మళ్లీ మొదటికి..!
ABN, Publish Date - May 11 , 2025 | 12:19 AM
రాయలసీమ యూనివర్సిటీలో టైం స్కేల్ ఉద్యోగుల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.
ఆర్‌యూలో టైం స్కేల్ ఉద్యోగుల వివాదం
17 మందిని విధుల్లోకి తీసుకునేందుకు ఉత్సాహం
గతంలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరిక
విద్యాశాఖ విచారణలో వెల్లడి
అయినా విధుల్లోకి తీసుకునేందుకు చర్యలు?
కర్నూలు అర్బన్, మే 10(ఆంధ్రజ్యోతి): రాయలసీమ యూనివర్సిటీలో టైం స్కేల్ ఉద్యోగుల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. 2018లో అప్పటి ఉపకులపతి 102 మంది కాంట్రాక్టు ఉద్యోగులను, ఒకే సర్వీసులో 5 సంవత్సరాలు పని చేసిన వారిని టైం స్కేల్ ఉద్యోగులుగా ప్రమోట్ చేశారు. కానీ టైం స్కేల్ ఉద్యోగుల్లో చాలా మంది 60 సంవత్సరాలకు పైబడిన వారు ఉండటం, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం తెచ్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ఉపకులపతి ఇంటర్నల్ కమిటీతో నామమాత్రంగా విచారణ చేసి మమ అనిపించారు. అయితే పూర్తిస్థాయి కమిటీతో విచారణ చేపట్టాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. దీంతో ఏడేళ్ల నుంచి టైం స్కేల్ ఉద్యోగుల ఫైల్‌పై వివాదాలు అలుముకున్నాయి. ఓ విద్యార్థి నాయకుడి ఫిర్యాదుతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్యామల రావు విచారణకు ఆదేశించారు. 42 మంది టైం స్కేల్ ఉద్యోగుల జాబితాను అప్పటి ఉపకులపతి ఆనందరావు కర్నూలు, నంద్యాల డీఈఓ (జిల్లా విద్యాశాఖాదికారులకు) టైం స్కేల్ ఉద్యోగుల జాబితా పంపారు. అందులో విచారణ అనంతరం 39 మంది ఫేక్ సర్టిఫికెట్‌గా నిర్ధారించారు. వాటిలో కర్నూలు డీఈఓ కార్యాలయం 17 మంది ఫేక్ అని నిర్ధారించి పంపడంతో వారిని అప్పటి వీసీ ఆనందరావు వారిని తొలగించారు. తాజాగా నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి మరో 22 మంది ఉద్యోగులకు సంబంధించి కూడా నకిలీ సర్టిఫికెట్లు అంటూ జాబితా సిద్ధం చేసి రాయలసీమ యూనివర్సిటీతో పాటు ఉన్నత విద్యామండలికి సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో మిగిలిన ఉద్యోగులపై కూడా వేటు పడే అవకాశం ఉందనే ప్రచారం యూనివర్సిటీలో జరుగుతోంది.
కూటమి ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు, టైం స్కేల్ ఉద్యోగుల జాబితాను సీఎఫ్‌ఎంఎస్‌కు పంపాలని స్టేట్ ఫైనాన్స్ అధికారులు ఆదేశించారు. కానీ రాయలసీమ యూనివర్సిటీలో టైం స్కేల్ ఉద్యోగుల జాబితా మాత్రం తిరస్కరించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా ఎక్స్‌ట్రనల్ కమిటీ ఆమోదం లేకుండా అడ్డగోలుగా ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టిన వారిపేర్లను కూడా పంపారు. వాటిని సరిచేసి అర్హత గల వారి టైం స్కేల్ ఉద్యోగుల పేర్లు మాత్రమే పంపాలంటూ రాష్ట్రస్థాయి అధికారులు తిరస్కరించడం చర్చనీయాంశమైంది.
102 మంది టైం స్కేల్ ఉద్యోగుల జాబితాను సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఎస్సీ-54, బీసీ-27, ఓసీ-15, ఎస్టీ-6గా ఉన్నాయి. అయితే ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి కొన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేశారంటూ బీసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఉన్నత విద్యామండలి రాష్ట్ర స్థాయి వర్సిటీల రివ్వూ మీటింగ్‌లో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్యామలరావు ఆర్‌యూలో ఉద్యోగులకు సంబంధించి అడ్డగోలు నిర్ణయాల తీరును ప్రస్తావించారు.
ఉపకులపతికి ఎందుకంత ఉత్సాహం
నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి సిఫారసు చేసిన జాబితాను తొక్కిపెట్టి తొలగించిన 17 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఉపకులపతి ఉత్సాహం ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వివాదాస్పద ఉద్యోగులను తీసుకోవడంపై జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను తొలగించిందని వాళ్లను విధుల్లోకి తీసుకోవాలని కీలక ప్రజాప్రతినిధి మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లాడని ఆర్‌యూలో చర్చ సాగుతోంది. వివాదాస్పద ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని అదే ప్రజాప్రతినిధి ఉపకులపతిని కూడా కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ ఉద్యోగులవి ఫేక్ సర్టిఫికెట్లని జిల్లా విద్యాశాఖ నిర్ధారించిన నివేదికలు, పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను కాదని విధుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించడం ఏమిటని పలువురు ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ప్రజాప్రతినిధి బంధువులు ఆరుగురితో పాటు ఆయన సామాజికవర్గం, సొంత గ్రామానికి చెందిన మరో 9 మంది ఉండటంతోనే ఒత్తిడి వేగవంతమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఎలాగైనా అతి త్వరలోనే వివాద ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేల పావులు కదుపుతున్నట్లు సమాచారం.
అలాంటిదేమీ లేదు
గతంలో తొలగించిన వారిని ఎలా తీసుకుంటాం. అలాంటిదేమీ లేదు. కానీ ఎవరినైనా ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఉన్నత విద్యాశాఖ అనుమతులు మేరకే తీసుకుంటాం.
- వి.వెంకట బసవరావు, ఉపకులపతి, రాయలసీమ యూనివర్సిటీ
Updated Date - May 11 , 2025 | 12:19 AM