డాబాల్లో ఫుల్లు కిక్కు
ABN, Publish Date - May 22 , 2025 | 12:44 AM
పట్టణ శివార్లలోని జాతీయ రహదారితోపాటు, ఇతర రహదారి పక్కనే ఉన్న డాబాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయిస్తున్నారు. వాహనచోదకులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీన్ని అరికట్టాల్సిన పోలీసు, ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో మునిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా సరఫరా
తాగి నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లు
మామూళ్ల మత్తులో పోలీసు, ఎక్సైజ్ అధికారులు
ఆదోని, మే 21 (ఆంధ్రజ్యోతి): దారి పక్కనే డాబా, అందులో మద్యం ఇంకేముంది డ్రైవర్లు మత్తులో మునుగుతున్నారు. కర్నూలు, అనంతపురం, బళ్లారి వెళ్లే జాతీయ రహదారుల్లో నిత్యం భారీ వాహనాలతోపాటు, ఇతర వాహనాలు సైతం వెళ్తుంటాయి. రహదారుల వెంబడి సుమారు 40వరకు డాబాలు ఉన్నాయి.
డాబాల్లో జోరుగా సిట్టింగ్‌లు
డాబాల్లో మద్యం విక్రయించడం చట్ట విరుద్ధం. అయితే డాబా నిర్వాహకులు ఇవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా డాబాల్లో జోరుగా మద్యం సిట్టింగ్‌లు కొనసాగుతున్నాయి. తాగేందుకు ప్రత్యేకంగా గదులను కూడా ఏర్పాటు చేసి అందులో ముక్క, మద్యాన్ని కూడా అందిస్తున్నారు.
ప్రమాదాలకు కారణమవుతున్న మద్యం
డాబాల్లో మద్యం సేవిస్తున్న డ్రైవర్లు అనంతరం అలాగా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణ మవుతున్నారు. కొంతమంది డాబాల నిర్వాహ కులు మద్యం దుకాణాల నుంచి మద్యాన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా కొంతమంది వాహనదారుల మద్యం బాటిళ్లను బయట నుంచి తెచ్చుకొని తాగుతున్నారు. తర్వాత వారు మద్యం మత్తులో వాహనాలను అతివేగంతో జాతీయ రహదారిపై నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ప్రమాదాలలో ప్రాణనష్టం జరగడమే కాకుండా అనేక మంది క్షతగాత్రులు అవుతున్నారు.
అంతంతమాత్రం తనిఖీలు
డాబాల్లో ఇలా యథేచ్ఛగా మద్యం తాగుతున్నా ఎక్సైజ్, పోలీసు అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడూ నామమాత్రంగా తనిఖీలు చేస్తూ మమ అనిపిస్తు న్నారు. ఆస్పరి, ఎమ్మిగనూరు, ఆలూరు, శిరుగుప్ప రహదారికి ఇరువైపులా ఉన్న డాబాలపై పోలీసు, ఎక్సైజ్ అధికారులు అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అయితే డాబాల్లో తనిఖీకి వెళ్లేముందు వారికి ముందుగానే సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నిర్వాహకులు అప్రమత్తమై, అప్పటికప్పుడు మద్యం లేకుండా జాగ్రత్త వహిస్తున్నట్లు అవుతున్నారు. దీన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయంపై ఎక్సైజ్ సీఐ సైదుల్లాను వివరణ కోరగా డాబాల్లో మద్యం తాగడానికి వీల్లేదని, తనిఖీలు చేస్తున్నామని, కూడా కేసులు నమోదు చేస్తున్నామని, చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - May 22 , 2025 | 12:44 AM