అదే కథ..!
ABN, Publish Date - May 30 , 2025 | 01:19 AM
అంతర్గత ఆధిపత్య పోరుతో అభివృద్ధిని విస్మరించడం.. కావాలనే అధికారాన్ని చేజార్చుకోవడం.. నాడు కాంగ్రెస్ పాలనలో, నేడు వైసీపీ హయాంలోనే జరిగాయి. తిరువూరు మున్సిపాలిటీలో సంఖ్యాబలం ఉన్నప్ప టికీ సొంత పార్టీలో సిగపట్లతో చివరికి ఏమీ మిగలకుండా పోయిన తీరు 22 ఏళ్ల తరువాత మళ్లీ రిపీట్ కావడం చర్చకు దారితీస్తోంది. - తిరువూరు
తిరువూరు మున్సిపాలిటీలో 22 ఏళ్ల తరువాత సేమ్ సీన్
నాటి అంతర్గత పోరుతో అధికారం కోల్పోయిన కాంగ్రెస్
ప్రస్తుతం వైసీపీ పాలకవర్గంలోనూ ఇదే పరిస్థితి
సంఖ్యాబలం ఉన్నా అధికారం కోల్పోయిన వైనం
నాడు అలా.. 2001లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మండల పరిషత ఎన్నికల్లో మొత్తం 20 ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రెస్ 16, టీడీపీ 4 గెలుపొందాయి. ఎంపీపీగా కొలికపోగు లక్ష్మణరావు ఎంపికయ్యారు. కొంతకాలం బోర్డు పాలన సజావుగానే సాగినప్పటికీ కాంగ్రెస్ ఎంపీటీసీల్లో నెలకొన్న సంక్షోభంతో నాటి నిబంధనల ప్రకారం రెండున్నరేళ్లకు ఎంపీపీపై అవిశ్వాసం పెట్టారు. మనస్థాపం చెందిన ఎంపీపీ లక్ష్మణరావు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. కొందరు కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలిని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీలు టీడీపీకి మద్దతుగా నిలిచారు. నాడు అక్రమంగా అవిశ్వాసం పెట్టి దింపేసిన కొలికపోగు లక్ష్మణరావునే తిరిగి టీడీపీ అభ్యర్థిగా బలపరిచి గెలిపించుకున్నారు.
నేడు ఇలా.. సరిగ్గా 22 ఏళ్ల తరువాత వైసీపీలో కూడా అదే కథ నడిచింది. ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్న తిరువూరులో వైసీపీకి 17 మంది సభ్యుల బలం ఉంది. టీడీపీ 3 స్థానాలు ఉన్నాయి. అయితే, అధిష్టానం ఆధ్వర్యంలో మొదట్లో తీసుకున్న ఒప్పందం కారణంగా రెండున్నరేళ్లకే చైర్‌పర్సన్ మారాలి. కానీ, అలా జరగలేదు. దీంతో వైసీపీలో అసమ్మతివర్గం ఏర్పడింది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో చైర్‌పర్సన్ రాజీనామా అనివార్యమైంది. కానీ, ప్రస్తుతం రాజకీయ నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు ఎన్నిక రద్దు కాగా, జూన్ 2న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు టీడీపీకి మద్దతుగా నిలబడటంతో కౌన్సిల్‌లో టీడీపీకి 11 స్థానాల బలం పెరిగి గెలుపు లాంఛనం కానుంది.
తొమ్మిదేళ్లలో మూడో చైర్‌పర్సన్
తిరువూరు మున్సిపాలిటీగా ఏర్పడిన తొమ్మిదేళ్లలో మూడో చైర్‌పర్సన్ ఎన్నిక జూన్ 2న జరగనుంది. 2014 మార్చిలో జరిగిన మున్సిపల్ తొలి ఎన్నికల్లో మొత్తం 20 స్థానాలకు గాను టీడీపీ 12, వైసీపీ 7, సీపీఎం ఒక్కస్థానంలో గెలిచాయి. ఐదేళ్ల బోర్డు పరిపాలన సాఫీగానే సాగింది. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేశారు. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 17, టీడీపీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. వైసీపీ బోర్డు ఏర్పాటు నుంచి ఆ పార్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లతో పాటు అప్పటి ఎమ్మెల్యే సహాయ నిరాకరణ చేశారు. దీంతో అభివృద్ధి పథకాలు అంతగా జరగలేదు. ఏదేమైనా వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఆధిపత్యపోరే బోర్డు చేజారిపోవడానికి కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
నోటీసులు అందజేత
తిరువూరు మున్సిపల్ చైర్‌పర్సన్ ఉప ఎన్నిక అజెండా నోటీసులు గురువారం కౌన్సిలర్లకు అందాయి. మొత్తం 20 మంది సభ్యులతో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యుడు, ఎమ్మెల్యే ఇళ్లకు వెళ్లి గురువారం రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది ఈ నోటీసులు అందించారు.
కౌన్సిలర్లకు గన్‌మ్యాన్లు
మున్సిపల్ చైర్‌పర్సన్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ, ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న కౌన్సిలర్లకు గన్‌మ్యాన్లను కేటాయించారు. గురువారం 8 మంది సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. గతంలో 11 మంది కౌన్సిలర్లకు గన్‌మ్యాన్లను కేటాయించగా, ప్రస్తుతం మరి కొందరికి కేటాయించారు.
Updated Date - May 30 , 2025 | 01:19 AM