ఉపాధి కూలీలకు భరోసా..
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:05 AM
ఉపాధి కూలీలకు భరోసా..
ప్రమాద బీమా రూ.50 వేల నుంచి రూ.4 లక్షలకు పెంపు
కర్నూలు అగ్రికల్చర్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో పని చేసే శ్రామికులకు గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. ప్రమాదవశాత్తు వారు మరణిస్తే కేవలం ప్రమాద బీమా రూ.50 వేలు మాత్రమే చెల్లించే వారు. దీంతో ఆ కు టుంబాలు వీధి పాల య్యాయి. కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న రైతులు, కూలీలకు ప్రమాద బీమా మొత్తాన్ని రూ.50వేల నుంచి రూ.4 లక్షలకు పెంచడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కర్నూలు జిల్లాలో మూడున్నర లక్షల కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 2 లక్షల కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి.
ప్రమాద బీమా పెంపు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేస్తున్న ఉపాధి శ్రామికులకు మేలు చేకూర్చే కార్యక్రమాన్ని ఇటీవల వెల్లడించారు. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో 1.70 లక్షల మంది ప్రస్తుతం పనులు చేస్తున్నారు. వీరికి రోజూ వారి వేతనం రూ.307కు పెంచారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల అమరావతిలో నిర్వహించిన ఉపాధి శ్రామికుల ఆత్మీయ కలయికలో భాగంగా బీమా పరిహారంపై ప్రకటన చేశారు. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణించినా, తీవ్ర అంగవైకల్యానికి గురైనా ఆ కుటుంబ సభ్యులకు బీమా వర్తిస్తుంది. ఇది ఇప్పటి వరకు గరిష్ఠంగా రూ.50వేలు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం రూ.4లక్షలకు పెంచారు.
లక్షన్నర మందికి లబ్ధి
ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం లక్షన్నర మంది దాకా ఉపాధి పనులు చేస్తున్నారు. వీరంతా సొంత గ్రామాలతో పాటు సమీప గ్రామాలకు పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పని ప్రదేశంలో పాము కాటు, వడదెబ్బ, పిడుగు తదితర కారణాల వల్ల మృతి చెందుతున్నారు. ఇకపై ఇలాంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించనుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవనజ్యోతి బీమా యోజన ద్వారా రూ.2 లక్షలు చెల్లిస్తుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పరిహారం మరో రూ.2లక్షలు కలిపి మొత్తం రూ.4 లక్షల పరిహారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు కూడా ఆసరా కల్పించేలా వారికి ఇస్తున్న బీమా సాయాన్ని పెంచింది. ప్రస్తుతం ఉపాధి పథకంలో ప్రతి మండలంలో సగటున పది మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న నీటి యాజమాన్య సంస్థలో రెగ్యులర్ ఉద్యోగులు ఎవరూ లేరు. చాలా వరకు కాంట్రాక్టు, రిసోర్సు విధానంలో పని చేస్తున్నారు. వీరిలో ఏపీవో, ఈసీ, సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ సిబ్బంది, జిల్లా స్థాయిలో పని చేసే ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఇప్పటి దాకా ప్రమాద మరణ, వైకల్య బీమా రూ.3 లక్షలుగా ఉంది. వీరిలో నిర్దేశిత కాలపరిమితి ఉద్యోగులకు (ఎఫ్‌టీఈ) ఈ పరిహారం గరిష్టంగా రూ.30 లక్షలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకోవడంతో పాటు ప్రస్తుతం అమలవుతున్న వేతన ఖాతాల్లో మార్పులు కూడా చేసింది. తద్వారా ఉమ్మడి జిల్లాలో వందలాది మందికి పై ప్రయోజనాలు అందనున్నాయి.
ఉపాధి శ్రామికులకు ఎంతో మేలు
కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న శ్రామికులకు, తాత్కాలిక ఉద్యోగులకు ప్రమాద బీమా మొత్తాన్ని పెంచింది. ప్రమాదవశాత్తు మరణించినా, గాయపడినా గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువ మొత్తాన్ని పరిహారంగా అందిస్తారు. గతంలో రూ.50వేలు మాత్రమే చెల్లించేవారు. ప్రస్తుతం రూ.4లక్షల దాకా బాధిత కుటుంబ సభ్యులకు అందిస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పేద కుటుంబాల్లో ఈ పథకంపై మరింత శ్రద్ధ పెరిగి ఎక్కువ మంది శ్రామికులు పని కోసం వచ్చే అవకాశం ఉంది.
ఫ వెంకటరమణయ్య, డ్వామా పీడీ
Updated Date - Jun 09 , 2025 | 12:05 AM