మంచి కిక్కు ఇచ్చే కల్చర్
ABN, Publish Date - Jun 29 , 2025 | 01:20 AM
జీవితం ఒక్కటే.. ఆనందం కోసం ఎన్నో మార్గాలు వెతుక్కుంటాం. ఆహ్లాదం కోసం కొందరు, ఆహారం కోసం ఇంకొందరు ఆనందాన్ని వెతుక్కుంటారు. మరికొందరు మాత్రం ఆ ఆనందం గ‘మ్మత్తు’గా ఉండాలనుకుంటారు. ఎన్ని కష్టాలున్నా రేపటికి వాయిదా వేసేసి, ఆరోజును మత్తుతో కప్పేయాలనుకుంటారు. మెట్రోపాలిటన్ హంగులతో ముందుకెళ్తున్న విజయవాడ నగరంలో కూడా ఈ కిక్కు ఇచ్చే కల్చర్ బాగానే వేళ్లూనుకుంటోంది. ఫైవ్‌స్టార్ హోటల్ రేంజ్‌లో కొత్తగా పుట్టుకొస్తున్న మద్యం మార్టులే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
నగరంలో రాయల్ లుక్ మద్యం మార్టులు
ఫారెన్ లిక్కర్ బ్రాండ్స్‌తో ఘనంగా ఏర్పాటు
ఫైవ్‌స్టార్ సదుపాయాలతో ఆహ్వానం
అందుబాటులో రూ.లక్షల విలువైన మద్యం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అమరావతి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో విజయవాడ కూడా మెట్రోపాటిలిన్ నగరాల జీవనశైలికి దగ్గరవుతోంది. చాలాకాలంగా నగరంలో నైట్ కల్చర్ ఎక్కువవుతుండటంతో అర్ధరాత్రి 12 దాటినా నచ్చిన ఫుడ్ దొరుకుతుంది. ఒక్కసారిగా మారిపోయిన జీవనశైలి మద్యం రంగంలోనూ వినూత్న మార్పులను తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ మద్యం బ్రాండ్లను రుచి చూడాలనుకునే మందుబాబులకు నగరంలో అన్ని వెరైటీలు లభిస్తున్నాయి. ఫ్రాన్స్, స్కాట్లాండ్, మెక్సికో, జర్మనీ తదితర దేశాల మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పులకు అనుగుణంగా లిక్కర్ మార్ట్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా బెంజిసర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన ‘రా లిక్కర్ హెవెన్’ మద్యం మార్ట్‌లో ఫైవ్‌స్టార్ కేటగిరీ కింద విక్రయాలు జరుగుతున్నాయి. గాయత్రీనగర్‌లో మరో మాల్ ఏర్పాటుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి తరహా లిక్కర్ అవుట్‌లెట్ ఒకటి డీవీ మానర్ రోడ్డులో ఏర్పాటు చేశారు. ఎవరు ఏది తాగినా సరే.. అందరూ డిగ్నిఫైడే అనిపించుకునేలా ఈ స్టోర్స్‌ను ఇంద్రభవనాల్లా సిద్ధం చేస్తున్నారు.
రూ.27 వేల నుంచి రూ.7 లక్షల వరకు..
బెంజిసర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన రా లిక్కర్ హెవెన్ లిక్కర్ మార్ట్ ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలదన్నేలా ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల మద్యం బ్రాండ్లు దొరుకుతాయి. స్వదేశీ మద్యంతో పాటు విదేశీ బ్రాండ్లు ప్రత్యేకం. సాధారణ, మధ్యతరగతి ప్రజల నుంచి మిలియనీర్ వరకు అందరూ కొనేందుకు వీలుగా అన్ని రకాల మద్యం బాటిళ్లు ఇక్కడ లభిస్తాయి. సామాన్యులు, మధ్యతరగతి వర్గాలకు కూడా ఇవి అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో రూ.190 నుంచి లోకల్ మద్యం బ్రాండ్స్ అందుబాటులో ఉంచారు. ఈ మార్ట్‌లో ప్రీమియం బ్రాండ్లు మాత్రమే అమ్ముతారు. ఈ ప్రీమియం బ్రాండ్లలో రెడ్ వైన్, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, వోడ్కా, బీర్ వంటి విదేశీ బ్రాండ్లు ఉంటాయి. వీటి ధర కనిష్టంగా రూ.27 వేల నుంచి గరిష్టంగా రూ.7.33 లక్షల వరకు ఉంటుంది. ఫ్రాన్స్‌కు చెందిన లూయీస్ 13 బ్రాండ్ బాటిల్ ధర రూ.7.33 లక్షలు ఉంది. రేమి మార్టిన్ బాటిల్ రూ.68 వేలకు లభిస్తుండగా, స్కాట్లాండ్‌కు చెందిన ది సింగిల్ టన్ బాటిల్ రూ.10,300, జర్మనీకి చెందిన జాగర్ మార్టర్ రూ.5,040, మెక్సికోకు చెందిన టకీలా బ్రాండ్ బాటిల్ రూ.4,300, బ్లూ లే బుల్ రూ.37 వేలు, రాయల్ సెల్యూట్ రూ.28 వేలు వంటి బ్రాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. త్వరలో ప్రారంభంకానున్న ఈ మార్ట్‌లో మరిన్ని విదేశీ బ్రాండ్స్ వచ్చే అవకాశం ఉంది. నచ్చిన బ్రాండ్స్ కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లవచ్చు. తాగటానికి అనుమతి లేదు. వీటితో పాటు విదేశీ సిగార్స్, లైటర్స్ కూడా విక్రయిస్తారు.
Updated Date - Jun 29 , 2025 | 01:20 AM