‘తుంగభద్ర’ గేట్లన్నీ మార్చాల్సిందే
ABN, Publish Date - Apr 23 , 2025 | 12:16 AM
‘తుంగభద్ర డ్యాం 33 క్రస్ట్ గేట్ల జీవితకాలం ఎప్పుడో తీరిపోయింది. మెజార్టీ గేట్లు 60 శాతం, మిగిలిన గేట్లు 40-50 శాతం వరకు చివరి భాగంలో తుప్పుపట్టాయి.
వాటి జీవితకాలం ఎప్పుడో తీరిపోయింది
నిర్లక్ష్యం చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం
తుంగభద్ర బోర్డుకు ‘కేఎస్‌ఎన్‌డీటీ’ నివేదిక
ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలకు, సీడబ్ల్యూసీకి
నివేదించిన టీబీపీ బోర్డు అధికారులు
‘తుంగభద్ర డ్యాం 33 క్రస్ట్ గేట్ల జీవితకాలం ఎప్పుడో తీరిపోయింది. మెజార్టీ గేట్లు 60 శాతం, మిగిలిన గేట్లు 40-50 శాతం వరకు చివరి భాగంలో తుప్పుపట్టాయి. అన్ని గేట్లనూ మార్చాల్సిందే. నిర్లక్ష్యం చేస్తే గత ఏడాది తరహాలో ఎప్పుడైనా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది’ అని డ్యాం గేట్ల పటిష్ఠతపై సమగ్ర పరిశీలన చేపట్టిన చీరాలకు చెందిన అధ్యయన సంస్థ కేఎస్‌ఎన్‌డీటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు సమగ్ర వివరాలతో టీబీపీ బోర్డుకు నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టుతో పాటు గతంలో సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏకే బజాజ్ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా తుంగభద్ర బోర్డు అధికారులు ఆంధప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలకు, సీడబ్ల్యూసీకి ఒక నివేదిక పంపారు. మొత్తం క్రస్ట్ గేట్లను మార్చాలంటే ఒక్కోదానికి రూ.2 కోట్ల చొప్పున దాదాపు రూ.60-66 కోట్ల మేర నిధులు అవసరమవుతాయి. అయితే పాత గేట్లను విక్రయించడం ద్వారా రూ.10 కోట్లు వస్తాయని అంచనా. అన్ని గేట్లు మారుస్తారా? ఒక్క గేటుతో సరిపుచ్చుతారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం గత ఏడాది ఆగస్టులో కొట్టుకుపోయిన 19వ నంబరు గేటు స్థానంలో కొత్త గేటు ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. - కర్నూలు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి)
మూడు రాష్ట్రాలకు ప్రయోజనకారి
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మూడు రాష్ట్రాల జీవనాడిగా తుంగభద్ర జలాశయం ఉంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాలకు తుంగభద్ర డ్యాం నుంచి టీబీపీ ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎల్‌సీ, కేసీ కాలువల ద్వారా 66.50 టీఎంసీల నీటి వాటా ఉంది. ఖరీఫ్, రబీలో దాదాపు 7లక్షల ఎకరాలకు సాగునీరు, కర్నూలు, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో మెజార్టీ గ్రామాలకు తాగునీరు అందించే ప్రధాన నీటి వనరు ఈ ప్రాజెక్టు. 1953 నుంచి ఆయా రాష్ట్రాల సాగు, తాగునీటి ప్రయోజనాలు కాపాడుతున్న తుంగభద్ర డ్యాం ప్రస్తుతం ప్రమాదంలో పడింది. 2024 ఆగస్టులో వరద ఉధృతికి 19వ నంబరు క్రస్ట్ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు సారథ్యంలో దాని స్థానంలో స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్ ఏర్పాటు చేశారు. వరద కడలిపాలు కాకుండా ఆపగలిగారు. అయితే మిగిలిన గేట్లు భద్రమేనా? అన్నది ప్రశ్నార్థకం. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏకే బజాజ్ నేతృత్వంలోని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ డ్యాం, గేట్లను సమగ్రంగా తనిఖీ చేసింది. గేట్ల జీవిత కాలం తీరిపోవడం వల్ల మరమ్మతులతో కాలయాపన చేయకుండా.. 33 గేట్లను మార్చాలని, గేట్ల ఏర్పాటులో అనుభవం కలిగిన సంస్థతో అధ్యయనం చేయించాలని సూచిస్తూ నివేదిక ఇచ్చింది.
క్రస్ట్ గేట్ జీవిత కాలం 42 ఏళ్లే
బజాజ్ కమిటీ సూచన మేరకు బోర్డు అధికారులు టెండర్ల ద్వారా ఎంపిక చేసిన బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కేఎస్‌ఎన్‌డీటీ సంస్థ క్షేత్రస్థాయిలో డ్యాంను తనిఖీ చేసింది. 19వ గేటు మినహా.. మిగిలిన 32 క్రస్ట్ గేట్లకు ‘కాంప్రెహెన్సివ్ హెల్త్ చెకప్’ నిర్వహించారు. అలా్ట్రసోనిక్ స్కానింగ్ ద్వారా గేట్ల పటిష్టతను పరిశీలించారు. ఒక్కో గేటు వారీగా ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర నివేదికను కేఎస్‌ఎన్‌డీటీ టీబీపీ బోర్డుకు ఇచ్చింది. వాస్తవానికి క్రస్ట్ గేట్ల జీవిత కాలం 42 ఏళ్లే. అయితే తుంగభద్ర డ్యాం గేట్లు ఏర్పాటు చేసి 72 ఏళ్లకు పైగా అయింది. ఈ నేపథ్యంలో 33 గేట్లు మార్చాల్సిందేనని అధ్యయన సంస్థ అభిప్రాయపడింది.
19వ గేటు మార్చేందుకు సన్నాహాలు
ప్రస్తుతం గతేడాది కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో కొత్తదాని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. రూ.1.98 కోట్లతో టీబీపీ బోర్డు అధికారులు టెండర్లు నిర్వహించారు. గుజరాత్‌కు చెందిన ‘హార్డ్‌వేర్ టూల్స్’ సంస్థ 3.60 శాతం ఎక్కువ ధరకు టెండరు దక్కించుకుంది. ఇదొక్కటే ఆన్‌లైన్ టెండరు వేసింది. ఈ సంస్థకు పశ్చిమ బెంగాల్‌లోని పరాకా బ్యారేజ్ గేట్లు ఏర్పాటు చేసిన అనుభవం ఉందని ఇంజనీర్లు తెలిపారు. ‘హార్డ్‌వేర్ టూల్స్’ ఇంజనీర్లు ఈనెల 21న తుంగభద్ర డ్యాం, 19వ గేటును పరిశీలిం చారు. పనులు ప్రారంభించేందుకు క్షేత్రస్థాయిలో సన్నాహాలు చేపట్టారని తుంగభద్ర బోర్డు ఎస్‌ఈ నారాయణ్ నాయక్ తెలిపారు. జూన్ ఆఖరులోగా నూతన గేటు అమర్చాలని అఽధికారులు గడువు విధించారు.
Updated Date - Apr 23 , 2025 | 12:16 AM