అలుగు కోసం అలుపెరుగని పోరాటం..
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:33 AM
సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం గత తొమ్మిదేళ్లుగా సీమ రైతాంగం అలుపెరుగక పోరాడుతున్నదని, ఎప్పటికైనా పాలకులు ప్రజలకు తలొగ్గాల్సిందేనని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు.
రాజకీయ పార్టీలు గళం విప్పాలి
పాలకులు సీమపై వివక్ష వీడాలి
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
కొత్తపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం గత తొమ్మిదేళ్లుగా సీమ రైతాంగం అలుపెరుగక పోరాడుతున్నదని, ఎప్పటికైనా పాలకులు ప్రజలకు తలొగ్గాల్సిందేనని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. శనివారం కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వరంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షుడు వైఎన్ రెడ్డి అధ్యక్షతన సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదు కేంద్రంగా పరిపాలన చేయకుండా అమరావతి కేంద్రంగా నిధులన్నీ కోస్తా ప్రాంతానికే ఖర్చు పెట్టడంతో రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారని ఆరోపించారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని ఒకరు, మూడు రాజధానులు అని ఒకరు తమ స్వార్థ, రాజకీయ, ఆర్థిక సామ్రాజ్యాలను నిర్మించుకోవడానికే ప్రయత్నించారే తప్ప వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఏ మాత్రం చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని అన్నారు. రాయలసీమలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తామని, అందుకు తగ్గట్టుగా బ్లూప్రింట్ తయారు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ దగ్గర ఉన్న ఆ బ్లూ ప్రింట్ ద్వారా ఏ విధంగా నీళ్లు ఇచ్చేదీ రాయలసీమ సమాజానికి చూపాలని డిమాండ్ చేశారు. ిసిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం ఇన్నేళ్లుగా సీమ రైతాంగం ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. అలుగు కోసం తాము అలుపెరుగకుండా పోరాడతామని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం వేలాది భూములను త్యాగం చేసిన నిర్వాసితుల్లో ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి నాలుగు దశాబ్దాలైనా నేటికి ఉద్యోగాలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. పట్టిసీమ పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు ఇస్తామని చెప్పిన పాలకులు అది మరిచి నేడు గోదావరి, బానకచర్ల అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపి మరోసారి రాయలసీమ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు లేవంటున్న పాలకులు అమరావతి ప్రాంతంలో ఐకానిక్ టవర్ల కోసం వేలాది కోట్లు ఖర్చు పెడుతున్నారని అన్నారు. ఇది రాయలసీమ ప్రాంతం పట్ల పాలకుల వివక్షతకు నిదర్శనం కాదా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.1500 కోట్లు ఖర్చు పెడితే పది లక్షల ఎకరాలకు నీరందించవచ్చని, తద్వారా పదివేల కోట్ల వ్యవసాయ ఉత్పాదన జరుగుతుందని ప్రభుత్వానికి తెలిపినా ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదని విమర్శించారు. పాలకులు అధికార మత్తులో ఉంటున్నారని, రాయలసీమ పట్ల నిరంకుశ వైఖరి ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ప్రతి పల్లె- ప్రతి గడప తిరిగి ప్రభుత్వ తీరును ప్రజలకు తెలుపుతామన్నారు. సభలో బాలవుశేని, అనంతపురం రామాంజనేయులు నేతృత్వంలో కళాకారుల బృందం పాటలు పాడారు. ఈ సభకు హిందూపురం చైతన్య సొసైటీ అధ్యక్షుడు గంగిరెడ్డి, సామాజిక రాయలసీమ వేదిక కన్వీనర్ డా.నాగన్న, విరసం నాయకులు వరలక్ష్మి, పాణి, అనంతపురం ఓపీడీఆర్ రామ్‌కుమార్, భారతీయ కిసాన్ సంఘ్ కడప జిల్లా నాయకులు వెల్లాల సహదేవరెడ్డి, సీపీఎం రాజశేఖర్, మహిళా హక్కుల వేదిక నాయకురాలు మణెమ్మ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు రామకృష్ణారెడ్డి, జానోజాగో నాయకులు మహబూబ్ బాషా, యాగంటీ బసవేశ్వర రైతు సంఘం నాయకులు ఎంసీ కొండారెడ్డి, కేసీ కెనాల్ పరిరక్షణ సమితి నాయకులు బెక్కం రామసుబ్బారెడ్డి, ఆదోని అభివృద్ధి వేదిక కన్వీనర్ ఆదినారాయణరెడ్డి, పందికోన రిజర్వాయర్ సాధన సమితి నాయకులు శేషాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 01 , 2025 | 12:33 AM