టీడీపీ ఆవిర్భావమే సంచలనం
ABN, Publish Date - May 23 , 2025 | 01:28 AM
గుంటుపల్లి సీఏ కన్వెన్షన్‌లో గురువారం పండుగలా జిల్లా మినీ మహానాడు నిర్వహించారు.
నేడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది
ఎన్టీఆర్ స్ఫూర్తిని చంద్రబాబు కొనసాగిస్తున్నారు
ఎన్టీఆర్ జిల్లా మినీ మహానాడులో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం
ఇబ్రహీంపట్నం, మే 22(ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ ఆవిర్భావమే ఒక గొ ప్ప సంచలనం. నేడు దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతుందంటే అది స్వర్గీయ ఎన్టీఆర్ కృషి ఫలితమే. అరవై ఏళ్ల వయస్సులో పార్టీ స్థాపించి ప్రజలకు ఎనలేని సేవలందించిన ఎన్టీఆర్ స్ఫూర్తిని సీఎం నారా చంద్రబాబునాయుడు కొనసాగిస్తున్నారు.’ అని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. గుంటుపల్లి సీఏ కన్వెన్షన్‌లో గురువారం పండుగలా నిర్వహించిన జిల్లా మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. తొలుత నేతలు పార్టీ జెండాను ఆవిష్కరించాక, జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆ ర్ ప్రతిమకు నివాళులర్పించారు. సభకు నెట్టెం అధ్యక్షత వహించారు. జగన్‌లాంటి నియంతను తాను ఇప్పటివరకు చూడలేదని నెట్టెం అన్నారు. ఐదేళ్ల అరాచకపాలనలో టీడీపీ నేతలను, కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టా డని, వాటన్నింటినీ తట్టుకుని, నిలబడి అధికారం సాధించుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది అని ఆయన అన్నారు. జిల్లాలో భారీగా టీడీపీ సభ్యత్వాలను చేసినందుకు నాయకులకు ఆయన అభినందనలు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పని చేయాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ సంక్షేమానికి బాటలు వేస్తే, సీఎం చంద్రబాబునాయుడు సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు వేస్తున్నారని, దేశంలోనే కృష్ణా - గోదావ రి నదులను అనుసంధానం చేసిన మార్గదర్శకుడు చంద్రబాబు అని ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, కడపలో జరిగే మహానాడును జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేద్దామని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు పిలుపునిచ్చారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన పార్టీ టీడీపీ అని, అందులో సభ్యునిగా ఉండటం గర్వంగా ఉందని, దార్శనికుడు సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని, పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, శ్రీరాం తాతయ్య, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, అధికార ప్రతినిధి రఫీ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు జంపాల సీతారామయ్య, బొమ్మసాని సుబ్బారావు, కె.విజయబాబు, ధారునాయక్, ఆనంద్ సూర్య పాల్గొన్నారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి జిల్లా మినీ మహానాడుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కుటుంబ సభ్యులు తరలివచ్చారు. అధికారంలోకి వచ్చాక, ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మహానాడు కావడంతో నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ విధి విధానాలను, తీర్మానాలను ఆసక్తిగా విన్నారు. అనంతరం వచ్చిన వారికి మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు.
Updated Date - May 23 , 2025 | 01:28 AM