దుర్గగుడిలో ప్రక్షాళన
ABN, Publish Date - Jun 07 , 2025 | 01:16 AM
శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానంలో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నోడల్ ఆఫీసర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దుర్గగుడిలో ప్రక్షాళనకు గతనెల 6న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దేవదాయ శాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్, ఇతర విభాగాల ఉన్నతాఽధికారులతో సమీక్ష నిర్వహించారు.
ప్రత్యేక నోడల్ ఆఫీసర్ల నియామకం
ఇంద్రకీలాద్రి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానంలో మెరుగైన సౌకర్యాలు అందించేందుకు నోడల్ ఆఫీసర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దుర్గగుడిలో ప్రక్షాళనకు గతనెల 6న ముఖ్యమంత్రి చంద్రబాబు.. దేవదాయ శాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్, ఇతర విభాగాల ఉన్నతాఽధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈనెల 3న దేవదాయ శాఖ కమిషనర్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఈవో శీనానాయక్‌కు మార్గదర్శకాలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ ఉత్తర్వుల అమలుకు సంబంధించిన కార్యాచరణ నివేదికను కూడా ఈనెల 9న జరిగే సమీక్షలో సమర్పించాలని కూడా ఆదేశించారు. ఈ క్రమంలోనే నోడల్ ఆఫీసర్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ఈవో ప్రకటించారు. నోడల్ ఆఫీసర్లుగా నియమితులైన వారంతా రెగ్యులర్ విధులతో పాటు ప్రక్షాళన విధులను కూడా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
నోడల్ ఆఫీసర్ల బాధ్యతలు ఇవీ..
ఆలయంలో తయారయ్యే అన్ని రకాల ప్రసాదాలు, అన్నప్రసాదం, సరుకుల నాణ్యతా పరిశీలన, ఇతర ప్రమాణాలపై నివేదికల సమర్పణ, తదితరాలకు నోడల్ ఆఫీసర్‌గా ఏఈవో ఎన్.రమేశ్‌బాబును నియమించారు.
సీసీ టీవీ ఫుటేజీ, కెమెరాల పనితీరు, కంట్రోల్ రూమ్ తనిఖీ, సీసీ టీవీ ఆపరేటర్ల విధులపై నియంత్రణ తదితరాలకు నోడల్ ఆఫీసర్‌గా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.కోటేశ్వరరావును నియమించారు.
భక్తులకు మార్గదర్శనం చేసే సమాచార బోర్డుల ఏర్పాటు డిజైన్, తదితర పనులకు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (ఏఈవో కేడర్) డాక్టర్ కె.గంగాధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.అశోక్‌కుమార్‌ను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు.
ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చే పాలు తాగే పిల్లలున్న తల్లులకు సౌకర్యవంతంగా ఉండేందుకు బేబీ ఫీడింగ్ రూమ్‌ల ఏర్పాటు, సౌకర్యాల పర్యవేక్షణకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి.అశోక్ కుమార్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.
నీటి పరీక్షలు చేయటం, ట్యాంకులను శుభ్రం చేయటం తదితర పనులకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.కుటుంబరావును నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.
ఆలయానికి వచ్చే భక్తుల అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా సేకరించే విధానానికి శ్రీకారం చుడుతూ ఐటీ కో-ఆర్డినేటర్ పి.హరీశ్, ఏఈవో సీహెచ్ సునీల్ కుమార్‌ను నోడల్ ఆఫీసర్లుగా నియమించారు.
Updated Date - Jun 07 , 2025 | 01:16 AM