యూనియన్ ప్రతిష్టను దెబ్బతీస్తారా!
ABN, Publish Date - Apr 25 , 2025 | 01:25 AM
కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియా వేదికగా, వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. ఇటీవల సోషల్ మీడియాతోపాటు ఓ పత్రికలో ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవాలని పాలకవర్గ సభ్యులు ముక్తకంఠంతో ఖండించారు.
చిట్టినగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా మిల్క్ యూనియన్ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియా వేదికగా, వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. ఇటీవల సోషల్ మీడియాతోపాటు ఓ పత్రికలో ప్రచురించిన కథనాలు పూర్తిగా అవాస్తవాలని పాలకవర్గ సభ్యులు ముక్తకంఠంతో ఖండించారు. గురువారం చిట్టినగర్ పాలఫ్యాక్టరీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లక్షలాది మంది పాడి రైతుల సంస్థ ‘కృష్ణా మిల్క్ యూనియన్’ అన్నారు. ఇటీవల కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలను చేస్తూ కుట్ర పన్నుతున్నారన్నారు. ఆరోపణల్లో నిజాలు ఉంటే పాలక వర్గం ఎదుట ముఖాముఖి తెలియజేయాలన్నారు. ఆరోపణలు చేసిన వారిని పాలకవర్గంతోపాటు లక్షలాది మంది పాడి రైతులు సంఘటితంగా ఎదుర్కొంటారన్నారు. పాలకవర్గసభ్యులు దాసరి వెంకట బాలవర్థనరావు మాట్లాడుతూ, వాస్తవాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తూ కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తూ యూనియన్ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్నారు. ఇటువంటివి పునరావృత్తం కాకుండా చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉన్నామన్నారు. వేమూరి సాయి వెంకటరమణ మాట్లాడుతూ, వాట్సాప్, సోషల్ మీడియాలో చైర్మన్, పాలకవర్గంపై చేస్తున్న ఆరోపణలు సత్యదూరమన్నారు. ఓ వ్యక్తి యూనియన్‌కు చెల్లించాల్సిన కోట్లాది రూపాయలు కట్టకుండా ఉండేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని తెలిసిందన్నారు. అలాగే ఆ వ్యక్తి కోర్టుకి వెళ్లిన కోర్టు డబ్బులు కట్టాలని చెప్పడంతో ఏం చేయలేక ఇటువంటి అసత్య ప్రచారాలు, పాలకవర్గంపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. అతను ఎన్ని కుయుక్తులు పన్నినా వదిలిపెట్టేది లేదని, డబ్బులు కట్టిస్తామన్నారు. సోషల్, మీడియాతోపాటు ఓ పత్రిక ఎటువంటి ఆధారాలు లేకుండా కథనాలు ప్రచురించడం బాఽధాకరమన్నారు. పాలకవర్గ సభ్యురాలు నెక్కలపు వాణిశ్రీ మాట్లాడుతూ, పాలకవర్గం నిరంతరం పాడి రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, టెండర్ ఇతరత్ర పనులు అన్నీ పారదర్శకంగానే జరుగుతున్నాయన్నారు. చైర్మన్‌తోపాటు పాలకవర్గంపై అసత్యప్రచారాలను పాడిరైతులు, పాలకవర్గం ముక్తకంఠంతో ఖండిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎండి కొల్లి ఈశ్వరబాబు, పాలక వర్గ సభ్యులు ఆర్జా నగేష్, నాని, కొండలరావు, రామచంద్రరావు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 01:25 AM