నిరుపయోగంగా..
ABN, Publish Date - May 17 , 2025 | 01:28 AM
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు నిర్మించి న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి.
పదేళ్లుగా ఎవరికీ కేటాయించని ప్రభుత్వాలు
ఆకతాయిలకు అడ్డాగా గృహాలు.. మొక్కలు మొలిచి శిథిలావస్థలో భవనాలు
(ఆంధ్రజ్యోతి-అజిత్‌సింగ్‌నగర్): పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు నిర్మించి న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి పదేళ్లు దాటినా నేటికీ పేదలకు కేటాయించలేదు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లు శిథిలావస్ధకు చేరుకుంటున్నాయి. పలు బ్లాకుల్లోని గృహాలు ఆకతాయిలకు అడ్డాగా మారుతున్నాయి. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎక్సెల్ ప్లాంట్ సమీపంలో పదేళ్ల క్రితం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల నిర్మాణాన్ని అప్పటి ప్రభుత్వం చేపట్టింది. 24 బ్లాక్‌లుగా బ్లాక్‌కు 32 చొప్పున మొత్తం 768 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. రెండేళ్లల్లోనే పనులు నిలిచిపోవడంతో అప్పట్లో పలు రాజకీయ పార్టీలు, ప్రజలు ఆందోళనలు చేపట్టడంతో తిరిగి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి ఎనిమిదేళ్లు పూర్తవుతున్నా నేటికి పూర్తిస్థాయిలో ఇళ్ల కేటాయింపులు జరగలేదు. 768 ఇళ్లకు 30 శాతం ఇళ్లను కేటాయించి మిగిలిన ఇళ్లను గాలికి వదిలేశారు. గృహాల్లో చాలా వరకు రాజకీయ కేటాయింపులు జరిగాయని విమర్శలు కూడా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తలు, నేతలకు, సానుభూతిపరులకు ఇక్కడి ఇళ్లు కేటాయించి పేద ప్రజలను విస్మరించారని ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను పేదలకు త్వరితగతిన కేటాయించాలని పలువురు కోరుతున్నారు. గత ప్రభుత్వాలు ఇళ్లు కేటాయించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరి ఆకతాయిలకు అడ్డాగా మారుతున్నా యి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లను పేదలకు కేటాయిస్తే పేదల సొంత ఇంటి కల నేరవేరుతుందని పలువురు కోరుతున్నారు.
గంజాయి బ్యాచ్‌లకు అడ్డాగా..
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు మందుబాబులు, గం జాయి బ్యాచ్‌లకు అడ్డాగా మారాయి. ఖాళీగా ఉన్న నివాసాల సముదాయాల మధ్య ఎక్కడ చూసినా చెత్త, చెదారం, మద్యం బాటిళ్లతో చిందరవందరగా కనిపిస్తున్నాయి. రాత్రిళ్లు ఇటువైపు వెళ్లే పరిస్థితి లేదు. పలు నివాసాలకు తాళాలు పగులకొట్టి గడియలు విరిచి ఆకతాయిలు ఆ ఇళ్లను తమ అడ్డాగా మార్చుకున్నారు.
Updated Date - May 17 , 2025 | 01:28 AM