ఏళ్ల తరబడి అక్కడే..!
ABN, Publish Date - Jun 07 , 2025 | 11:23 PM
కర్నూలు జీజీహెచ్, మెడికల్ కాలేజీ పరిపాలన విభాగంలో కొందరు జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగం చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేచోట తిష్ట వేసి కూర్చున్నారు.
కదలని జూనియర్ అసిస్టెంట్లు
అక్రమాలకు పాల్పడుతున్న వైనం
సహకరిస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్
బదిలీలకు ఆదేశాలు జారీ చేసిన డీఎంఈ
ఫెవికాల్ వీరులు కదిలేనా?
కర్నూలు హాస్పిటల్, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జీజీహెచ్, మెడికల్ కాలేజీ పరిపాలన విభాగంలో కొందరు జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగం చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేచోట తిష్ట వేసి కూర్చున్నారు. జూనియర్ అసి‘టెంట్లు’ వేసుకొని కూర్చున్నట్లు ఉన్నది పరిస్థితి. కొందరు ఒకే సీటులో అతుక్కుపోయి అక్రమాలు చేస్తున్నారు. కర్నూలు జీజీహెచ్ పరిపాలన విభాగంలో ఏకంగా 35 ఏళ్లుగా ఓ జూనియర్ అసిస్టెంట్ కార్యాలయంలో పని చేస్తున్నారు. మరో జూనియర్ అసిస్టెంట్ కూడా ఏళ్ల తరబడి ఇక్కడే తిష్టవేశారు. సీనియర్ అసిస్టెంట్లగా పదోన్న తులు వచ్చినా వాటిని తీసుకోకుండా ఇక్కడే కొనసాగుతున్నారు. ఇటీవల ఓ జూనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి వచ్చినా తీసుకోకుండా ఇక్కడే పనిచేస్తున్నారు. ఇక కొందరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్ అండతో ఆదాయం వచ్చే ఒకే సీటులో కొనసాగు తున్నారు. ఇక మెడికల్ కాలేజీలో కూడా 33ఏళ్లుగా జూనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పుతున్నారు. మరికొందరు కూడా 30ఏళ్లుగా పైగా ఉన్నారు. ఓ అటెండరు స్థాయి ఉద్యోగి కూడా ఇక్కడ ఏళ్ల తరబడి చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం కొనసాగే బదిలీ పర్వంలోనైనా ఈ ఫెవికాల్ వీరులు కదిలేనా అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అంతర్గత బదిలీలకు ఆదేశాలు
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో ఉన్న కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఐ-హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్‌లో జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, స్టెనోలకు జిల్లా కేంద్రంలోనే అంతర్గత బదిలీలు నిర్వహిం చాలని డీఎంఈ డా.నరసింహం శనివారం ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్లకు తప్పనిసరిగా ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి బదిలీ చేయాలన్నారు. కర్నూలు జీజీహెచ్‌లో 15 మంది జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు రికార్డు అసిస్టెంట్లు, ఒక టైపిస్టులు ఉండగా.. కర్నూలు మెడికల్ కాలేజీ లో 15మంది జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, కంటి ఆసుపత్రి, స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్‌లో మరో 10మంది జూని యర్ అసిస్టెంట్లు రెగ్యులర్‌గా పని చేస్తున్నారు.
సర్వీసు, పోస్టుల వివరాలను..
ఈ నెల 10వ తేదీ జూనియర్ అసిస్టెంట్లు, ఇతరులు బదిలీ దరఖాస్తులు, సర్వీసు వివరాలను, పోస్టుల వివరాలను డీఎంఈ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశిం చారు. దీని ఆధారంగా జూనియర్ అసిస్టెంట్లకు ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి అంతర్గత బదిలీలు జరగనున్నాయి. డీఎంఈ అకస్మిక నిర్ణయంపై ఏళ్ల తరబడి పాతుకుపోయిన జూనియర్ అసిస్టెంట్ల గొంతులో వెలక్కాయ పడినట్లయింది.
Updated Date - Jun 07 , 2025 | 11:23 PM