసులు నమోదు చేశాం. - సుధీర్‌బాబు, ఎక్సైజ్ శాఖ
Updated Date - Apr 17 , 2025 | 12:52 AM