పాఠశాలలపై ప్రత్యేక దృష్టి
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:27 AM
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ఉన్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ఒత్తిడి లేని విద్యావ్యవస్థను ఏర్పాటు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మెగా పేరెంట్ మీటింగ్ 2.0లో భాగంగా గురువారం మచిలీపట్నం కాలేఖాన్‌పేట గోపు వెంకట నానారావు మునిసిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0లో మంత్రి కొల్లు రవీంద్ర
కాలేఖాన్‌పేట మునిసిపల్ స్కూల్‌లో విద్యార్థులతో కలిసి భోజనం
మచిలీపట్నం టౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ఉన్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, ఒత్తిడి లేని విద్యావ్యవస్థను ఏర్పాటు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మెగా పేరెంట్ మీటింగ్ 2.0లో భాగంగా గురువారం మచిలీపట్నం కాలేఖాన్‌పేట గోపు వెంకట నానారావు మునిసిపల్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీల ద్వారా విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను నిర్వీర్యం చేసి విద్యావ్యవస్థను పాడు చేసిందని, ఎయిడెడ్ పాఠశాలల స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నం చేసిందన్నారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశామని, దీనివల్ల విదేశాల్లో తెలుగు యువకులు ప్రముఖ స్థానాన్ని సంపాదించారన్నారు. డీఈవో పి.విజయరామారావు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చామని, చదువుతో పాటు ఆటలు, పాటలు, యోగా నేర్పుతూ వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. హెచ్‌ఎం నారాయణరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో స్థలదాత గోపు వెంకట నానారావు కుమారులను మంత్రి సత్కరించారు. ఎంఈవో దుర్గాప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Updated Date - Jul 11 , 2025 | 12:27 AM