ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అవినీతి అధికారి.. దారి దోపిడీ

ABN, Publish Date - Apr 20 , 2025 | 12:37 AM

రవాణా శాఖలో ఆయనొక బాస్‌. అంతకుమించి వసూల్‌ రాజా అంటే సరిగ్గా సరిపోతుంది. కలెక్షన్ల కోసం ఏజెంట్లనే నియమించుకున్న లంచాల ఘనాపాఠి ఆయన. ఎన్టీఆర్‌ జిల్లాలో ఎక్కువగా దందా చేస్తే తెలిసిపోతుందని.. కృష్ణాజిల్లాపై పడ్డాడు. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు కేంద్రంగా కలెక్షన్‌ ఏజెంట్లను పెట్టుకుని విచ్చలవిడిగా వసూళ్లకు తెరలేపాడు. ఈ అధికారి దెబ్బతో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు.. వాహనదారులపై పడి అందినకాడికి దోచేస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాను దోచేస్తున్న రవాణాధికారి

మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరులో కలెక్షన్‌ ఏజెంట్లు

జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లోనూ నియామకం

సహాయ, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లతోనే దందా

గన్నవరంలో ప్రైవేట్‌ వ్యక్తికి బాధ్యతలు.. హల్‌చల్‌

ఇసుక, మెటల్‌ లారీల నుంచి దండిగా వసూళ్లు

ట్రాక్టర్‌ ట్రక్కులను ఏమార్చి మస్తుగా మామూళ్లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రవాణా శాఖలోని ఓ రాష్ట్రస్థాయి అధికారి ఉమ్మడి కృష్ణాజిల్లాలో వాహనాల నుంచి భారీగా మింగుతున్నారు. ఈ సార్‌ నిర్దేశిస్తున్న టార్గెట్లు చేరుకోవడానికి మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల (ఎంవీఐ) అసోసియేషన్లు సమావేశాలు కూడా నిర్వహించుకునే పరిస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.

మచిలీపట్నంలో మామూళ్లు

మచిలీపట్నంలో ఒక ఎంవీఐను కలెక్షన్‌ ఏజెంట్‌గా పెట్టుకున్నారు. డీటీవో పరిధిలోని ఇసుక లారీలకు, పోర్టుకు వెళ్లే మెటల్‌, గ్రావెల్‌ లారీలకు నెలవారీ మామూళ్లు పెట్టేశారు. ఈ మామూళ్లకు సహకరించని వారిపై ఓవర్‌లోడ్‌ పేరుతో కేసులు రాస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. ఈ మామూళ్లపై మొదట్లో మెటల్‌ లారీ యజమానులు ఎదురుతిరిగారు. దీంతో వరుసగా లారీలను అడ్డుకుంటూ జరిమానాల మోత మోగించారు. ఈ దెబ్బతో లారీ యజమానులు మామూళ్లు ఇవ్వడానికి అంగీకరించారు. అడిగినంత ముట్టజెబుతున్నామని ఓవర్‌ లోడ్‌తో రాకపోకలు సాగిస్తున్నారు. రోజురోజుకూ కలెక్షన్‌ పెరగడంతో సదరు సార్‌.. టార్గెట్లు మరింత పెంచారు. దీంతో కలెక్షన్‌ ఏజెంట్‌ ట్రాక్టర్ల ట్రక్కులపై పడ్డాడు. పాత ట్రక్కుకు రంగు వేయించి కొత్త చాసిస్‌ నెంబర్‌ బిళ్లను తగిలిస్తున్నాడు. కొత్తది కాబట్టి పాత డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒక్కో ట్రక్కుకు రూ.20 వేలు తీసుకుని కొత్తవాటిగా రాజముద్ర వేసి పంపుతున్నాడు.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో దోపిడీ ఇలా..

