పింఛన్‌దారులను పీడిస్తాడు..!
ABN, Publish Date - Jul 03 , 2025 | 01:03 AM
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆయనో సీనియర్ అసిస్టెంట్. ఇంతకుముందు ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వహించాడు. అక్కడి నుంచి ఇంజనీరింగ్ విభాగానికి పదోన్నతిపై అంతర్గత బదిలీ అయ్యాడు. ఈయనకు అనుభవం ఉందంటూ పింఛన్‌దారులు, ఉద్యోగ విరమణ చేసినవారు తమ ప్రయోజనాల కోసం ఫైల్ ఇస్తున్నారు. ఫైల్ ఇతని వద్దకు వస్తేచాలు.. వారిని ముప్పుతిప్పలు పెట్టి రూ.లక్షలు లాగేస్తున్నాడు.
వీఎంసీలో సీనియర్ అసిస్టెంట్ లీలలు
అడిగినంత ఇస్తేనే పింఛన్ బెనిఫిట్స్
ఇంజనీరింగ్ విభాగంలో చక్రం తిప్పుతున్న వ్యక్తి
సాధారణ, తత్కాల్ సేవల్లా పనికో రేటు
ఎవరికి షోకాజ్ నోటీసులు, పనిష్మెంట్లు ఇచ్చినా..
వివరణ ఈయన ఇవ్వాల్సిందే..
అన్ని సేవలు అందుబాటులో.. ఒక్కో సేవకు
ఒక్కో ధరకార్పొరేషన్, జూలై 2 (ఆంరఽదజ్యోతి) : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆయనో సీనియర్ అసిస్టెంట్. ఇంతకుముందు ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వహించాడు. అక్కడి నుంచి ఇంజనీరింగ్ విభాగానికి పదోన్నతిపై అంతర్గత బదిలీ అయ్యాడు. ఈయనకు అనుభవం ఉందంటూ పింఛన్‌దారులు, ఉద్యోగ విరమణ చేసినవారు తమ ప్రయోజనాల కోసం ఫైల్ ఇస్తున్నారు. ఫైల్ ఇతని వద్దకు వస్తేచాలు.. వారిని ముప్పుతిప్పలు పెట్టి రూ.లక్షలు లాగేస్తున్నాడు. అలాగే, అధికారులెవరైనా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు, పనిష్మెంట్లు ఇచ్చినా.. వివరణ కూడా ఈయనే రాసివ్వడం గమనార్హం. ఒక్క పింఛనే కాదు.. ఆఫీస్ స్థాయిలో రిమార్కులకు సంబంధించిన ఏ ఫైల్ ముందుకెళ్లాలన్నా ఈయన వద్దకు రావాల్సిందే. వీఎంసీలో వివిధ కేటగిరీల్లో పనిచేసే కొందరికీ ఇప్పటికీ పని మీద అవగాహన లేకపోవడంతో ఇటువంటి వారి ఆటలు సాగుతున్నాయి.
గతంలోనూ ఆరోపణలు
ఇతని ప్రావీణ్యం ఎంతటిదంటే గత పుష్కరాల సమయంలో ప్రజారోగ్య విభాగంలో వివిధ పనులకు అడ్డగోలుగా ఫైల్ పెట్టి దోచుకున్నాడు. అప్పటి కమిషనర్ ఇతని తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఒకానొక సమయంలో సస్పెండ్ చేసే వరకు పరిస్థితి వెళ్లింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పెన్షన్ బెన్‌ఫిట్స్ కోసం ఆశ్రయిస్తే చాలు.. వారి పని అయిపోయినట్టే. వచ్చినవాటిలో ఎంత చెబితే అంత ఇతనికి సమర్పించుకోవాల్సిందే. లేకుంటే చుక్కలు చూపిస్తాడు. ఇతని గురించి అధికారులకు పూర్తిస్థాయిలో తెలిసినప్పటికీ ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలియని పరిస్థితి. వచ్చిన సొమ్మును కింద నుంచి పైస్థాయి వరకు వాటాలిస్తూ పనులు చేయిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
బాధితులు ఎంతమందో..
వీఎంసీలో ఒకరిద్దరు కాదు.. చాలామంది ఇతని బాధితుల లెక్కలో ఉన్నారు. పదవీవిరమణ చేసిన వారిలో చాలామంది వద్ద డబ్బు గుంజేశాడు. ఎవరైనా ఎంతోకొంత ఇతనికి ముట్టజెప్పి పని చేయించుకోవాల్సిందే. పీహెచ్ వర్కర్ నుంచి పైస్థాయి అధికారుల వరకూ పింఛన్, ఇతర బెనిఫిట్స్ ఫైల్ ఇతనే పెడతాడంటే ఎంతటి ప్రావీణ్యుడో అర్థమవుతుంది. ప్రజారోగ్యంలో పీహెచ్ వర్కర్ పదవీ విరమణ చేసి, ఇతన్ని కలిస్తే చాలు.. వెంటనే సెక్షన్‌లో ఎస్‌ఆర్ కాపీ తీసుకురమ్మని చెప్పి చకచకా పనిచేస్తాడు. ఏయే బెనిఫిట్లు వస్తాయో హెచ్‌వోల కంటే ఇతనికే ఎక్కువ తెలుసు. ఇలా వచ్చే సొమ్మును బట్టి పర్సంటేజీ తీసుకుంటాడు. శానిటరీ విభాగంలో పనిచేసిన ఎస్‌ఎస్ పదవీవిరమణ బెనిఫిట్స్ కోసం రూ.లక్ష వరకు ముట్టజెప్పినట్లు తెలిసింది. అది చాలదనడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందని తెలిసింది. అలాగే, వీఎంసీలో పనిచేసే మరో మహిళా ఉద్యోగి తాలుకా బెనిఫిట్స్ పింఛన్‌కు సంబంధించి రూ.2 లక్షల వరకు ముట్టజెప్పారని, కొన్ని నెలల క్రితం ఓ పీహెచ్ వర్కర్ పదవీవిరమణ చేయగా, తనకు వచ్చే బెనిఫిట్స్ కోసం రూ.50 వేలు, ఇంకొకరు రూ.లక్ష ముట్టజెప్పినట్లు సమాచారం. 30, 35 ఏళ్లు కష్టించి పనిచేసి పదవీవిరమణ చేసిన ఉద్యోగులు తమకు అందాల్సిన బెనిఫిట్ల కోసం ఇటువంటి దళారులను ఆశ్రయించాల్సి వస్తుందంటే ఆయా విభాగాల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుంది. ఎవరు చేయాల్సిన పనివారు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఇలాంటివారు ఇష్టానుసారం దోచుకుంటున్నారు. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి సెక్షన్ల పనితీరుపై దృష్టిసారించి పదవీవిరమణ చేసిన వారి బెనిఫిట్లు, ఇతరాలు సక్రమంగా అందేలా చూడాలి.
Updated Date - Jul 03 , 2025 | 01:03 AM