యథేచ్ఛగా మట్టి, బుసక రవాణా
ABN, Publish Date - May 17 , 2025 | 01:24 AM
మట్టి, బుసక అనధికార రవాణా మం డలంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. రాత్రి సమయాల్లో రవాణాదారులు మరిం త రెచ్చిపోతున్నారు.
రాత్రి సమయాల్లో రెచ్చిపోతున్న మట్టి మాఫియా
మోపిదేవి, మే 16 (ఆంధ్రజ్యోతి): మట్టి, బుసక అనధికార రవాణా మం డలంలో యథేచ్ఛగా కొనసాగుతోంది. రాత్రి సమయాల్లో రవాణాదారులు మరిం త రెచ్చిపోతున్నారు. మండలం, జిల్లాలు దాటి మట్టి, బుసకను అనధికారికంగా మండలానికి రవాణా చేస్తున్నప్పటికీ నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవటం లేదని ప్రజలు అంటున్నారు. మండలంలోని పెదప్రోలు పంచాయతీ శివారు కప్తానుపాలేనికి గురువారం అర్ధరాత్రి ఆరు టిప్పర్లలో బుసక, రెండు టిప్పర్లలో మట్టిని తీసుకొచ్చారు.
టిప్పర్లకు కారు అడ్డంగా పెట్టిన తెలుగు మహిళా నేతకు బెదిరింపులు
60 -70 టన్నుల లోడుతో టిప్పర్లు వస్తే అంతర్గత రహదారులు దెబ్బతింటాయని అనుమతి లేకుండా ఎలా రవాణా చేస్తారని గ్రామానికి చెందిన తెలుగు మహిళ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి దివి యుగంధరి కుటుంబసభ్యులతో కలిసి బుసక టిప్పర్లు వేసుకొచ్చిన వారిని ప్రశ్నించారు. మీరేం చేస్తారు.. మా ఇష్టం అంటూ వారు యుగంధరి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగడంతో టిప్పర్లు వెళ్లకుండా అడ్డుకునేందుకు కారును రహదారిపై అడ్డంగా నిలిపారు. మిమ్మల్ని, మీ కారును తొక్కించుకుని వెళ్తామని టిప్పర్లు వేసుకొచ్చిన వారు బెదిరింపులకు దిగారని యుగంధరి కుటుంబసభ్యులు, తెలిపారు. రెవెన్యూ, పోలీసులకు అర్ధరాత్రి సమయంలో తెలియజేసినా గంటలు వేచిచూసినా వారు రాకపోవడంతో ఈలోపు టిప్పర్లు పొలాల్లోనుంచి వెళ్లిపోయాయి. బాపట్ల జిల్లా బొబ్బర్లంక నుంచి మండలాలు దాటి మట్టి బుసక అక్రమ రవాణా సాగుతున్నా అధికారులు నియంత్రించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మోపిదేవి, పెదప్రోలు, కప్తానుపాలెం తదితర గ్రామాల్లో కోట్ల రూపాయలు వెచ్చించి వేసిన రహదారులు దెబ్బతింటున్నాయని, ఇప్పటికైనా అనధికార రవాణాదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - May 17 , 2025 | 01:24 AM