ఈ సార్‌కు.. గుడివాడలో మరో కలెక్షన్‌ ఏజెంట్‌ ఉన్నాడు. ఇక్కడ పనిచేసే ఓ ఇన్‌స్పెక్టర్‌ ఏకంగా ట్రాక్టర్‌ ట్రక్కులపై ఎక్కువగా వసూలు చేసి సార్‌కు అందజేస్తున్నాడు. ఇక ఇసుక లారీల డబ్బు మామూలే. గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా ఓ ప్రైవేట్‌ కలెక్షన్‌ ఏజెంట్‌ను ఈ సార్‌ మళ్లీ లైన్‌లోకి దించారు. ఇంతకుముందు ఈ ఏజెంట్‌ కేవలం కొందరు అవినీతి మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ల సేవలో ఉండేవాడు. ఈయన గన్నవరం ఎఫ్‌సీ స్టేషన్‌లో వాహనాలకు పెయింట్‌ వేసే పెయింటర్‌ దగ్గర పనిచేసే అసిస్టెంట్‌. కాలక్రమంలో కలెక్షన్‌ కింగ్‌ అవతారమెత్తాడు. ఈయన చేసే వసూళ్లకు గాను ఇన్‌స్పెక్టర్ల సిండికేట్‌ కొంత కమీషన్‌ను కూడా ఇచ్చేది. ఈ ఏజెంట్‌ కలెక్షన్లు మరీ ఎక్కువ కావడంతో ఎంవీఐల సిండికేట్‌ సమావేశం పెట్టుకుని మరీ ఇతనిని తొలగించాలని నిర్ణయించింది. ఆ సమావేశంలో ఇన్‌స్పెక్టర్ల సిండికేట్‌ రెండు వర్గాలుగా విడిపోయి.. తొలగించాలని కొందరు, తొలగించొద్దని మరికొందరు పట్టుబట్టారు. ఆ తర్వాత కలెక్షన్‌ కింగ్‌ను పిలిచి హెచ్చరించి పంపేశారు. ఈ వ్యవహారం తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న ఆ ఏజెంట్‌ ఇప్పుడు మళ్లీ జూలు విదిల్చాడు. సార్‌ టార్గెట్లు ఎక్కువ కావటంతో ఇన్‌స్పెక్టర్ల సిండికేట్‌ ఇతనిపై బండ పెట్టింది. దీంతో సదరు ఏజెంట్‌ బయటకు రాకుండా ఇంటి నుంచే లారీ యజమానుల నుంచి వసూళ్లకు తెగబడ్డాడు. ఉయ్యూరు ఆర్‌టీవో కార్యాలయ పరిధిలోనూ ఇదే వ్యవహారం నడుస్తోంది. ఓ ఇన్‌స్పెక్టర్‌ దిగువ అధికారి ఇక్కడ కలెక్షన్లకు శ్రీకారం చుట్టాడు. అలాగే, నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల పరిధిలో కొందరు ఇన్‌స్పెక్టర్లు మెటల్‌, ఇసుక లారీ యజమానుల నుంచి వసూళ్లు చేస్తున్నారు.

కలెక్షన్‌ ఏజెంట్లకు సార్‌ అభయం

తన కోసం కలెక్షన్‌ ఏజెంట్లుగా మారిన కొందరు అవినీతి ఇన్‌స్పెక్టర్లకు సార్‌.. అండగా ఉంటారు. వారెన్ని తప్పులు చేసినా కాచుకుంటారు. రెడ్‌హ్యాండెండ్‌గా దొరికినా సరే.. వారికి సంబంధించిన ఫైల్‌ను హెడ్డాఫీసుకు పంపరు. వారిపై విచారణ నివేదికలను తొక్కి పట్టేస్తారు. దీంతో కలెక్షన్‌ ఏజెంట్లు విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నారు. బాస్‌ అండతో కొందరు అవినీతి ఇన్‌స్పెక్టర్లు హైవేలు, టోల్‌గేట్ల దగ్గర ప్రైవేట్‌ సిబ్బందిని పెట్టుకుని వసూలు చేస్తున్నారు. ప్రైవేట్‌ బస్సుల యాజమానుల నుంచి నెలవారీ మామూళ్లను నిర్దేశించుకోవడంతో వారి జోలికి వెళ్లరు. పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చే లారీలనే లక్ష్యంగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు.

Updated Date - Apr 20 , 2025 | 12:37 AM