ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బదిలీల వేళ పదోన్నతులు

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:50 AM

బదిలీల వేళ.. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషతలో కొందరు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించటం వివాదాస్పదమవుతోంది. ఈ ముసుగులో జడ్పీ కార్యాలయ అధికారులు భారీగా ముడుపులు దండుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

జడ్పీలో ధనకార్యాలు

ఆరుగురు ఉద్యోగులకు పదోన్నతుల వివాదం

నిబంధనలకు విరుద్ధంగా బదిలీల సమయంలో..

భారీగా డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు

ఏవో పోస్టింగుల్లోనూ అవినీతి వ్యవహారాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఐదేళ్లు ఒకేచోట సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు బదిలీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు ఈనెల 9వ తేదీ వరకు గడువు విధించింది. అయితే, కృష్ణాజిల్లా పరిషతలో బదిలీల వేళ ఉద్దేశపూర్వకంగా పదోన్నతులకు తెరతీశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ హారిక, సీఈవో కన్నమనాయుడు సమక్షంలో కొందరైతే సంబరాలు చేసుకున్నారు. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీల ప్రక్రియ అమల్లో ఉన్నపుడు పదోన్నతులు ఇవ్వకూడదు. ఎందుకంటే.. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీనియర్లు ఉంటే వారికి వారు స్థానచలనం కలిగేటప్పుడు అన్యాయం జరుగుతుందని. బదిలీలు పూర్తిగా నిర్వహించాక పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తే ఎవరికి ఏ సమస్యా ఉండదు. కానీ, ఉమ్మడి కృష్ణా జడ్పీ అధికారులు అకస్మాత్తుగా పదోన్నతుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. జూనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న కొందరికి సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. ఈ పదోన్నతుల వ్యవహారం మాటున జడ్పీ కీలక అధికారి పాత్ర ఉందని, భారీగా ముడుపులపర్వం నడిచిందన్న ఆరోపణలు వస్తున్నాయి. జడ్పీ కార్యాలయంలోని సీసీ ఒకరు... పదోన్నతులు అందుకోబోయే కొందరి నుంచి భారీగా ముడుపులు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

గత ఐదేళ్ల ముచ్చట

జడ్పీలో పోస్టింగ్‌లు అంటే ముడుపుల వ్యవహారంగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో బదిలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. జడ్పీ చైర్‌పర్సన్‌ భర్త అనధికారికంగా జడ్పీ కార్లను ఉపయోగించటంతో పాటు ఆయిల్‌ను కూడా విచ్చలవిడిగా వాడుకునేవారు. ఆయన చెప్పినట్టుగానే పాలన నడిచేది. తన అనుచరులకు పోస్టులు ఇచ్చుకునేవారు. జడ్పీలో పనిచేసే వారిని ఇంటి దగ్గర పని చేయించుకునేవారు. ఆస్తులను అన్యులకు కట్టబెట్టారు. రెన్నోవేషన్‌ పేరుతో జరిగిన పనుల్లోనూ అవినీతి జరిగింది. విజయవాడలోని జడ్పీ కార్యాలయంతో పాటు జడ్పీ ఆవరణలో ఉన్న జేసీ కార్యాలయాన్ని కూడా పడేసేందుకు ప్లాన్‌ వేయగా, అప్పటి కలెక్టర్‌ దిల్లీరావు అడ్డుపడ్డారు. ఈ వ్యవహారాలు మీడియాకు చెబుతున్నారన్న అనుమానంతో కొందరు ఉద్యోగులను శివారు ప్రాంతాలకు బదిలీ చేశారు.

ఏవో పోస్టింగుల్లో అవినీతి కంపు

జడ్పీ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఏవోలను సస్పెండ్‌ చేశారు. వీరు 4 నుంచి 8 నెలల్లోపు తగిన కారణాలు చూపిస్తే తిరిగి పోస్టింగ్‌ పొందొచ్చు. సస్పెండ్‌ అయిన 6 నెలల తర్వాత కూడా ఇప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వలేదు. వీరికి తిరిగి పోస్టింగ్‌లు ఇప్పిస్తామన్న ఆఫర్‌ ఇచ్చి భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, వీరికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా.. మరో ఇద్దరికి వారి స్థానాల్లో పోస్టింగ్‌లు కల్పించారు. ఈ వ్యవహారంలోనూ కాసులు చేతులు మారాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. సస్పెండ్‌ అయిన పోస్టుల్లో ఆరు నెలల వరకు ఎవరికీ పోస్టింగ్‌లు ఇవ్వకూడదు. కానీ జడ్పీ అధికారులు అనధికారికంగా పోస్టింగ్‌లు ఇచ్చేశారు.

Updated Date - Jun 05 , 2025 | 12:52 AM