ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పల్లెకు 24 గంటల విద్యుత్‌

ABN, Publish Date - Aug 05 , 2025 | 12:03 AM

వైసీపీ హయాంలో విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేశారు.

బనవాసి 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌

33/11 కేవీ విద్యుత్‌ 113 సబ్‌ స్టేషన్లలో కొత్త ఫీడర్లు

జిల్లాలో 519 గ్రామాలకు నిరంతరాయంగా త్రీఫేజ్‌ విద్యుత్‌ లక్ష్యం

ఆర్‌డీఎస్‌ఎస్‌ కింద రూ.386 కోట్లతో గ్రామాల్లో కాంతులు

వైసీపీ హయాంలో ఆగిన పనులు.. ఈ ప్రభుత్వంలో మళ్లీ మొదలు

బవనాసి వద్ద రూ.120 కోట్లతో 220/132 కేవీ విద్యుత్‌ స్టేషన్‌

వైసీపీ హయాంలో విద్యుత్‌ రంగాన్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా ఎండమావిగా మారింది. రాత్రి పూట విద్యుత్‌ మోటార్లు ఆన్‌ చేసేందుకు పొలాల్లోకి వెళ్లి ప్రమాదాలకు గురైన వారెందరో. అస్తవ్యస్తంగా మారిన విద్యుత్‌ సరఫరాతో పారిశ్రామిక ఉత్పత్తులు పడిపోయాయి. పల్లెసీమలు అంధకారంగా మారాయి. గ్రామాలకు సైతం 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలనే సంకల్పంతో కొత్త ఫీడర్లు ఏర్పాటుకు చేసే ఖర్చులో కేంద్రం 70 శాతం గ్రాంట్‌గా ఇచ్చింది. ఆ నిధులు కూడా సక్రమంగా వినియోగించుకోలేని దైన్య పరిస్థితి ఉండేది. జిల్లాలో 519 గ్రామాలకు నిరంతరాయంగా కరెంటు ఇవ్వాలని పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద రూ.386 కోట్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థ పనులు చేయకుండానే ఆపేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పనులు మొదలయ్యాయి. గ్రామసీమలకు నిరంతరాయంగా 24 గంటలు త్రీఫేజ్‌ కరెంటు సరఫరా కానుంది.

కర్నూలు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యుత్‌ సరఫరా కోసం 220/132 కేవీ స్టేషన్లు నాలుగు ఉన్నాయి. వాటికి అనుబంధంగా 33/11 కేవీ సబ్‌ స్టేషన్లు 128 ఉన్నాయి. అందులో నగరం పరిధిలో 15 ఉంటే, గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్‌ పంపిణీ చేసే సబ్‌ స్టేషన్లు 113 ఉన్నాయి. వివిధ అవసరాల కోసం కరెంటు పంపిణీ చేసేందుకు 570 ఫీడర్లు ఉన్నాయి. వివిధ అవసరాల విద్యుత్‌ కనెక్షన్లు 8,56,017 ఉన్నాయి. రోజుకు 10 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయానికి, గ్రామాల్లో గృహ, వాణిజ్య అవసరాలకు కరెంట్‌ సరఫరా చేసేందుకు ఒకే లైన్‌ (ఫీడర్‌) ఉండడంతో వ్యవసాయ విద్యుత్‌ పంపిణీ సమయంలో 9 గంటలు త్రీఫేజ్‌ కరెంట్‌ ఇచ్చి, ఆ తరువాత 15 గంటలు సింగిల్‌ ఫేస్‌ కరెంట్‌ సరఫరా చేస్తున్నారు. దీంతో పల్లెల్లో పిండిమర (ఫ్లోర్‌మిల్‌).. వంటి కుటీర పరిశ్రమలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాదు.. విద్యుత్‌ పంపిణీలో నాణ్యత లోపించి లోఓల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటన్నిటికీ చెక్‌ పెట్టి గ్రామ సీమలకు సైతం 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన త్రీఫేజ్‌ కరెంటు సరఫరాకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫీడర్లు ఆధునికీకరణ కోసం పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌) కింద జిల్లాకు రూ.386 కోట్లు మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం 70 శాతం గ్రాంట్‌ కింద ఇస్తే, 30 శాతం రుణం కింద ఇస్తారు. 2023లో నిధులు మంజూరు చేస్తే, అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థ బిల్లులు రావనో, మరే ఇతర కారణంగానో పనులు చేయకుండానే ఆపేశారు.

ఈ ప్రభుత్వంలో మొదలైన పనులు

గ్రామాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ పంపిణీ పనులపై వైసీపీ హయాంలో అంతులేని నిర్లక్ష్యం చూపించారు. జిల్లాలో 113 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 33/11 కేవీ సబ్‌ స్టేషన్ల పరిధిలో 570 ఫీడర్లు (విద్యుత్‌ పంపిణీ లైన్లు) ఉన్నాయి. త్రీఫేజ్‌ పవర్‌ సరఫరా కోసం 204 కొత్త ఫీడర్లు ఏర్పాటు, సబ్‌ స్టేషన్లు పునరుద్ధరణ కోసం ఆర్‌డీఎస్‌ఎస్‌ కింద రూ.386 కోట్లు మంజూరు చేశారు. 2023 సెప్టెంబరు 29న పనులు దక్కించుకున్న కడప జిల్లాకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే.. అప్పటి వైసీపీ హయాంలో పనులు మొదలు పెట్టలేదు. దీంతో 24 గంటలు నిరయంతరాయంగా త్రీఫేజ్‌ విద్యుత్‌ కలగానే మిగిలింది. సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పనులపై దృష్టి సారించారు. గ్రామాల్లో కూడా పారిశ్రామిక ప్రగతి సాధించి యువతకు స్వయం ఉపాధి కల్పించాలంటే త్రీ ఫేజ్‌ విద్యుత్‌ పంపిణీ ఎంతో ముఖ్యమని కూటమి ప్రభుత్వం గుర్తించింది. కేంద్రం 70 శాతం గ్రాంట్‌ రూపంలో ఇస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవలనే లక్ష్యంతో ఎట్టకేలకు విద్యుత్‌ పంపిణీ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు.

