కాల్పుల విరమణతో ఊపిరి పీల్చుకున్నాం
ABN, Publish Date - May 11 , 2025 | 01:16 AM
కాల్పుల విరమణ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నామని, మూడురోజులుగా నిద్రలేని రాత్రులు గడిపామని నిట్ జలంధర్ యూనివర్సిటీ మెకానికల్ విభాగం హెడ్ శ్రీనివాస్ తెలిపారు.
చాలా డ్రోన్లను ఆర్మీ ధ్వంసం చేసింది
విజయవాడకుచెందిన నిట్ జలంధర్ యూనివర్సిటీ మెకానికల్ విభాగం హెడ్ శ్రీనివాస్
విజయవాడ, మే 10(ఆంధ్రజ్యోతి): కాల్పుల విరమణ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నామని, మూడురోజులుగా నిద్రలేని రాత్రులు గడిపామని నిట్ జలంధర్ యూనివర్సిటీ మెకానికల్ విభాగం హెడ్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి జలంధర్‌లో సాధారణ జీవనం కొనసాగిందన్నారు. జలంధర్ చుట్టుపక్కల రాత్రిళ్లు బాంబుల శబ్ధాలు, విద్యుత్ లేకపోవడంతో మూడు రోజులు గా ఎవరికీ నిద్ర లేదన్నారు. నిట్ జలంధర్ యూనివర్సిటీతో పాటు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కూడా తెలుగు వి ద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, వారందరినీ మూడురోజులు ముందుగానే స్వస్థలాకు పంపించేశారని ఆయన తెలిపారు. అత్యవసర సమయంలో విమాన ధరలు అధికంగా ఉండడంతో బస్సులు, రైలు మార్గాల ద్వారా వారంతా ఢిల్లీ చేరుకున్నారన్నారు. కొన్ని విమానయాన సంస్థలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రూ.60 వేలు వసూలు చేశాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇక్కడే ఉండాలని చెప్పడంతో తా ము ఉండిపోయామన్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు ఇన్వర్టర్లు వాడొద్దని, సీసీ కెమెరాలు ఆఫ్ చేయాలని సైనికాధికారులు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. శనివారం ఉదయం కూడా జలంధర్ చుట్టుపక్క ల బాంబులు పడ్డాయని, అవన్నీ పొలాల్లో పడడంతో ప్రాణనష్టం జరగలేదన్నారు. జలంధర్‌లో ఉన్న యాంటీడ్రోన్ వ్య వస్థ సమర్థవంతంగా పనిచేసిందని శ్రీనివాస్ తెలిపారు.
Updated Date - May 11 , 2025 | 01:16 AM