గృహయోగం ఎప్పటికో
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:55 AM
జిల్లాలో పేదలకు టిడ్కో ఇళ్లు ఎప్పటికి అప్పగిస్తారో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. ఏళ్ల తరబడి ఇళ్లు అందక లబ్ధిదారులు లబోదిబోమంటుంటే, ఈ ఇళ్ల కోసం నాడు ప్రభుత్వం తీసుకున్న రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి.
పేదలకు ఇంకా అందని టిడ్కో ఇళ్లు
ఎక్కడి పనులు అక్కడే పెండింగ్
రుద్రవరంలో 97 శాతం పనులు పూర్తి
అయినా అప్పగించకుండా జాప్యం
ఉయ్యూరులో 2019లోనే నిలిచిన పనులు
బందరులోని గోసంఘం, గుడివాడలో ఇళ్ల అప్పగింత
కనీస సౌకర్యాలు లేక లబ్ధిదారుల అవస్థలు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో మొత్తం 13,712 ఇళ్లను గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయనే కారణాలు చూపించి పనులు నిలిపివేశారు. గుడివాడలో 7 వేల మందికి, మచిలీపట్నంలో 864 మందికి ఇళ్లు అప్పగించారు. మచిలీపట్నం రుద్రవరంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు. ఉయ్యూరులోని టిడ్కో ఇళ్ల నిర్మాణం 2019 నుంచి నిలిచిపోయే ఉన్నాయి. ఇక్కడ పనులుచేసే కాంట్రాక్టరుకు రూ.100 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
బకాయిలు చెల్లించాలని బ్యాంకు నోటీసులు
టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారుల ఎంపిక, వాటా చెల్లింపులు, వారి పేరున బ్యాంకు రుణాల మంజూరు వంటి ప్రక్రియ జరిగింది. గత ఆరేడేళ్ల క్రితమే లబ్ధిదారుల పేరున బ్యాంకు రుణాలు ఇవ్వడంతో వాటిని చెల్లించాలంటూ లబ్ధిదారులకు బ్యాంకు అధికారుల నుంచి నోటీసులు వస్తున్నాయి. వివిధ బ్యాంకుల సిబ్బంది లబ్ధిదారుల వద్దకు వెళ్లి టిడ్కో ఇళ్ల నిర్మాణం నిమిత్తం తీసుకున్న రుణాలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. తమకు ఇళ్లు ఇంకా అప్పగించలేదని, రుణాలు ఎలా చెల్లిస్తామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో వివిధ రూపాల్లో జమ అయిన నగదును రుణం చెల్లింపుల కింద బ్యాంకు అధికారులు జమ చేసుకుంటుండటంతో లబోదిబోమంటున్నారు.
రుద్రవరంలోని ఇళ్లను ఎప్పటికి అప్పగిస్తారో..
మచిలీపట్నం నియోజకవర్గంలోని రుద్రవరంలో చిన్నాపురం-మచిలీపట్నం రహదారి వెంబడి 3వేలకు పైగా టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వివిధ కారణాలతో వీటి సంఖ్యను 1,440కు తగ్గించారు. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో 60 శాతం మేర పనులు పూర్తయ్యాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లు పనులు నిలిపివేసి, తర్వాత ప్రారంభించారు. కిటికీలు, తలుపులు, విద్యుదీకరణ పనులు తుదిదశలో నిలిచిపోయాయి. ఈ గృహ సముదాయాలకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3.50 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టింది. ఈ బిల్లులు మంజూరు చేస్తే నెలలోపే పెండింగ్ పనులు పూర్తిచేస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. 800 ఇళ్లకు సంబంధించి పనులు పూర్తయినా లబ్ధిదారులకు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఈ ఇళ్లకు తాగునీటి అవసరాల నిమిత్తం నగరంలోని పంపులచెరువు నుంచి పైపులైన్ వేయడంతో పాటు ఓవర్‌హెడ్ ట్యాంకు, సంప్‌ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. సగం ఇళ్లకు మాత్రమే పైపులైన్ కనెక్షన్లు ఇచ్చారు. మిగతా పనులు ఎప్పటికి పూర్తిచేస్తారో ప్రశ్నార్థకంగా మారింది.
ఉయ్యూరులో పూర్తికాని పనులు
ఉయ్యూరు టౌన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ కంపెనీ ద్వారా ఈ పనులు చేస్తున్నారు. ఈ ఇళ్లకు సంబంధించి రూ.100 కోట్లకు పైగా బిల్లులను గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది. నిర్మాణం పూర్తిచేస్తామని ఎన్నికల ముందు కొద్దిరోజులపాటు హడావిడి చేసి రహదారుల పనులు కొంతమేర చేసినట్టుగా చూపించి ఆ తర్వాత ఆపేశారు. 2019వ సంవత్సరం నుంచి ఇక్కడి పనులు పూర్తిస్థాయిలో కాంట్రాక్టర్ నిలిపివేశాడు. ఎల్‌అడ్‌టీ కంపెనీ అమరావతి పనుల్లో బిజీగా ఉండటంతో ఉయ్యూరులోని ఇళ్ల నిర్మాణంపై అంతగా దృష్టిసారించలేదు.
మచిలీపట్నం గోసంఘంలో..
మచిలీపట్నంలో 6వేల మంది లబ్ధిదారులు టిడ్కో ఇళ్ల కోసం నగదు చెల్లించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఇళ్ల సంఖ్యను 2,304కు తగ్గించారు. మచిలీపట్నంలో గోసంఘం వద్ద 864 ఇళ్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి, రెండు నెలల క్రితం మరోసారి లబ్ధిదారులకు అప్పగించారు. ఇక్కడ నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకు ద్వారా సరఫరా అయ్యే తాగునీరు చాలని పరిస్థితి ఏర్పడింది. వీధిలైట్లు సక్రమంగా వేయలేదు.
గుడివాడలో..
గుడివాడ పురపాలక సంఘం సరిహద్దున ఉన్న మల్లాయపాలెంలో 8,912 ఇళ్లు నిర్మించారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చాక ఇందులో కొంతమంది లబ్ధిదారుల పేర్లను అకారణంగా తొలగించారు. 2022 జూన్‌లో లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించగా, వీరిలో 2వేల కుటుంబాలు కూడా నివాసం ఉండట్లేదు. తాగునీరు, ఇతర మౌలిక వసతులు ఇక్కడ లేకపోవడంతో నివాసం ఉండటానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలంటూ ప్రజలు టిడ్కో కాలనీ అసోసియేషన్ పేరుతో తరచూ ధర్నాలు చేస్తున్నారు. వీధిలైట్లు సక్రమంగా ఏర్పాటు చేయాలని స్థానికంగా నివాసం ఉండేవారు కోరుతుండగా, పనులు చేస్తామని చెబుతూ కాలయాపన చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. వాడుక నీటి అవసరాల కోసం లబ్ధిదారులంతా తమ ఇళ్ల వద్ద బోర్లు వేయించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వివిధ కారణాలతో 2వేల మంది లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించకుండా నిలిపివేశారు. పాతపేర్లు ఉన్నవారికే ఇళ్లు ఇస్తామని చెబుతున్నా, ఈ అంశంపై నేటికీ కదలిక లేదు. టిడ్కో ఇంటి రుణాల నుంచి లబ్ధిదారులకు విముక్తి కల్పిస్తామని ఎన్నికల సమయంలో రెండు ప్రధాన పార్టీల నాయకులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.
Updated Date - Jun 01 , 2025 | 12:55 AM