శిథిలావస్థలో
ABN, Publish Date - Apr 19 , 2025 | 01:05 AM
ఎప్పుడు కూలిపోతాయో తెలియని షాపులు.. పెచ్చులూడుతున్న శ్లాబులు.. కనిపించని కనీస మౌలిక సదుపాయాలు.. మచిలీపట్నంలోని నగరపాలక సంస్థ షాపుల దుస్థితి ఇది. ఏడాదికి రూ.కోటికి పైగా ఆదాయం వచ్చే ఈ షాపులపై అధికారులు శీతకన్ను వేయడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్లలేక, ఉన్న షాపుల్లో వ్యాపారం చేయలేక అద్దెదారులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
భయంకరంగా బందరు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు
పెచ్చులూడుతున్న శ్లాబులు, మొండిగోడలు
రంగులు వేసి ఎనిమిదేళ్లు అయినా పట్టని అధికారులు
బిక్కుబిక్కుమంటున్న షాపుల అద్దెదారులు
కొనేరు సెంటర్ కాంప్లెక్స్ పరిస్థితి మరీ దారుణం
అద్దె పెంచుతున్నా అభివృద్ధి చేయని అధికారులు
మచిలీపట్నం టౌన్, ఆంధ్రజ్యోతి : మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని షాపులు శిథిలమై ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. కోనేరు సెంటర్‌లో 40 ఏళ్ల క్రితం నిర్మించిన షాపులు, పార్కు పక్కన నిర్మించిన షాపుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. శ్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయి. కొన్ని షాపుల పైకప్పులు పూర్తిగా శిథిలం కావడంతో అద్దెదారులు వాటిని మూసివేశారు. షాపులు తమ పేరున ఉండేందుకు అద్దె మాత్రం చెల్లిస్తున్నారు. వీటికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోవట్లేదు.
దాదాపు అన్ని షాపులదీ అదే పరిస్థితి
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 390 షాపులు ఉన్నాయి. కోనేరు సెంటర్‌లోని పట్టాభి మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్, ఇతర కాంప్లెక్స్‌ల్లో 200 వరకు షాపులు ఉన్నాయి. పార్కు పక్కన ఉన్న సన్నాల వేణుగోపాలరావు షాపింగ్ కాంప్లెక్స్‌లో 10, జిల్లా కోర్టులోని షాపింగ్ కాంప్లెక్స్‌లో 24, నెహ్రూ షాపింగ్ కాంప్లెక్స్‌లో 10, బేబీ సెంటర్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో 24, నారకొట్ల సెంటర్‌లో 15, కూరగాయల మార్కెట్‌లో 20 ఉన్నాయి. ఇలా వివిధ ప్రాంతాల్లో చిన్నచిన్న షాపులు ఉన్నాయి. మొత్తం 390 షాపులకు అద్దెల కింద ఏడాదికి రూ.కోటి 25 లక్షల ఆదాయ వస్తుంది. కాగా, పదేళ్ల కిందట రోడ్డు విస్తరణలో తొలగించిన షాపులు మొండిగోడలతో అలాగే ఉండిపోయాయి. కోనేరు సెంటర్‌లోని షాపులకు చుట్టుపక్కల 20 గ్రామాలకు చెందిన వినియోగదారులు వస్తుంటారు. ఇక్కడ ఏళ్ల తరబడి నగల వ్యాపారం జరుగుతోంది.
ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేస్తున్నా..
కోనేరు సెంటర్‌లోని మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌కు మరమ్మతులు చేయాలని చిత్తజల్లు సాయిప్రసాద్ అనే ఓ షాపు అద్దెదారు ఇటీవల మునిసిపల్ అధికారులను కోరారు. ఏడాదికి 10 శాతం అద్దె పెంచుతున్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించట్లేదని ఆయన పేర్కొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్‌లో పైకప్పు కూలిపోతోందని, భయం గుప్పెట్లో వ్యాపారాలు చేసుకుంటున్నామని సన్నాల వేణుగోపాలరావు, ఇతర టైలర్లు అధికారులకు విన్నవించారు. అయినా మునిసిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు. కోనేరు సెంటర్‌లోని షాపుల వ్యాపారులకు కనీసం మరుగుదొడ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. షాపులు ఖాళీ చేయాలని మునిసిపల్ కమిషనర్ బాపిరాజు వ్యాపారులకు చెప్పినప్పటికీ.. బతుకు తెరువు కోసం అలాగే భయంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు.
పీ4 కింద కోనేరు సెంటర్‌ను అభివృద్ధి చేస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర
కోనేరు సెంటర్‌లోని షాపుల సమస్యను అక్కడి వ్యాపారులు మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీ4 కార్యక్రమం కింద కోనేరు సెంటర్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా షాపులు నిర్మించిన తరువాత ప్రస్తుతం వ్యాపారాలు చేసుకుంటున్న వారికి అవకాశం కల్పిస్తామన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 01:05 AM