ఇళ్ల పట్టాల చెరలో..
ABN, Publish Date - May 17 , 2025 | 01:39 AM
ఇప్పటికే లెక్కకుమించిన కేసుల్లో చిక్కుకుని జైలు జీవితం అనుభవిస్తున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మెడకు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు కూడా చుట్టుకుంది. ఓట్లే ఎరగా, పేదలను మభ్యపెట్టి నాడు ఎమ్మెల్యే స్థానంలో ఉండి వంశీ చేసిన ఈ నకిలీ పట్టాల కేసులో ఈనెల 29 వరకు నూజివీడు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి రిమాండ్ విధించడంతో నియోజకవర్గవ్యాప్తంగా చర్చ మొదలైంది.
2019లో పేదలను మోసం చేసిన వల్లభనేని వంశీ
నియోజకవర్గవ్యాప్తంగా 1,200 నకిలీ పట్టాలు అందజేత
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఇష్టానుసారంగా..
ఎన్నికలు పూర్తయ్యాక నకిలీ వ్యవహారం వెలుగులోకి..
పట్టాలు వెనక్కి తీసేసుకున్న వంశీ అనుచరులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ నరసింహారావు
వైసీపీ హయాంలో స్తబ్దుగా ఉన్న కేసు
తాజా పరిణామాల్లో ఈనెల 29 వరకు రిమాండ్
హనుమాన్ జంక్షన్ రూరల్, ఆంధ్రజ్యోతి : 2019 ఎన్నికల సమయంలో నాటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆధ్వర్యంలో బాపులపాడు మండలంలో పెరికీడు, కోడూరుపాడు, కొయ్యూరు, బాపులపాడు గ్రామాల్లో సుమారు 400కు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత ఏప్రిల్‌లో పేదలను మభ్యపెట్టేలా ఈ పట్టాలు అందజేశారు. ఆ తర్వాత ఆ పట్టాలన్నీ నకిలీవనే విషయం బయటపడింది. అయితే, ఆ ఇళ్ల పట్టాలు చట్టబద్ధంగా మంజూరు కాలేదని, అవన్నీ నకిలీ పట్టాలేనని నాటి తహసీల్దార్ కలగర గోపాలకృష్ణ పేరును, తహసీల్దార్ కార్యాలయ సీల్‌ను దుర్వినియోగం చేస్తూ కల్పించిన పట్టాలుగా రెవెన్యూ శాఖ దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత 2019, అక్టోబరు 16న తహసీల్దార్ నరసింహారావు హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు తమకిచ్చిన పట్టాలు నిజమైనవా, కాదా అనే అయోమయంలో లబ్ధిదారులు తలలు పట్టుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరికి జగనన్న కాలనీల్లో పట్టాలు కేటాయించామని చెప్పడంతో ఏదో రకంగా ఇంటి స్థలం వస్తుందిలే అని ఆనందపడ్డామని పెరికీడు, కొయ్యూరుకు చెందిన మహిళా లబ్ధిదారులు తెలిపారు. ఇప్పటికీ పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు గ్రామాల్లో ఇళ్ల్ల స్థలాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తం 1,200 పట్టాలు ఇచ్చాం : టీడీపీ
నాడు అవుటపల్లిలో జరిగిన అంతర్గత సమావేశంలో నియోజకవర్గవ్యాప్తంగా 1,200 పట్టాలు పంపిణీ చేయాలని మాజీ ఎమ్మెల్యే వంశీ తమను ఆదేశించారని, ఆయన ఆదేశాల మేరకే అలా చేశామని, ఎన్నికలు జరిగాక నకిలీ ఇళ్ల పట్టాల కేసు వెలుగు చూడటంతో వంశీ అనుచరులు కొందరు రంగంలోకి దిగి పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తామని మభ్యపెట్టి పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలన్నీ తిరిగి తీసుకున్నారని బాపులపాడు టీడీపీ నాయకులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. బాపులపాడు మండలంలో సుమారు 400, ఉంగుటూరు, గన్నవరం టౌన్, గన్నవరం గ్రామీణ ప్రాంతాల్లో 600, విజయవాడ గ్రామీణ ప్రాంతంలో 200 పట్టాలను అదే సమావేశంలో టీడీపీ నాయకులతో పంపిణీ చేయించారని చెప్పారు. తరువాత జరిగిన పరిణామాల వల్ల ఎమ్మెల్యే వంశీ వైసీపీలోకి వెళ్తూ తమను కూడా రమ్మన్నారని, తాము నిరాకరించడంతో స్థానిక అనుచరులతో తమపై కేసులు నమోదు చేయించారని తెలిపారు. ఆ ఫలితంగానే ఆరేళ్లుగా నూజివీడు కోర్టుకు వాయిదాలకు వెళ్లొస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - May 17 , 2025 | 01:39 AM