ప్రగతిలో రహదారి
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:52 PM
: ఓర్వకల్లు పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు రాబడుతోంది.
ఓర్వకల్లు పారిశ్రామిక ప్రగతిలో మరో అడుగు
నాలుగు వరుసల రోడ్లకు రూ.207 కోట్లు
నేషనల్ హైవేగా ఉప్పలపాడు, రామళ్లకోట, గుట్టపాడు రోడ్లు
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
ఇప్పటికే 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో మౌలిక వసతులు
కర్నూలు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఓర్వకల్లు పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు రాబడుతోంది. హైదరాబాద్- బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్‌బీఐసీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఓర్వకల్లు ఇండస్ట్రి్ట్రయల్ నోడ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఫేజ్-1 కింద 2,612 ఎకరాలలో రూ.2,786 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. పలు పరిశ్రమలు ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టింది. రవాణా సౌకర్యాలపై శుక్రవారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులతో రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ బీసీ జనార్ధన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ పరిధిలో 32 కి.మీలు జిల్లా రహదారులను నాలుగు వరుసల రోడ్లు (4 లైన్ రోడ్స్)గా అభివృద్ధి చేయడం, రైల్వే లైన్ల ఏర్పాటుపై చర్చించారు. ఇప్పటికే వీటిపై ఎన్‌హెచ్‌ఏఐకు లేఖ కూడా రాశారు. ఉప్పలపాడు- ఉశేనాపురం, ఉప్పలపాడు-రామళ్లకోట, గుట్టపాడు-బ్రహ్మణపల్లి రోడ్లు నాలుగు వరుసల రహదారులగా ఆధునికీకరణ చేయనున్నారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 2014-19 కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక ప్రగతికి బీజం వేశారు. ఓర్వకల్లు కేంద్రంగా 33 వేల ఎకరాల్లో పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే తొలి 1000 మెగావాట్ల అలా్ట్ర మెగా సోలార్ యూనిట్ ఏర్పాటు చేశారు. జైరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే తొలి 3,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ఉత్పత్తి యూనిట్ పునాది రాయి వేశారు. అయితే 2019 మేలో వచ్చిన జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పారిశ్రామిక ప్రగతి పడకేసింది. గతేడాది జూన్ 12న సీఎం చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ కొలువుదీరడంతో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు మళ్లీ పూర్వవైభం వచ్చింది. హైదరాబాద్-బెంగళూరు ఇండస్ర్టియల్ కారిడార్ (హెచ్‌బీఐసీ)లో భాగంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం, భారీగా నిధులు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్-బెంగళూరు మధ్యలో ఓర్వకల్లు ఉండడం, ఇక్కడ పుష్కలంగా ప్రభుత్వ భూమి ఉండడం కూడా కలసి వచ్చింది. ఇది దక్షిణ భారతదేశంలో రెండు ప్రధాన ఆర్థిక కారిడారులైన చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ), విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ) మధ్య అనుబంధంగా కూడా పని చేస్తుంది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్‌ను దాదాపు 4,742 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-40 నుంచి మూడు ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తుంది. దీంతో ఓర్వకల్లును పారిశ్రామిక పరుగులు పెట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు రాబట్టి మౌలిక వసతులు కల్పన, పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నాలుగు లైన్ల రహదారులు
రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అధ్వర్యంలో 2వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో చేపట్టిన జాతీయ రహదారుల ప్రాజెక్టులు, కేంద్ర రోడ్లు, రవాణా, హైవే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనులు వేగవంతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. అందులో భాగంగానే హైదరాబాదు-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్‌బీఐసీ)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ పరిధిలో జాతీయ రహదారులు అభివృద్ధి, రైల్వే లైన్ అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. ఓర్వకల్లు నోడ్ పరిధిలోని ఉప్పలపాడు-ఉశేనాపురం జిల్లా రహదారి (డీఆర్) 8 కిలోమీటర్లు రూ.72 కోట్లతో, ఉప్పలపాడు-రామళ్లకొట జిల్లా రహదారి 15 కిలోమీటర్లు రూ.135 కోట్లతో, గుట్టపాడు - బ్రహ్మణపల్లి జిల్లా రోడ్డు 9 కిలోమీటర్లు రూ.80 కోట్లతో మొత్తం 32 కిలో మీటర్లు రూ.207 కోట్లతో నాలుగు వరుసల జాతీయ రహదారిగా ఆధునికీరణపై ప్రధానంగా చర్చించారు. ఈ పనులు చేపట్టేందుకు ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మూడు రోడ్లలో ఇప్పటికే గుట్టుపాడు నుంచి ఎన్‌హెచ్-40 రోడ్డు వరకు కొంత భాగం ఎన్‌హెచ్‌ఐఏ తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. తక్షణమే పనులు చేపట్టాలని సబంధిత శాఖ ఇంజనీర్లను ఆదేశించారు వీటితో పాటు బేతంచర్లలో రైల్వే సబ్‌వే నిర్మాణం పనులు ప్రారంభించాలని రైల్వే అధికారులను ఆదేశించారు.
