అదిరేలా..
ABN, Publish Date - Jun 05 , 2025 | 12:54 AM
విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ డిజైన్లను విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు బుధవారం విడుదల చేశారు. వీటిని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్‌కు డీఆర్‌ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్ అందించారు.
రైల్వేస్టేషన్ డిజైన్లు
రూ.845 కోట్లతో విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధి
సరికొత్త డిజైన్లు విడుదల చేసిన రైల్వే అధికారులు
సమస్యలపై ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం
గుణదల, ఐఆర్‌ఆర్ ఆర్వోబీ, వాంబేకాలనీ ఆర్‌యూబీకి మోక్షం
రెండు నెలల్లో అనుమతులు తీసుకుంటామని హామీ
తెరపైకి సింగ్‌నగర్ రెండో ఫ్లైఓవర్ ప్రతిపాదన
ఎర్రకట్ట బ్రిడ్జి స్థానంలో నాలుగు వరసల ఆర్వోబీ
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ డిజైన్లను విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు బుధవారం విడుదల చేశారు. వీటిని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్‌కు డీఆర్‌ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్ అందించారు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో రూ.845 కోట్లతో ఆధునికీకరించనున్నారు. ఇప్పుడున్న రైల్వేస్టేషన్ భవనాలను తొలగించి, రాయల్ డిజైన్‌తో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ ఆధునికీకరణలో భాగంగా పశ్చిమ వైపు ఎంట్రన్స్ కూడా అభివృద్ధి చేయనున్నారు. అలాగే, స్టేషన్ మొత్తాన్ని సువిశాలంగా విస్తరించనున్నారు. రోజుకు 2 లక్షల మంది సామర్థ్యంతో వీటి నిర్మాణం జరుగుతుంది. గంటకు 20 వేల మంది సామర్థ్యాన్ని ఇది తట్టుకోగలదు. మొత్తంగా 1,54,177 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. 10 ప్లాట్‌ఫాంలు, 35 లిఫ్టులు, 30 ఎస్కలేటర్లు ఉంటాయి. కమర్షియల్ ఏరియా 69,585 మీటర్లు ఉంటుంది. మొత్తం 12 హైలెవల్ ప్లాట్‌ఫాంలను అభివృద్ధి చేస్తారు. స్కైవాక్, కొత్త ఎఫ్‌వోబీలు ప్రత్యేకం.
రెండు నెలల్లో మూడు ఆర్‌వోబీలు
నగరంలో రైల్వేతో ముడిపడి ఉన్న ఆర్వోబీ, ఆర్‌యూబీ, సింగ్‌నగర్ ఫ్లైఓవర్, ఎర్రకట్ట బ్రిడ్జి తదితర అంశాలకు సంబంధించి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్‌లు డీఆర్‌ఎం నరేంద్ర ఆనంద్ పాటిల్‌తో బుధవారం సమావేశమయ్యారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రధానమైన రైల్వే అంశాలపై చర్చించారు. గుణదల ఆర్వోబీ, ఇన్నర్ రింగ్‌రోడ్డుకు వెళ్లేచోట ఆర్వోబీ, దేవినగర్-వాంబేకాలనీ ఆర్‌యూబీ, పప్పులమిల్లు దగ్గర ఆర్‌యూబీ, సింగ్‌నగర్ రెండో ఫ్లై ఓవర్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. గుణదల ఆర్వోబీ, ఇన్నర్ రింగ్‌కు వెళ్లే వైపు ఆర్వోబీ, దేవీనగర్-వాంబేకాలనీ ఆర్‌యూబీ ప్రతిపాదనలకు రెండు నెలల్లోపు రైల్వేబోర్డు నుంచి అనుమతులు తీసుకుంటామని డీఆర్‌ఎం హామీ ఇచ్చారు. సింగ్‌నగర్ రెండో ఫ్లైఓవర్ విషయాన్ని రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్తామని, ఎవరి నిధులతో ఖర్చు చేయాలన్న దానిపై స్పష్టత తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ సింగ్‌నగర్ ఫ్లై ఓవర్‌కు యుద్ధప్రాతిపదికన క్లియరెన్స్ తీసుకోవాలని కోరారు. పాత ఎర్రకట్ట బ్రిడ్జిని తొలగించి నాలుగు వరసల ఆర్వోబీ నిర్మించాలన్న ప్రతిపాదనను కూడా రైల్వేబోర్డు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇందుకు సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపారు. రైల్వే సమస్యలను నిత్యం ప్రజాప్రతినిధులతో చర్చించేందుకు వీలుగా ఒక లైజనింగ్ అధికారిని కూడా నియమిస్తామని డీఆర్‌ఎం తెలిపారు.
Updated Date - Jun 05 , 2025 | 12:54 AM