బనవాసి వద్ద 22/132 కేవీ విద్యుత్‌ స్టేషన్‌

ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవ ర్గాల్లోని ఎమ్మిగనూరు, మాధవరం, గూడూరు 132/33 కేవీ విద్యుత్‌ స్టేషన్లకు కర్నూలు నగరంలో ఉన్న 220/132 కేవీ విద్యుత్‌ స్టేషన్‌ నుంచి కరెంటు పంపిణీ చేస్తున్నారు. ఎమ్మిగ నూరు, మాధవరం విద్యుత్‌ స్టేషన్ల పరిధిలో వ్యవసాయ విని యోగ విద్యుత్‌ కనెక్షన్లు పెరగడంతో నాణ్యమైన కరెంట్‌ అందక రైతులు లోవోల్టేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నివారణకు ఎమ్మిగనూరు మండలం బనవాసి 220/132 కేవీ విద్యుత్‌ స్టేషన్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.120 కోట్లు మంజూరు చేసింది. బనవాసి జెర్సీ పశు క్షేత్రానికి చెందిన 15 ఎకరాలు కేటాయించారు. హైదరాబాద్‌కు చెందిన సీఎంఆర్‌ఎం ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పనులు దక్కిం చుకుంది. రూ.66 కోట్లతో 220/132 విద్యుత్‌ స్టేషన్‌, విద్యుత్‌ లైన్‌ నిర్మాణాలు కాంట్రాక్ట్‌ సంస్థ చేస్తే, రూ.66 కోట్లతో అవసరమైన విద్యుత్‌ పరికరాలను ట్రాన్స్‌కో సంస్థ సరఫరా చేయనుంది. ఈ స్టేషన్‌కు పత్తికొండ మండలం జూటూరు నుంచి 220 కేవీ విద్యు త్‌ పంపిణీ లైన్‌ నిర్మిస్తారు. ఈ పనులు పూర్తయితే ఎమ్మిగనూ రు, మాధవరం 132/33 కేవీ విద్యుత్‌ స్టేషన్ల పరిధిలో నాణ్యమైన విద్యుత్‌ అందుతుంది. అలాగే.. కర్నూలు 220/132 కేవీ విద్యుత్‌ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గనుంది.

ప్రస్తుతం 77 గ్రామాల్లో నిరంతర విద్యుత్‌

పల్లెసీమలకు సైతం నాణ్యమైన త్రీఫేజ్‌ కరెంటు ఇవ్వాలనే ధ్యేయంగా ప్రభుత్వం ఫీడర్ల పునరుద్ధరణ పనులపై నిత్యం సమీక్షలు చేస్తూ కాంట్రాక్ట్‌ సంస్థలపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాల్లో పనులు దక్కించుకున్న షిర్డీసాయి ఎలక్ట్రికల్‌ సంస్థ సబ్‌ స్టేషన్లు పునరుద్ధరణ, ఫీడర్ల ఏర్పాటు పనుల్లో వేగం పెంచింది. బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి 250 మందికి పైగా నైపుణ్యం కలిగిన కూలీలతో పనులు చేస్తున్నారు. ఇప్పటికే 30 ఫీడర్లు పూర్తి చేశారు. ఎమ్మిగనూరు డివిజన్‌ పరిధిలో 45, ఆదోని డివిజన్‌లో 28, కర్నూలు డివిజన్‌లో 4 గ్రామాలు కలిపి 77 గ్రామా లకు 24 గంటలు త్రీఫేస్‌ విద్యుత్‌ పంపిణీ చేస్తున్నారు. 174 ఫీడర్లు పూర్తి చేసి 442 గ్రామాలకు త్రీఫేజ్‌ పవర్‌ పంపిణీకి లైన్లు సిద్ధం చేయాల్సి ఉంది.

జిల్లా అంతటా 24 గంటలు కరెంటు సరఫరా

జిల్లాలో పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్‌) నిధులు రూ.386 కోట్లతో 519 గ్రామాలకు 24 గంటలు నిరంతరాయంగా త్రీఫేజ్‌ విద్యుత్‌ పంపిణీ పనులు వేగంగా జరుగుతున్నాయి. 33/11 కేవీ 113 సబ్‌ స్టేషన్ల్ల పరిధిలో 204 ఫీడర్‌ లైన్లు పునరుద్ధరించాల్సి ఉంటే ఇప్పటికే 30 ఫీడర్లు పూర్తి చేసి 77 గ్రామాలకు 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. గడువులోగా పనులు పూర్తి జిల్లా అంతటా 24 గంటలు కరెంటు పంపిణీ చేస్తాం. బనవాసి వద్ద రూ.120 కోట్లతో నిర్మించనున్న 220/132 కేవీ విద్యుత్‌ స్టేషన్‌ పనులు త్వరలోనే మొదలు పెడుతాం. ఈ స్టేషన్‌ పూర్తయితే ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో లోవోల్టేజీ సమస్యలే ఉండవు. వ్యవసాయం సహా వివిధ అవసరాలకు నాణకమైన విద్యుత్‌ అందుతుంది.

ఉమాపతి, ఎస్‌ఈ, విద్యుత్‌ శాఖ, కర్నూలు

Updated Date - Aug 05 , 2025 | 12:03 AM