టెండర్ల ట్రాక్‌లోకి..
ABN, Publish Date - Jul 29 , 2025 | 12:53 AM
దశాబ్దం నాటి కల సాకారానికి మొదటి అడుగు పడింది. విజయవాడ మెట్రో రైల్ నిర్మాణ పనులకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీఎల్) అధికారులు సోమవారం టెండర్లు పిలిచారు. సెప్టెంబరు 12 నుంచి టెండర్లు సమర్పించాల్సి ఉండగా, రెండున్నరేళ్లలో మెట్రో మొదటి దశ, రెండేళ్లలో నిడమానూరు-రామవరప్పాడు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించాల్సి ఉంటుంది.
విజయవాడ మొదటి దశ మెట్రోకు టెండర్లు
నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీఎంఆర్‌సీ అధికారులు
రూ.4,150 కోట్ల అంచనాతో మొదటి దశ పనులు
గన్నవరం-పీఎన్‌బీఎస్ వరకు 25.95 కిలోమీటర్లు కారిడార్-1
పెనమలూరు-పీఎన్‌బీఎస్ వరకు 12.45 కిలోమీటర్లు కారిడార్-2
మొత్తం 38.40 కిలోమీటర్ల మేర వయాడక్ట్ నిర్మించాలని నిర్దేశం
32 ఎలివేటెడ్, ఒక అండర్ గ్రౌండ్ సహా 33 స్టేషన్ల నిర్మాణం
విజయవాడ ఎయిర్‌పోర్టు వరకు అండర్ గ్రౌండ్ మెట్రోనే..
సెప్టెంబరు 17న టెండర్ల ఓపెన్.. రెండున్నరేళ్లలో పూర్తి చేయాలి
నిడమానూరు-రామవరప్పాడు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా..
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రూ.4,150 కోట్లతో విజయవాడ మెట్రో కారిడార్-1, 2 మొద టి దశ నిర్మాణ పనులకు సోమవారం టెండర్లు పిలిచారు. రెండు కారిడార్లు కలిపి మొత్తం 38.40 కిలోమీటర్లు ఉండగా, వయాడక్ట్ నిర్మాణ పనులకు ఏపీఎంఆర్‌సీఎల్ టెండర్లు పిలిచింది. ఇందులో అంతర్భాగంగా నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు వరకు 4.33 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్ల డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు కూడా టెండర్లు పిలిచింది. మొత్తం 32 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు, ఒక అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో నిర్దేశించింది. విజయవాడ ఎయిర్‌పోర్టు వరకు అండర్ గ్రౌండ్‌లో మెట్రోను నిర్మించేలా ప్రతిపాదించింది. సెప్టెంబరు 17వ తేదీ వరకు టెండర్ల సమయాన్ని నిర్దేశించింది. ఈ 45 రోజుల్లో భూ సేకరణ, ట్రాఫిక్ మళ్లింపు, పైపులైన్లు, కరెంట్ తీగలు, యూజీడీ పైపులైన్ల మార్పు, రుణ ప్రయత్నాలు కొలిక్కి తీసుకొస్తారు. సెప్టెంబరు 12 నుంచి టెండర్లు సమర్పించాల్సి ఉంటుంది. 12 నుంచి 17వ తేదీ వరకు ఔత్సాహిక కాంట్రాక్టు సంస్థల నుంచి బిడ్లను స్వీకరిస్తారు. 17.. బిడ్లను సమర్పించటానికి ఆఖరి రోజు. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఏపీఎంఆర్‌సీఎల్ టెండర్లను తెరిచి కాంట్రాక్టు సంస్థను ప్రకటిస్తుంది. ఈ 45 రోజుల సమయంలో కాంట్రాక్టర్లతో పలుమార్లు ప్రీబిడ్ మీటింగ్స్ నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో కాంట్రాక్టర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు టెండరు నోటిఫికేషన్‌ను సవరించే అవకాశం ఉంటుంది. టెండర్లు తెరిచి కాంట్రాక్టు సంస్థకు అప్పగించినప్పటి నుంచి 30 నెలలు అంటే.. రెండున్నరేళ్లలో విజయవాడ మొదటి దశ మెట్రో కారిడార్లను పూర్తి చేయాలి. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ పనులు మాత్రం రెండేళ్లలో పూర్తి చేయాలి.
మొదటి దశలో 33 మెట్రో స్టేషన్ల నిర్మాణం
మొదటి దశలో గన్నవరం బస్‌స్టేషన్ నుంచి ఎన్‌హెచ్-16 మీదుగా రామవరప్పాడు రింగ్‌రోడ్డు.. అక్కడి నుంచి ఏలూరు రోడ్డు మీదుగా రైల్వేస్టేషన్‌ను కలుపుతూ పీఎన్‌బీఎస్ వరకు 25.95 కిలోమీటర్ల మేర కారిడార్-1 పనులు చేపట్టాలి. ఇందులో భాగంగా గన్నవరం బస్టేషన్, గన్నవరం సెంటర్, యోగాశ్రమం, ఎయిర్‌పోర్టు, కేసరపల్లి, వేల్పూరు, గూడవల్లి, శ్రీచైతన్య కాలేజీ, నిడమానూరు రైల్వేస్టేషన్, నిడమానూరు, ఎనికేపాడు, ఎంబీటీ సెంటర్, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగ్, గుణదల, పడవలరేవు, మాచవరం డౌన్, సీతారామపురం సిగ్నల్, బీసెంట్ రోడ్డు, రైల్వేస్టేషన్ (ఈస్ట్), రైల్వేస్టేషన్ (సౌత) మెట్రో స్టేషన్ల నిర్మాణంతో పాటు పీఎన్‌బీఎస్ దగ్గర ప్రధాన మెట్రో స్టేషన్‌ను నిర్మించాల్సి ఉంటుంది. అలాగే, పెనమలూరు నుంచి బందరు రోడ్డు మీదుగా 12.45 కిలోమీటర్ల పొడవున కారిడార్-2లో పెనమలూరు, పోరంకి, తాడిగడప, కానూరు సెంటర్, కృష్ణానగర్, అవోక్‌నగర్, ఆటోనగర్, బెంజిసర్కిల్, టిక్కిల్ రోడ్డు, ఐజీఎంసీ స్టేడియం, విక్టోరియా జూబ్లీ మ్యూజియం, పీఎన్‌బీఎస్ మెట్రో స్టేషన్ల నిర్మాణం చేపట్టాలి.
ప్రధాన రహదారులే కేంద్రంగా..
విజయవాడ మీదుగా వెళ్లే రెండు ప్రధాన జాతీయ రహదారులు ఎన్‌హెచ్-16, 65ను మెట్రో ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొచ్చారు. నగరంలో అంతర్గత ప్రధాన రహదారులైన బందరు రోడ్డు, ఏలూరు రోడ్లను కూడా కలిపారు. అత్యంత రద్దీగా ఉండే ఈ రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారగా, మెట్రో రాకతో ఆ సమస్యకు చెక్ పడనుంది.
Updated Date - Jul 29 , 2025 | 12:53 AM