ఓర్వకల్లుకు చేరువలో...
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్‌కు చేరువలోనే జాతీయ రహదారులు, రైల్వేలైన్లు, విమానాశ్రాయాలు ఉన్నాయని మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులు వివరించారు. ఓర్వకల్లుకు 4 కి.మీల దూరంలో కర్నూలు-రాణిపేట జాతీయ రహదారి (ఎన్‌హెచ్)-40, 28 కి.మీల దూరంలో కర్నూలు నుంచి అనంతపురం నేషనల్ హైవే-44 రోడ్డు, 26 కి.మీల దూరంలో కర్నూలు-దోర్నాల నేషనల్ హైవే-340సీ రోడ్లు ఉన్నాయి. 35 కి.మీల దరంలో కర్నూలు, 49 కి.మీల దూరంలో నంద్యాల రైల్వే స్టేషన్లు, 49 కి.మీల దూరంలో డోన్ రైల్వే జంక్షన్ ఉంది. 12 కి.మీల దూరంలో కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం, 171 కి.మీల దూరంలో కపడ ఎయిర్ పోర్టు, 233 కి.మీల దూరంలో శంషాబాద్, హైదరాబాద్ విమానాశ్రాయలు ఉన్నాయి. 320 కి.మీల దూరంలో కృష్ణపట్నం ఓడరేవు, 420 కి.మీల దూరంలో కట్టుపల్లి పోర్టు ఉన్నాయని 2వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం చర్చించడం జరిగింది.
2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో వసతులు:
ఇప్పటికే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో అభివృద్ధి చేస్తామని ఈ ఏడాది జూన్ 23న కేంద్రం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ కేంద్ర బడ్జెట్-2024-25లో కీలక ప్రకటన చేశారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ (ఎన్‌ఐసీడీపీ)లో భాగంగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీల అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఫేజ్-1 కింద 2,612 ఎకరాల్లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో రూ.2,786 కోట్లతో మౌలిక వసతులు కల్పన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నాన్ మెటలిక్ మినరల్ పరిశ్రమలు, ఆటోముబైల్ రంగం విడిభాగాలు తయారి, పునరుత్పాదక పరిశ్రమలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్ పరికరాలు, ఏరోస్పెస్ అండ్ డిషెన్స్ హార్డ్‌వేర్, ఫార్మాస్యూటికల్స్, వజ్రాలు, బంగారు అభరాలు తయారి, వస్త్ర ఉత్పత్తి రంగ పరిశ్రమలు ఇక్కడే ఏర్పాటు చేసేందుకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఆయా పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.12 వేల కోట్లు పెట్టుబడులు, 45,071 మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. తాజాగా రాష్ట్ర పెట్టుబడులు, మౌళిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు ఏర్పాటుపై చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Updated Date - Apr 25 , 2025 | 11:52 PM