ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

డ్రగ్స్‌.. క‘స్టడీ’

ABN, Publish Date - Jun 27 , 2025 | 12:50 AM

మెథలీన్‌ డైయాక్సీ ఎన్‌ మెథాఫెటమైన్‌ (ఎండీఎంఏ) డ్రగ్‌.. విద్యా నిలయాల్లోకి చేరిందా? ఇంజనీరింగ్‌, ఇతర కళాశాలల్లో విద్యార్థులు ఈ డ్రగ్‌ను వాడుతున్నారా? తల్లిదండ్రులిచ్చిన డబ్బును దీనికోసం వెచ్చిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఢిల్లీ-విజయవాడ ఎండీఎంఏ డ్రగ్‌ కేసులో తవ్వేకొద్దీ కొత్త విషయాలు బయటకొస్తుండగా, తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రముఖ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు పోలీసుల చేతికి చిక్కాయి.

ఎండీఎంఏ కేసులో బయటపడిన నిజాలు

ఇప్పటికే ముగ్గురు నిందితుల అరెస్టు

ఢిల్లీ-విజయవాడ డ్రగ్స్‌ సరఫరా చేసింది వీరే..

నిందితులతో తరచూ మాట్లాడుతున్న 50 మంది

అంతా కృష్ణా, గుంటూరు జిల్లాల విద్యార్థులే..

విద్యార్థులు, తల్లిదండ్రులకు పోలీసుల పిలుపులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఢిల్లీ నుంచి విజయవాడకు ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకొచ్చిన కేసులో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 50 మంది విద్యార్థుల పేర్లు బయటకొస్తున్నాయి. ఈ కేసులో మొత్తం ఐదుగురిని టాస్క్‌ఫోర్స్‌, పటమట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, నిందితుల సెల్‌ఫోన్లను విశ్లేషించగా, విద్యార్థుల జాతకాలు బయటపడ్డాయి. ఈ విద్యార్థులంతా వివిధ కళాశాలల్లో చదువుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు వారందరినీ టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి పిలిపించాలని నిర్ణయించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులనూ పిలిచి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని భావిస్తున్నారు.

ఆ ముగ్గురే..

ఢిల్లీ నుంచి కొరియర్‌ ద్వారా హైదరాబాద్‌కు ఈ డ్రగ్‌ను రప్పించుకుని, అక్కడి నుంచి నగరానికి తీసుకొస్తున్న తిరుమలశెట్టి జీవన్‌కుమార్‌, బొంతు నితీష్‌కుమార్‌, తూలిమెల్లి తరుణ్‌ప్రసాద్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారికి ఢిల్లీలోని నోయిడాకు చెందిన రింకీ ఈ సరుకును పార్శిల్‌ చేస్తున్నాడని నిర్ధారణైంది. ఈ ముగ్గురు నిందితుల్లో జీవన్‌కుమార్‌ ఎండీఎంఏను రప్పించడంలో కీలకంగా వ్యవహరించాడు. పామర్రుకు చెందిన మనోహర్‌ అనే యువకుడు ఈ ఎండీఎంఏ రుచిని తనకు చూపించినట్టు జీవన్‌కుమార్‌ అంగీకరించాడు. దీంతో మనోహర్‌తో పాటు మరో నిందితుడిని కొద్దిరోజుల క్రితం పటమట పోలీసులు అరెస్టు చేశారు.

విద్యార్థులే టార్గెట్‌గా..

విద్యార్థులే టార్గెట్‌గా జీవన్‌కుమార్‌ ఎండీఎంఏ డ్రగ్‌ను విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. తొలివిడతలో అరెస్టైన ముగ్గురు నిందితుల్లో తరుణ్‌ప్రసాద్‌ పెనమలూరు మండలం గంగూరులో ఉన్న ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్నాడు. ఈ ముగ్గురు నిందితుల సెల్‌ఫోన్లను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో విశ్లేషించారు. వారి సీడీఆర్‌ (కాల్‌ డేటా రికార్డు)ను పరిశీలించారు. ఈ ముగ్గురికి తరచూ 50 నెంబర్ల నుంచి ఫోన్లు రావడం, వెళ్లడం జరిగినట్టు గుర్తించారు. ఈ 50 నెంబర్లు ఎవరి పేర్ల మీద ఉన్నాయో పోలీసులు కూపీ లాగారు. వారంతా వివిధ కళాశాల్లో చదువుతున్నారని తేలింది. అందులో కొంతమంది ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో, మరికొంతమంది ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల్లో చదువుతున్నట్టు గుర్తించారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ జాబితాను సిద్ధం చేశారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి పిలిచి కౌన్సెలింగ్‌ చేయాలని భావిస్తున్నారు. ఈ విద్యార్థులంతా ఏడాదిగా ఈ ముగ్గురు నిందితులతో సంభాషిస్తున్నట్టు సమాచారం. తల్లిదండ్రులు ఇచ్చే రూ.100, రూ.200తో ఈ ఎండీఎంఏ కొంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఆ విద్యార్థులంతా ఏయే కళాశాలల్లో చదువుతున్నారో తెలుసుకుని వాటి యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.

Updated Date - Jun 27 , 2025 | 12:50 AM