విజయవాడ పశ్చిమ బైపాస్.. మరింత ఆలస్యం
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:57 AM
విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రారంభం కావటానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపి స్తోంది. ల్యాంకో ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ టవర్ లైన్లకు సంబంధించి ఏం చేయాలన్న దానిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మినిసీ్ట్ర ఆఫ్ రోడ్స్, టాన్స్‌పోర్టు, హైవే.. మోర్తు) చైర్మన్ నుంచి స్పష్టత రాకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రధాని నరేంద్రమోదీ అమరావతి పర్యటన సందర్భంలో మోర్తు చైర్మన్ పశ్చిమ బైపాస్‌ను పరిశీలించారు.
మోర్తు నుంచి స్పష్టత రాకపోవడం వల్లే..
ల్యాంకో అలైన్‌మెంట్ మార్పు అయితే లేదు
ఎత్తు పెంపు విషయంలో తర్జనభర్జన
కోర్టు కేసులు కొలిక్కి వచ్చాకే నిర్ణయం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రారంభం కావటానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపి స్తోంది. ల్యాంకో ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ టవర్ లైన్లకు సంబంధించి ఏం చేయాలన్న దానిపై కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మినిసీ్ట్ర ఆఫ్ రోడ్స్, టాన్స్‌పోర్టు, హైవే.. మోర్తు) చైర్మన్ నుంచి స్పష్టత రాకపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రధాని నరేంద్రమోదీ అమరావతి పర్యటన సందర్భంలో మోర్తు చైర్మన్ పశ్చిమ బైపాస్‌ను పరిశీలించారు. ల్యాంకో ట్రాన్స్‌మిషన్ హైటెన్షన్ టవర్స్ లైన్‌కు సంబంధించి ఉన్న సమస్య గురించి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి మోర్తు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ఎన్‌హెచ్ అధికారులు ముందుకెళ్లాలి. అయితే, మోర్తు నుంచి ఇంకా స్పష్టత రాలేదు.
చిక్కుముడి వీడేనా?
ల్యాంకోలైన్ చిక్కుముడి అంశంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలన్న దానిపై మోర్తు ఓ నిర్ణయానికి రాలేకపోతోందని తెలుస్తోంది. ల్యాంకో లైన్‌కు సంబంధించి అనేక వివాదాలు ఉండటమే ఇందుకు కారణం. హైకోర్టుతో పాటు ఎన్‌సీఎల్‌టీలో అనేక కేసులు నడుస్తున్నాయి. ల్యాంకోలైన్ అలైన్‌మెంట్‌ను మార్చే విషయంలో కొండపల్లిలోని ల్యాంకో పవర్ ప్రాజెక్టు రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ల్యాంకో మూతపడింది. మూతపడిన క్రమంలో తలెత్తిన పరిణామాలు తెలిసిందే. ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదులు అందటంతో చిక్కుముడిని ఎలా పరిష్కరించాలన్న అంశాన్ని మోర్తు తేల్చుకోలేకపోతోంది. న్యాయస్థానాలు, ఎన్‌సీఎల్‌టీలలో నడుస్తున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మోర్తు కూడా ఆలోచనలో పడింది. గతంలో ల్యాంకో యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం, అది మూతపడిన తర్వాత రాధ వాసవితో ఎలా ముడిపడిందన్నది కీలకంగా మారుతోంది. ల్యాంకో లేకపోతే.. దానిని ఆధీనంలోకి తీసుకున్న లిక్విడేటర్‌తో కాకుండా రాధాతో సంప్రదింపుల వ్యవహారం నడపటం వల్లే రైతుల వివాదం తలెత్తింది. ల్యాంకోలైన్ విద్యుత అంతరాయం కోసం గతంలో రాధా సంస్థకు ఎన్‌హెచ్ అధికారులు లేఖ రాయడంతో ఆ సంస్థ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. తనది కాని లైన్‌కు సంబంధించి రాధా సంస్థ ఏకంగా హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన రైతులతో నిర్వహించిన సమావేశంలో ఈ వివాదాన్ని పక్కనపెట్టి అలైన్‌మెంట్‌ను రైతుల పొలాల మీదుగా కాకుండా, ఇప్పుడున్న ప్రాంతంలోనే టవర్ల ఎత్తు పెంపుదలకు సంబంధించిన నిర్ణయం జరిగింది. తమకు అభ్యంతరం లేదని, సహకరిస్తామని రైతులు కూడా చెప్పారు. జిల్లా యంత్రాంగం స్థాయిలో ఓ అంగీకారం కుదిరినప్పటికీ మోర్తు స్థాయిలో ఇంకా స్పష్టత రాలేదు. అలైన్‌మెంట్‌ను మార్చే ఉద్దేశం మోర్తుకు లేదని తెలుస్తోంది. టవర్ల ఎత్తును పెంచాలా? టవర్ల వైర్లను తొలగించాలా? అనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. టవర్ల లైన్లను బ్రేక్ చేస్తే కనుక రాధా సంస్థతో సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సంస్థ ఈ లైన్‌కు సంబంధించి స్టే తెచ్చుకుంది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వెళ్లినట్టే అవుతుంది. రాధా తనది అని వాదిస్తున్న వైర్లను కాకుండా కింది వైర్లను బ్రేక్ చేస్తే.. విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. హైటెన్షన్ టవర్‌లో మూడు లేయర్లుగా విద్యుత లైన్లు ఉంటాయి. కింది వరసలోని లైన్లను తొలగించినా, ఇప్పుడున్న టవర్ల ఎత్తు పెంచకపోయినా సరిపోతుందని తెలుస్తోంది. ఇలాంటపుడు సమస్యను తేలిగ్గా పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ ఆలోచిస్తూ ఏది మంచి విధానం అనే దానిపై మోర్తు ఒక అంచనాకు రాలేకపోతోంది. ఈ కాలాతీతం వల్ల విజయవాడ పశ్చిమ బైపాస్‌ను అందుబాటులోకి తీసుకురావటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
Updated Date - Jun 01 , 2025 | 12:57 AM